సహజంగా ప్రతీ మనిషిలోనూ నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి, వాటిని ప్రకటితం చెయ్యడానికి కొన్ని అంశాలు కావాలి. సామాజిక జాఢ్యాలను ఎండగట్టడం వల్ల కొంతైనా ఈ అసంతృప్తులు బంధవిమోచనం పొంది మనసు కుదుటపడుతుంది. ఈ క్షణం రాజకీయాలను దూషిస్తూ మనం గళం ఎత్తామంటే దానికి మూలం ఆ రాజకీయాలు ఒక్కటే కారణం కాదు, ఇతరత్రా ఎన్నో అసంఘటిత అసంతృప్తులు మనసులో ఇమడలేక ఏదో రూపేణా, ఏదో ఒక బలీయమైన అంశం ఆసరాగా సమాజంపై, వ్యవస్థపై వెళ్లగక్కబడుతుంటాయి. అలాంటి అసంతృప్తులు విమర్శల జడివానలా పెల్లుబికేటప్పుడు మనం విమర్శించడానికి ఎంచుకున్న అంశం ఒక్కటే బయటి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుంది తప్ప ఆ అంశానికి మూలాధారాలైన అస్పష్ట అసంతృప్తులు నిగూఢంగానే ఉండిపోతాయి. అందుకే ఏ విమర్శకైనా నిర్థిష్టమైన ఆధారం ఉండదు. తిట్టాలనిపిస్తోంది కాబట్టి తిడుతుంటాం. ఎందుకు తిట్టాలి అని ఎదురు ప్రశ్నించుకుంటే ఆ అంశంపై మనకున్న వ్యతిరేకత కన్నా మనలో గూడుకట్టుకున్న ఇతర అసంతృప్తులదే కీలకభూమిక అని తేలుతుంది. అకారణంగా ప్రతీ దాన్నీ విమర్శిస్తూ ఓ రకమైన అసంతృప్తివాదులుగా చలామణి అయ్యే వారు ఎక్కువగా ఈ కోవకు చెందుతుంటారు. జీవితంలో మూటగట్టుకున్న చేదు అనుభవాలు ప్రతీ దానిలోనూ లోపాలు ఎత్తిచూపే తత్వాన్ని మిగల్చడం వల్ల... బలీయమైన కారణం లేకపోయినా అన్ని అంశాల పట్లా నిరసన గళమే వీరిలో ప్రస్ఫుటంగా కన్పిస్తుంటుంది.
ఇదిలా ఉంటే అందరికీ బాగా కన్పించే దానిలో లోపం వెదికిపట్టి మరీ అందరి దృష్టినీ ఆకర్షించాలన్న తపన కొందరిలో కన్పిస్తుంది. ఆయా అంశాలతో వాస్తవానికి వీరికి ఎలాంటి సమస్యా ఉండదు. ఆ అంశం లోతుపాతులు తెలిసి ఉండవలసిన అవసరం కూడా వీరికి లేదు. ఆ అంశంపై అనుభవం, అవగాహన లేకపోయినా భౌతికంగా ఆ సమస్య ఎలా కన్పిస్తుందో ఆ నిర్మాణాన్ని స్థూలంగా మనసులోకి తీసుకుని విశ్లేషించి యధేచ్ఛగా విమర్శకు దిగుతుంటారు. ఇక్కడ వారి లక్ష్యం తమ తార్కికత పదిమంది గుర్తించాలన్నది. సమస్యపై గతానుభవం వల్ల వచ్చే గాఢత లేకపోతే ఇప్పటికప్పుడు అల్లుకున్న తర్కం నిష్ర్పయోజనం అన్నది వారు గుర్తించలేరు.
అసంతృప్తుల వల్లనైతేనేమి, గుర్తింపు యావతోనైతేనేమి ఏ అంశంలో అయినా మొదట మనం చెడునే చూడగలుగుతున్నాం అంటే మన మనస్సు విమర్శలు, వివాదాలకు మాత్రమే ఆనందం పొందేలా లంగరు వేయబడిందన్నమాట. సమాజంలో అక్కడక్కడ మంచి జరుగుతోందంటే నమ్మలేనంత, నమ్మినా దాన్ని జీర్ణించుకోలేనంత, ఆ మంచిని లేనిపోని సందేహాలతో నిరుత్సాహపరిచేటంత మైకంలో కూరుకుపోయినట్లు లెక్క.. మన విమర్శలకు ఏ సామాజిక జాఢ్యాలను ఆసరాగా తీసుకుంటున్నామో అంతకన్నా బలీయమైన మానసిక జాఢ్యాలు మనల్ని నిలువునా ముంచేసి మనకు తెలియకుండానే మనల్ని సంఘ వ్యతిరేక శక్తులుగా తయారు చేసినట్లు గుర్తించాలి.
చివరిగా ఇది ఓ ఒక్కరినో గాయపరచడానికి చేసిన విశ్లేషణ కాదు. విమర్శించడంలోనే ఎక్కువ ఆనందం చూస్తూ మంచిని గ్రహించలేకపోతున్న మనలోని ఓ పార్శ్యాన్ని వెలికి తీసే ప్రయత్నమే ఇది. మన మనస్థత్వాన్నీ స్వయంగా విమర్శించేదిగా ఉన్న ఈ విశ్లేషణా ఓ రకంగా విమర్శే. కాకపోతే మానవ మనస్థత్వాన్ని ఆవిష్కృతం చెయ్యడం కోసం ఇది విమర్శ రూపం సంతరించుకోక తప్పలేదు.
Update:
ముంబాయి బాంబుపేలుళ్ల ఘటన చాలా కలిచివేసింది. ఎంత నిభాయించుకున్నా దానికి స్పందించకుండా ఎవరం ఉండలేం. ఆ ఘటన జరగకముందు నిన్న సాయంత్రం రాయబడిన ఆర్టికల్ ఈ "మన విమర్శల్లో లోతెంత?" అనేది. దయచేసి ఎవరూ ఆ ఘటన పట్ల మనలో వ్యక్తమయ్యే నిరసనలకు ఈ ఆర్టికల్ కీ ముడిపెట్టవద్దని మనవి.
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
శ్రీధర్ గారూ!
చాలా బాగా రాశారు! :)
So true!!! Goo one Sridhargaru
nice one.
సముద్రం ప్రశాంతంగా ఉందనుకొండి, ఆ ప్రశాంతతని చూస్తూ చిత్తం ప్రశాంతం చేసుకొని, ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందించే వాళ్ళు కొందరు. "అబ్బ! ఇంత ప్రశాంతంగా ఉందేంటబ్బా!" అని ఓ రాయి వేసి ఆ కదలికలను, చూసి ఆనందిచేవాళ్ళు కొందరు. అందుకే అంటారు "ప్రశంతమైన సముద్రంలో రాయి వేసి అల్లకల్లోలం సృష్టించకు అని." ఇక్కడ విమర్శలు రాయి లాంటివే. రాయి విసురుని బట్టి సముద్రం కల్లోలపడడం జరుగుతుంది. విమర్శల తాకిడిని బట్టి ఎంత ప్రశాంతత కోల్పోయామో తెలుస్తుంది. లోతు చెప్పడం కష్టమే మరి.
సద్విమర్శల గురించి కాదు కదా ఇక్కడ అనుకొనేది. దానికి ఈ రాయి వర్తించదు.
చాలా మంచి టపా.థాంక్స్. విమర్శకులకు చాలా ఉపయుక్తంగాను, తెలిసో తెలియకో తప్పుగా విమర్శిస్తున్న వారిని తట్టిలేపేదిలా ఉంది మీరు వ్రాసినా ఈ వ్యాసం.
సత్యం చెప్పారు శ్రీధరు గారూ. విశ్లేషణ ఆలోచించేదిగా ఉంది .చాలా మంచి పోస్ట్ .
@యోగి గారు ధన్యవాదాలు.
@ లక్ష్మి గారు, థాంక్యూ అండీ.
@ చైతన్య గారు థాంక్యూ వెరీమచ్
@ రమణి గారు విమర్శల గురించి మరొక కోణంలో అద్భుతంగా రాశారు. అవును సద్విమర్శల గురించి కాదు ఈ పోస్ట్.
@ అనానిమస్ గారు, మీరు ప్రస్తావించినట్లు బహుముఖ ప్రయోజనం ఉంటే అంతకన్నా కావలసిందేముంది. మీకు ధన్యవాదాలు.
@ వేద గారు ధన్యవాదాలండీ.
టపా బాగుంది. ఈ సారి 'మన పొగడ్తలలో సరుకెంత' అనే దాని పై రాయండి.
అవును! ఇలాంటి విమర్శలు నిజంగా అవసరం.విశ్లేషణాత్మకంగా రాసారు.
Post a Comment