Wednesday, November 26, 2008

మన విమర్శల్లో లోతెంత?

సహజంగా ప్రతీ మనిషిలోనూ నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి, వాటిని ప్రకటితం చెయ్యడానికి కొన్ని అంశాలు కావాలి. సామాజిక జాఢ్యాలను ఎండగట్టడం వల్ల కొంతైనా ఈ అసంతృప్తులు బంధవిమోచనం పొంది మనసు కుదుటపడుతుంది. ఈ క్షణం రాజకీయాలను దూషిస్తూ మనం గళం ఎత్తామంటే దానికి మూలం ఆ రాజకీయాలు ఒక్కటే కారణం కాదు, ఇతరత్రా ఎన్నో అసంఘటిత అసంతృప్తులు మనసులో ఇమడలేక ఏదో రూపేణా, ఏదో ఒక బలీయమైన అంశం ఆసరాగా సమాజంపై, వ్యవస్థపై వెళ్లగక్కబడుతుంటాయి. అలాంటి అసంతృప్తులు విమర్శల జడివానలా పెల్లుబికేటప్పుడు మనం విమర్శించడానికి ఎంచుకున్న అంశం ఒక్కటే బయటి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుంది తప్ప ఆ అంశానికి మూలాధారాలైన అస్పష్ట అసంతృప్తులు నిగూఢంగానే ఉండిపోతాయి. అందుకే ఏ విమర్శకైనా నిర్థిష్టమైన ఆధారం ఉండదు. తిట్టాలనిపిస్తోంది కాబట్టి తిడుతుంటాం. ఎందుకు తిట్టాలి అని ఎదురు ప్రశ్నించుకుంటే ఆ అంశంపై మనకున్న వ్యతిరేకత కన్నా మనలో గూడుకట్టుకున్న ఇతర అసంతృప్తులదే కీలకభూమిక అని తేలుతుంది. అకారణంగా ప్రతీ దాన్నీ విమర్శిస్తూ ఓ రకమైన అసంతృప్తివాదులుగా చలామణి అయ్యే వారు ఎక్కువగా ఈ కోవకు చెందుతుంటారు. జీవితంలో మూటగట్టుకున్న చేదు అనుభవాలు ప్రతీ దానిలోనూ లోపాలు ఎత్తిచూపే తత్వాన్ని మిగల్చడం వల్ల... బలీయమైన కారణం లేకపోయినా అన్ని అంశాల పట్లా నిరసన గళమే వీరిలో ప్రస్ఫుటంగా కన్పిస్తుంటుంది.

ఇదిలా ఉంటే అందరికీ బాగా కన్పించే దానిలో లోపం వెదికిపట్టి మరీ అందరి దృష్టినీ ఆకర్షించాలన్న తపన కొందరిలో కన్పిస్తుంది. ఆయా అంశాలతో వాస్తవానికి వీరికి ఎలాంటి సమస్యా ఉండదు. ఆ అంశం లోతుపాతులు తెలిసి ఉండవలసిన అవసరం కూడా వీరికి లేదు. ఆ అంశంపై అనుభవం, అవగాహన లేకపోయినా భౌతికంగా ఆ సమస్య ఎలా కన్పిస్తుందో ఆ నిర్మాణాన్ని స్థూలంగా మనసులోకి తీసుకుని విశ్లేషించి యధేచ్ఛగా విమర్శకు దిగుతుంటారు. ఇక్కడ వారి లక్ష్యం తమ తార్కికత పదిమంది గుర్తించాలన్నది. సమస్యపై గతానుభవం వల్ల వచ్చే గాఢత లేకపోతే ఇప్పటికప్పుడు అల్లుకున్న తర్కం నిష్ర్పయోజనం అన్నది వారు గుర్తించలేరు.

అసంతృప్తుల వల్లనైతేనేమి, గుర్తింపు యావతోనైతేనేమి ఏ అంశంలో అయినా మొదట మనం చెడునే చూడగలుగుతున్నాం అంటే మన మనస్సు విమర్శలు, వివాదాలకు మాత్రమే ఆనందం పొందేలా లంగరు వేయబడిందన్నమాట. సమాజంలో అక్కడక్కడ మంచి జరుగుతోందంటే నమ్మలేనంత, నమ్మినా దాన్ని జీర్ణించుకోలేనంత, ఆ మంచిని లేనిపోని సందేహాలతో నిరుత్సాహపరిచేటంత మైకంలో కూరుకుపోయినట్లు లెక్క.. మన విమర్శలకు ఏ సామాజిక జాఢ్యాలను ఆసరాగా తీసుకుంటున్నామో అంతకన్నా బలీయమైన మానసిక జాఢ్యాలు మనల్ని నిలువునా ముంచేసి మనకు తెలియకుండానే మనల్ని సంఘ వ్యతిరేక శక్తులుగా తయారు చేసినట్లు గుర్తించాలి.

చివరిగా ఇది ఓ ఒక్కరినో గాయపరచడానికి చేసిన విశ్లేషణ కాదు. విమర్శించడంలోనే ఎక్కువ ఆనందం చూస్తూ మంచిని గ్రహించలేకపోతున్న మనలోని ఓ పార్శ్యాన్ని వెలికి తీసే ప్రయత్నమే ఇది. మన మనస్థత్వాన్నీ స్వయంగా విమర్శించేదిగా ఉన్న ఈ విశ్లేషణా ఓ రకంగా విమర్శే. కాకపోతే మానవ మనస్థత్వాన్ని ఆవిష్కృతం చెయ్యడం కోసం ఇది విమర్శ రూపం సంతరించుకోక తప్పలేదు.

Update:

ముంబాయి బాంబుపేలుళ్ల ఘటన చాలా కలిచివేసింది. ఎంత నిభాయించుకున్నా దానికి స్పందించకుండా ఎవరం ఉండలేం. ఆ ఘటన జరగకముందు నిన్న సాయంత్రం రాయబడిన ఆర్టికల్ ఈ "మన విమర్శల్లో లోతెంత?" అనేది. దయచేసి ఎవరూ ఆ ఘటన పట్ల మనలో వ్యక్తమయ్యే నిరసనలకు ఈ ఆర్టికల్ కీ ముడిపెట్టవద్దని మనవి.

Monday, November 24, 2008

సినిమా మనిషి కబుర్లు - చిరంజీవి ఎమోషన్స్ వక్రీకరించబడిన ఉదంతం

సినీ తారల మాటలు, ఎమోషన్స్ ఎంత వక్రీకరించబడతాయో, ఒక్కోసారి ఎంత వివాదాస్పదం అవుతాయో ఓ చిన్న ఉదాహరణ ప్రస్తావిస్తూ ఈ "సినిమా మనిషి కబుర్లు" సీరియల్ ప్రారంభిస్తాను.

ఆరోజు చెన్నైలో దాసరి అరుణ్ కుమార్ "గ్రీకు వీరుడు" ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలిపోతున్న తరుణం అది. అప్పటికీ 30-40% షూటింగ్ లు, 90 శాతానికి పైగా రికార్డింగ్ లు చెన్నైలో జరుగుతూ ఉన్నాయి. ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య, భానుచందర్ మరికొందరు నటీనటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. చిరంజీవి గారు రావడం రావడం దాసరి దంపతుల్ని, అరుణుకుమార్ ని, ఇతర నటీనటులను తనదైన శైలిలో విష్ చేసి.. జర్నలిస్టులమైన మావద్దకు వచ్చారు. పసుపులేటి రామారావు, జగన్, మణిగోపాల్ (ఇప్పుడు పేరు మార్చుకుని ఓ ప్రముఖ గేయ రచయిత అయ్యారు), ఉమామహేశ్వరరావు తదితరులతో కూడిన బృందం మాది. అప్పటికి కొద్దిరోజుల ముందు చిరంజీవి షూటింగులకు ఇబ్బంది అవుతున్న రీత్యా అక్కడే ఇల్లు తీసుకుని హైదరాబాద్ కి మకాం మార్చారు.
చెన్నై సినిమా జర్నలిస్టులతో ఆయనకు సాన్నిహిత్యం ఎక్కువ. చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎన్నో సంవత్సరాల పాటు ఓ కుటుంబంలా అనేక ఫంక్షన్లలో కలిసి కబుర్లు చెప్పుకునే జర్నలిస్ట్ మిత్రులను విడిచి కొత్త ప్రదేశంలో కొత్త జర్నలిస్టులతో పూర్తిగా ప్రొఫెషనల్ గా మారడం ఒక మనిషిగా ఆయనకి బాధనిపించింది. మా సమీపానికి వచ్చి పేరుపేరునా పలకరిస్తూ హత్తుకుంటూ సడన్ గా ఎమోషనల్ అయ్యారు. "మిమ్మల్నందరినీ విడిచి హైదరాబాద్ లో ఉండడం చాలా బాధగా ఉంది.. నేను అక్కడ ఉన్నానే కానీ నా మనసంతా మీ దగ్గరే ఉంది" అంటూ కళ్లు చెమర్చుకున్నారు.
నిజమే కదా.. కొన్నేళ్లపాటు ఒక నగరంతో ముడిపడిన అనుబంధం అక్కడి బంధాలను తెంచుకుని వెళ్లవలసి వస్తే ఎంత బాధ అన్పిస్తుందో కదా! ఎంతటి సెలబ్రిటీ అయినా అలాంటి ఎమోషన్స్ ని ఆత్మీయులు కన్పించినప్పుడు కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాని పని. ఆఫ్ ది రికార్డ్ కాదు. అందులో ఏ విధమైన వివాదమూ లేదు. నేను జరిగింది జరిగినట్లు మా పత్రికలో రాశాను. ఒక సాధారణ హ్యూమన్ బీయింగ్ గా సెలబ్రిటీల ఎమోషన్స్ ని, అదీ మా జర్నలిస్టుల మీద ఎఫెక్షన్ తో బయటపడేసరికి రాయకుండా ఉండలేకపోయాను.

ఇంకేముంది వివాదం మొదలైంది. "చిరంజీవి చెన్నై వెళ్లి కళ్లనీళ్లు పెట్టుకున్నాడట. హైదరాబాద్ కి సినిమా ఫీల్డ్ రావడం ఆయనకు ఇష్టం లేదట.." అంటూ హైదరాబాద్ కోటరీ విచ్చలవిడిగా ఊహాగానాలు ప్రచారం చేస్తూ తమ పత్రికల్లో రాశారు. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరూ చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఇక్కడ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండాలా, చెన్నైలో ఉండాలా అన్నది కాదు ముఖ్య విషయం. కొన్నేళ్ల పాటు ఒక చోట ఉన్న వ్యక్తి సడన్ గా ప్రదేశం మారేసరికి ఫీలయ్యే అలజడే చిరంజీవి ఫీల్ అయ్యారు. దాన్ని సాటి మనిషిగా అర్థం చేసుకోవడం మానేసి రాజకీయం చేసి చిరంజీవిపై "ఏంటీ హైద్రాబాద్"ముద్ర తగిలించడం బాధేసింది.

ఒక సెలబ్రిటీ తన బాధలను, ఎమోషన్స్ ని స్వేచ్ఛగా express చెయ్యలేనంతగా.. కొండొకచో ఎమోషనల్ అయితే అపార్థాలు తీస్తూ ఎంత ఇరకాటంలో పెడతారో ఈ ఉదాహరణ చూస్తే అర్థమై ఉంటుంది. ఇక్కడ నేను చిరంజీవి అభిమానిని కాదు. అస్సలు నేను జర్నలిస్ట్ గా ఎవరి అభిమానినీ కాదు అన్నది మున్ముందు ఈ సిరీస్ లో రాసే ఇతర "కబుర్లు"ని చదివితే మీకు అర్థమవుతుంది. ఒక human beingగా వారి సమస్యలను సమీపం నుండి గమనించిన తర్వాత.. మనకు ప్రతీరోజూ పేపర్లలో వచ్చే పుకార్ల వంటి వాటిలో ఎంత నిజం ఉంటుందో ఆలోచిస్తారని ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను.

సినిమా మనిషి కబుర్లు

తళుకుబెళుకుల తారాలోకం అది! ఆ తళుకులకు ఆకర్షింపబడని మిణుగురు పురుగులు ఉండవేమో! మిణుగురులు అంత స్థాయిలో కాకుండా తారల గురించి, సినిమా రంగం గురించి తెలుసుకోవాలని చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. తారాలోకంలోకి ఓ సినిమా పత్రిక సబ్ ఎడిటర్ గా యాధృచ్చికంగా నా ప్రవేశం తటస్థించింది. ఆ పత్రిక పేరు అప్రస్తుతం. పత్రిక పేరుతో ముడిపెడితే మున్ముందు చేసే పోస్టులు స్వేచ్ఛగా చేయలేను. ఈరోజు అగ్రస్థానంలో అభిమానులందరి నీరాజనాలు అందుకుంటున్న తారలందరితో స్వయంగా ఇంటర్వ్యూలు చేసిన అనుభవాలు, వారితో సమీపంగా మెలిగిన సందర్భాలూ ఉన్నాయి. అందరూ ఎంతో గొప్పగా చూసే సినీ తారల వ్యక్తిత్వాలను దగ్గరగా చూడగలగడం ఓ రకంగా అదృష్టమే. స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి దగ్గర్నుండి షావుకారు జానకి వంటి పాతతరం నటీనటులను కలిసే అవకాశం, అనేకమంది కొత్తతరం నాయకానాయికలను తరచిచూసే అవకాశమూ, లైలా (ఎగిరే పావురమా) చెల్లెలకు ఒక అన్నగా చెలామణి అవడమూ.. ఇలా ఎన్నో అనుభవాలు మన బ్లాగు మిత్రులందరితో పంచుకోదలుచుకున్నాను. కేవలం సరదాగా కాకుండా సినిమా రంగాన్ని అతి చేరువగా చూసిన అనుభవంతో సినిమా రంగపు నేటి పరిస్థితి, గత పదేళ్ల కాలంలో చోటుచేసుకున్న పరిమాణాలు, నేను పాలుపంచుకున్న వివిధ షూటింగ్ విశేషాలు, సినిమా రంగంలోని వ్యవస్థాగతమైన లోపాలు వంటి అనేక అంశాలను వీలున్నప్పుడు ఓ సీరియల్ గా "సినిమా మనిషి కబుర్లు" అనే టైటిల్ క్రింద వివిధ భాగాలుగా పంచుకుంటాను. మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

- నల్లమోతు శ్రీధర్

Wednesday, November 19, 2008

సమాజంలో మార్పు వస్తుందంటారా?

"సమాజంలో మార్పు తెద్దాం.. వ్యవస్థని సమూలంగా కడిగేద్దాం.." ఇటీవల విన్పిస్తున్న నాయకులందరి ఇలాంటి నినాదాలతో ఉప్పొంగిపోతున్నాం... ఇంకేముంది దేశం బాగుపడేరోజు వచ్చేసిందని మురిసిపోతున్నాం. అస్సలు సమాజమంటే..? మీరూ, నేనూ, మన పక్క ఉన్న వ్యక్తుల సమూహమే కదా. మనం ఇదే మాదిరి బాధ్యతారాహిత్యంగా ఉంటుంటే ఎవరో వచ్చి మనతో కూడి ఉన్న సమాజాన్ని ఉద్ధరించగలుగుతారా? అస్సలు మనలో ఎంత వరకూ సామాజిక బాధ్యత ఉందో ఎప్పుడైనా గమనించామా? మనం మారకుండానే ఎవరో వచ్చి మన సమాజాన్ని మారుస్తారని కలలు గనడం ఎంత మూర్ఖత్వమో కదా! వచ్చేది ఎంత గొప్ప నాయకుడైనా కావచ్చు వ్యక్తిస్థాయిలో సామాజిక స్పృహ లేకపోతే వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? ఫలానా చిరంజీవి, ఫలానా జయప్రకాష్ నారాయణ, ఫలానా బాలకృష్ణ, చంద్రబాబు అధికారంలోకి వస్తే మనం ఇప్పటికన్నా బాధ్యతగా నడుచుకుంటామా? ఆ నమ్మకం మనకుందా? నాయకుడిపై అంత అభిమానం ఉండి మారగలిగిన వారైతే అదే అభిమానాన్ని దేశంపై ఇన్నాళ్లూ ఎందుకు చూపించలేకపోయాం? ప్రతీ పౌరుడూ వ్యవస్థ అంటే తన ఆవల ఉన్న మిగతా ప్రపంచం అనుకుంటారు. మనలోనూ ప్రభుత్వోద్యోగులు ఉన్నారు, అధికార్లు ఉన్నారు, ఎవరి స్థాయిల్లో వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వారు ఎంతోమంది ఉండనే ఉన్నారు. అలాగే మంత్రులు, అధికార్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. వీళ్లు మాత్రమే కాదు వ్యవస్థ అంటే! ప్రతీ పౌరుడూ వ్యవస్థలో భాగమే. కానీ మనం మనల్ని మినహాయించి మిగతా ప్రపంచంలో అవినీతి పోవాలని, అందరూ బాధ్యతగా ఉండాలని, మార్పులు రావాలని, తద్వారా మన జీవితాలు బాగుపడతాయని పగటి కలలు కంటున్నాం. చూడడానికి చిన్న చిన్న విషయాలే అయినా కొన్ని ఎంతో బాధ కలిగిస్తాయి. ఒక నాయకుడికి మద్దతుగా విద్యావంతులు రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించి ఎంతోమంది సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేయడం, వేలాది రూపాయల బాణాసంచా క్షణాల్లో బుగ్గిపాలు చేయడం.. నాయకుడిని ఎవరైనా తెలిసీ తెలియక విమర్శిస్తే భౌతిక దాడులకు దిగడం.. చెప్పుకుంటూ పోతే రాజకీయ పార్టీలకు దన్నుగా నిలవడానికి మనం వృధా పరుస్తున్న మానవ, ఆర్థిక వనరుల్ని పరిగణనలోకి తీసుకుంటే అవన్నీ వృధా పరచడమేనా మనం కోరుకునే మార్పు? సమాజం పట్ల విభిన్న కోణాల్లో సగటు పౌరుడు బాధ్యతాయుతంగా ఉండనంత వరకూ ఎంత గొప్ప నాయకుడూ కూడా ఆశించినంత మార్పుని తీసుకురాలేడు అన్నది స్పష్టం. గొప్ప నాయకుడు పగ్గాలు చేపడితే ఏతావాతా మంత్రులు, అధికార్లలో కొంతవరకూ జవాబుదారీ తనం వచ్చే అవకాశం ఉండొచ్చేమో కానీ మనలాంటి మనుషుల్లో మనకి మనం మార్పు ఆహ్వానించనంత వరకూ ఇలాగే ఉంటాం.

Sunday, November 16, 2008

క్షణ క్షణానికీ...

"ఫలానా పని సరిగా చెయ్యలేకపోయానే.. ఇలాగైతే బాగుణ్ణు..", "అవునూ అప్పుడలా మాట్లాడి ఉండవలసింది కదూ... ప్చ్ వెధవ బుర్ర టైమ్ కి వెలగదు...", "ఇంతకీ వచ్చేవారం ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి...?", "ఆ శ్రీకాంత్ గాడికి ఎంత చెప్పినా విన్పించుకోడు.. వాడి ఖర్మ, ఇక్కడ నాకేదో పట్టినట్లు..!", "షేర్లు పడిపోయాయి కదా మంచి స్క్రిప్ చూసి కొనిపారేస్తే అలా పడుంటాయేమో... ఆలోచించాలి! ", "ఇప్పుడే తాళాలెక్కడో పెట్టాను ఓ పట్టాన అవసరానికి కన్పించి చావవు"..

ఇవి చదువుతుంటే ఒకదానికొకటి ఏమాత్రమైనా పొంతన ఉందా? ఉండదు. బుర్రలో క్షణక్షణానికీ పరిగెడుతుంటే ఆలోచనల ప్రవాహం ఇది. ఆ క్షణానికి ఆ ఆలోచనే అత్యవసరమైనది. "క్షణం" మారితే చిత్తమూ చిత్రంగా మారిపోతుంది. ఏ అన్యాయమో మెదడుని తొలుస్తున్నప్పుడు మనసులో నిరసనగళం పురివిప్పుతుంది... ఏ ఆనందంలోనో పులకించిపోతున్నప్పుడూ అంతే.. కొన్ని క్షణాలు మైమరపు కమ్ముకుంటుంది.. అన్నీ ఆలోచనలూ క్షణికమాత్రాలే. ఓ ఆలోచన యొక్క ఉనికి అంతకన్నా బలీయమైన మరో ఆలోచనచే అది ఆక్రమించబడేవరకే!

మనసు పొరల్లో క్షణకాలం పాటు తళుక్కున మెరిసి మాయమయ్యే ఆలోచనల్ని ఒడిచిపట్టలేక యాంత్రికంగా సాగిపోతుంటాం. కొండొకచో ప్రయత్నపూర్వకంగా కొన్ని ఆలోచనల్ని జ్ఞాపకపు అలమారాల్లోకి సర్థేసి తర్వాతెప్పుడైనా వాటిని తీరిగ్గా విశ్లేషిద్దామని నిర్ణయానికి వచ్చి మళ్లీ మరిన్ని ఆలోచనల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఆ క్షణం తళుక్కుమన్న ఆలోచన దృష్టి చెదిరేసరికి మరుక్షణం వెలవెలబోతుంది. మెదడు అలమారాల్లో భద్రపరిచిన ఆలోచనలూ తీరా ఏ తీరిక క్షణానో తవ్వి తీస్తే జీవం కోల్పోయి వెక్కిరిస్తుంటాయి. ఈ "మనసులో" బ్లాగులో స్పష్టంగా, అస్పష్టంగా, రేఖామాత్రంగా, ఊహల ప్రతిరూపంగా నా మనసులో కదలాడే ప్రతీ ఆలోచననీ ఒడిచిపట్టి అక్షరరూపం ఇవ్వాలన్నది నా మనోభీష్టం. క్షణకాలంలో తళుక్కున మెరిసి అందుకునేలోపు కనుమరుగైపోయే ఆలోచనలను మరింత నేర్పుతో మనో:ఫలకంపై ముద్రించుకుని అక్షరబద్ధం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. వేగంగా పారిపోయే ఆలోచనలకు గాలం వేసి దగ్గరకు లాగి నిగ్గుదేల్సాలన్న ఈ ఆలోచనా ఆ ప్రయత్నంలో భాగమే.

మనసు నిండా ఎన్నో ఆనందాలు, అసంతృప్తులు, ఆవేశాలు. నా చుట్టూ కదలాడే ప్రపంచం క్షణానికో అనుభూతిని మిగుల్చుతున్నప్పుడు వాటన్నింటికీ ప్రతిస్పందించకపోతే నా మనసు ద్వారాలు స్వయంగా మూసుకున్నట్లు కాదూ...! అందుకే ఏదైనా, ఎవరేమనుకున్నా, ఎవరి మానసిక స్థాయిలో నా రాతలను ఎలా స్వీకరించుకున్నా.. నా రాతలను బట్టి నాకంటూ ఓ అసమగ్రమైన "ముద్ర" వేయబడుతుందని తెలిసినా.. నా రాతలకు నా మనసుని సాక్షిని చేసుకుని నాదైన శైలిలో విభిన్న అంశాలపై ఇప్పటిలానే రాస్తాను.

ఇదీ ఒక టపానేనా.. ఏముంది ఇందులో అని ఓ సందేహమూ కొందరికి వస్తుంది. నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి నా ఆలోచనలను మధించుకుంటూ నా ఆలోచనా సరళిని బ్లాగు మిత్రులతో పంచుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది. "సాంకేతికాలు" బ్లాగు నుండి "సామాజికం" వైపు దృష్టి సారించినప్పుడు "అస్సలు నేనేం రాయగలను?" అన్న ప్రశ్నతో ప్రారంభమై కుప్పలు తెప్పలుగా కమ్ముకుంటున్న ఆలోచనల్లో దేనిపై రాయాలో నిర్థిష్టంగా నిర్థారణకు రాలేకపోయిన క్షణం ఏర్పడిన ఆలోచనే "రాయగలగాలే గానీ ఈ అస్పష్టతా ఓ టపాగా ఎందుకూ రాయకూడదు?" అన్నది! ఇదే మాదిరి ఊగిసలాటను తోటి మిత్రులు నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటారు కదా అని వెంటనే కీబోర్డ్ కి పనిచెప్పాను. అందుకే ఇదీ ఓ టపాగా అక్షరాల్లోకి అమరింది. అదన్నమాట సంగతి. J

Friday, November 14, 2008

భావాలను భ్రష్టుపట్టించకండి

“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమికులే కానవసరం లేదు.. స్నేహితులూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మనసారా మాటల్లో చెప్పాలన్నా “ఇష్టం” అనే పదం అపార్థాలకు తావిస్తుందేమోనని గుంజాటంలో చిక్కుకునే దుస్థితి మనది. నేస్తం తన స్నేహహస్తంతో హృదయాన్ని తడిమినప్పుడు “నువ్వంటే ప్రాణం మిత్రమా” అని మనసు ఒద్దికగా ఒదిగిపోతూ మూలగకపోతే మనలో స్పందనలు ఏమున్నట్లు? నిష్కల్మషమైన ఆ ప్రేమకు కూడా ఆద్యంతాలు, తర్కాలు అన్వేషించనారంభిస్తే మనలో మానవత ఎంత అడుగంటిపోయినట్లు..?

“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే... హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఉండాలి అనే రీతిలో సినిమాలు, ప్రసారమాధ్యమాలు ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.

నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా... ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం.

ఇరు హృదయాల మధ్య సాన్నిహిత్యం చోటుచేసుకోవడానికి మన సమాజంకొన్ని అర్హతలు అనధికారికంగా నిర్దేశిస్తోంది. అయితే ప్రేమికులు కావాలి. లేదా రక్త సంబంధం కావాలి. ప్రేమికులు నాలికపై నుండి చిలకపలుకులు పలికినా దేవదాస్ పార్వతిలతో పోలుస్తూ ఎక్కడలేని ముగ్ధత్వం ఆపాదించబడుతుంది. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉండే అనుబంధం, అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలు... కూడా మన ప్రపంచానికి రిస్క్ లేదు. ఎటొచ్చీ అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అనుబంధమే.. దాని అంతేదో తేల్చాలి అన్నంత నిద్రలేకుండా చేస్తుంది సమాజాన్ని! ఇక ఆ ఇద్దరి మధ్య ప్రేమ, ఇష్టం వంటి పదాలు సమాజపు పాము చెవులకు విన్పిస్తే ఇంకేమైనా ఉందా? పుకార్లని షికారు చేయించి ఇద్దరి మనసులు విరిచేసి పైశాచికత్వం నిరూపించుకోదూ...?

నేను ICWAI చదివేటప్పుడు నీలిమా కిరణ్ అని ఓ ఆత్మీయనేస్తం ఉండేది. సబ్జెక్టుల్లో ఒకరికొకరు సహాయపడడం దగ్గర్నుండి, ఒకరి అనుభూతులు మరొకరు షేర్ చేసుకోవడం వరకూ ఇద్దరం వేరైనా ఇద్దరం ఒక్కరమే అన్నంత సాన్నిహిత్యం ఉండేది. నూటికి నూరుశాతం అది స్నేహం! దురదృష్టవశాత్తు మా స్నేహానికి కల్మషం ఆపాదించబడింది. ఒకరోజు కాలేజీ డైరెక్టర్ ఈ విషయమై తన మనసుని గాయపరిచేలా మాట్లాడడం తెలిసి నేనూ కలత చెంది తెలిసీ తెలియని ఆ వయస్సులో ముప్పైకి పైగా స్లీపింగ్ పిల్స్ మింగి చావుకు కొన్ని నిముషాల దూరం వరకూ వెళ్లి వచ్చాను. సమాజపోకడలపై అప్పటి నుండి ఆ అసంతృప్తి మేటవేసుకుపోయి ఉంది. ఇదిగోండి.. ఈరోజు రమణి గారు “మాటే మంత్రం” అనే పోస్టులో..

అన్ని అద్భుతమైన వ్యక్తీకరణలను ప్రేమకి ముడిపెట్టి మిగతా మానవ సంబంధాలకు(అవి ఏమైనా కావొచ్చు,స్నేహం, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముడు) ఎంత అన్యాయం చేశారో అస్సలు ఈ సినిమా రచయితలకు తెలియదు...

అని రాస్తే మనసు ఓ క్షణం చలించింది. హృదయం, ప్రేమ, ఇష్టం వంటి పదాలను, మనుషుల మధ్య అనుభూతులను భ్రష్టుపట్టిస్తూ నిజమైన అనుబంధాలను సమాజం ఎంత నిర్థాక్షిణ్యంగా కాలరాస్తుందో నా స్వీయ అనుభవంతో రాద్దామని చేసిన ప్రయత్నమే ఇది. తన పోస్ట్ ద్వారా ఈ ఆలోచనను రేకెత్తించిన రమణి గారికి ధన్యవాదాలు.

Thursday, November 13, 2008

పర్సనల్ జోన్ లోకి ప్రవేశం లేదు

ప్రతీ మనిషికీ ఓ పర్సనల్ జోన్ ఉంటుంది. దాన్ని చేధించి వారి అంతరంగానికి సమీపంగా చేరుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులు ఎవరూ ఒక స్థాయికి మించి ఆ మనిషి యొక్క పర్సనల్ జోన్ లోకి ప్రవేశించలేరు. కానీ కొన్ని మానవ సంబంధాల్లో అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం కొద్దీ వారి అంతరంగ ప్రపంచంలోకి చొరబడి వారిని పూర్తిగా వశం చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. పిల్లల పట్ల తాము కనబరుస్తున్న ప్రేమ, బాధ్యతలను ఆసరాగా చేసుకుని తామే వారు, వారే తాము అన్నంతగా వారితో జీవితాన్ని పెనవేసుకుపోయిన తల్లిదండ్రులు వారి అన్ని బాగోగులనూ చూడాలన్న తాపత్రయంతో సదరు పిల్లల యొక్క పర్సనల్ జోన్ లోకీ ప్రవేశించి దిశానిర్దేశాలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక స్థాయికి మించి ఎవరి జోక్యం స్వాగతించకపోవడం మానవ సహజనైజం. అందుకే తల్లిదండ్రుల మితిమీరిన జోక్యాన్నీ పిల్లలు "నా సంగతి నాకు తెలుసు కదా. అన్నీ నువ్వే చెయ్యాలనుకుంటావు." వంటి మాటలతో తిరస్కరించడం కన్పిస్తూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇదే మాదిరి సంఘర్షణ చోటుచేసుకుంటూ ఉంటుంది. పెళ్లయిన తర్వాత తన భార్య, తన భర్త పూర్తిగా తన స్వంతం, అన్నీ తనకు తెలిసి జరగాలి, లేదా తాను తెలుసుకోవాలి, లేదా తాను వారి ప్రతీ కదలికను దిశానిర్దేశం చెయ్యాలి వంటి స్వార్థంతో కూడిన అపరిమితమైన ప్రేమ కావచ్చు, లేదా స్వార్థమే కావచ్చు దంపతుల్లో కన్పిస్తుంటుంది. కొందరైతే ప్రేమ పేరుని అడ్డుగా పెట్టుకుని జీవిత భాగస్వామి పర్సనల్ జోన్ లోకి ప్రవేశించి అన్నీ తామే అవ్వాలన్న కోరికతో భాగస్వామి మనసుని విరిచేవారూ కన్పిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకోవాలంటే జీవితంలోని వివిధ దశల్లో తమదైన వ్యక్తిత్వంలోకి ఎవరినీ చొరబడకుండా రక్షించుకోవడానికి మనుషులు చేసే తిరస్కరణలు, తద్వారా గాయపడే అహాలు, తద్వారా బంధాల మధ్య ఏర్పడే అగాధాలు.. ఇదో నిరంతర ప్రక్రియ. కాకపోతే ఎంత ఆత్మీయులైనా, మన వద్ద ఎంత ప్రేమ ఉన్నా వారి మనసులోకి మనం కొంతవరకే చొచ్చుకుపోగలం, అంతకుమించి సమీపంగా వెళ్లాలనుకుంటే నిరాశే మిగులుతుంది అనే ప్రజ్ఞ కలిగి ఉంటే మనుషుల మధ్య అపార్థాలకు తావుండదు.

Tuesday, November 04, 2008

నేను ప్రత్యేకం

"అందరిలాంటి వ్యక్తిని కాదు నేను" అనుకుంటూ మనకిమనం ప్రత్యేకతను ఆపాదించుకోవడం ద్వారా మనం ఎంతో సంతృప్తిని మూటగట్టుకుంటుంటాం. ఇలా విభిన్నంగా ఉండాలన్న కోరికే ఒక రకంగా మన జీవితానికి జీవం కూడా పోస్తుందేమో! సామాజిక సంబంధాల్లో మనదైన ముద్రని స్థిరీకరించడానికి మనసు ఉవ్విళూరుతుంటుంది. అందుకే ఇంకొకరిని అనుకరించడం మనస్కరించదు. ఎన్నో అనుభవాల కలబోతగా విభిన్నమైన వ్యక్తిత్వం ఈపాటికే సంతరించుకోబడిన వ్యక్తుల గురించి కాదు ఇక్కడ ప్రస్తావిస్తున్నది! నూటికి తొంభైతొమ్మిది మనస్థత్వాలు మానసికంగానో, సామాజికంగానో, ఆర్థికంగానో.. ఏదో ఒక పార్శ్యంలో ఓ గుర్తింపుని సంతరించుకోవడానికి తాపత్రయపడేవే. ఎక్కడి వరకో ఎందుకు అందరికన్నా భిన్నంగా రాయాలన్న చిన్న కాంక్ష లేకపోతే ఈ బ్లాగుని ప్రారంభించాలన్న పురుగు కూడా నా మనసుని తొలిచి ఉండేది కాదు. జన్మతః మనసులో "నేను ప్రత్యేకం" అనే భావం మేటవేసుకోపోయి ఉన్నట్లయితే.. జీవితాంతం మానసికంగానూ, సామాజికంగానూ మనుషుల్లో ఎదుగుదల కరువయ్యేదేమో! మనల్ని నడిపిస్తున్న అదృశ్యశక్తి ఇది. ఏ క్షణమైతే "నేను అందరిలాంటి వ్యక్తిని, లేదా అందరికన్నా తక్కువ వ్యక్తిని" అన్న భావన మన అహాన్ని సజీవంగా నిలుపుతున్న కాంక్షని కాలరాస్తూ మనసులో చొరబడుతుందో ఆ క్షణం నుండి బ్రతుకు అతి సాధారణమైపోతుంది. నాకు "అహం" లేదు అంటూ మనం చిలకపలుకులు పలుకుతుంటాం కానీ పరిమిత స్థాయిలో ఆ భావనే లేకపోతే అందరి జీవితాలు నిస్సారంగానే ఉంటాయి. అందరికన్నా బాగా చదవాలి, పిల్లల్ని మనదైన పద్ధతిలో పెంచాలి, వ్యాపారంలో మనదైన ముద్రవేయాలి.. ఇలాంటి ఆలోచనలు చేయకపోతే జీవితాలకు ఇప్పటి తళుకులు ఎక్కడి నుండి వచ్చేవి? అందరికన్నా భిన్నంగా ఉండాలన్నది కొందరిని పెడద్రోవలనూ తొక్కిస్తుంది. అలాంటి వారి ప్రస్తావనా ఇక్కడ అప్రస్తుతమే. జీవితాన్ని నడిపిస్తున్న ఆ "ప్రత్యేకవాదాన్ని" :) పదిలంగా కాపాడుకుందాం.

అలజడులకు అక్షరరూపం

తెలుగు బ్లాగ్లోకంలో మిత్రులు చేసే ఎన్నో అద్భుతమైన టపాలను చదివేటప్పుడు కొన్ని క్షణాలపాటు మనసులో ఏ మూలనో వెలితి మెలిపెడుతుంది. "సాంకేతికాలు"ని సక్రమంగా నిర్వహిస్తే చాల్లే అని అప్పటికప్పుడు సర్ధిచెప్పుకుని సాగిపోతూ ఉన్నాను. విభిన్న ఆలోచనలు మనసుని ముప్పిరిగొని అస్పష్టంగా కదలాడేటప్పుడు "వాటి ఘోషకి అక్షరరూపం ఇస్తే ఆ అలజడి శాంతిస్తుంది కదా" అని మళ్లీ మనసు మూలిగినా గొంతునొక్కిపెడుతూ వచ్చాను. ఈ నింయతృత్వపోకడలు చూసి మనసెక్కడ తిరగబడుతుందోనన్న భయంతో కంప్యూటర్ ఎరా మేగజైన్ లో సంపాదకీయాల్లో ఓ చిన్న వెసులుబాటు కల్పించుకుని నెలకోసారైనా గళాన్ని విప్పుతున్నాను. అయినా అసంతృప్తి తొలగడం లేదు. తెల్లారిలేచించి మొదలు ఆదమరిచి నిద్రపోయేవరకూ మనసులో ఎంతో భావసంఘర్షణ జరుగుతూ ఉంటోంది. ఎలాగైనా అప్పుడప్పుడు కొంత తీరుబడి చేసుకుని దానికి ఓ రూపం సంతరించి ఇవ్వకపోతే ఆ సంఘర్షణ మనసులో చిక్కుముడులుగా ముడిపడిపోతుందేమోనని.. ఎంతోకాలం ఊగిసలాటకు తెరదించి ఇన్నాళ్లకు "మనసులో.." పేరిట ఈ బ్లాగుకి శ్రీకారం చుట్టాను. అందరి ఆదరాభిమానాలు లభిస్తాయని ఆకాంక్షిస్తూ..

- నల్లమోతు శ్రీధర్