Thursday, November 13, 2008

పర్సనల్ జోన్ లోకి ప్రవేశం లేదు

ప్రతీ మనిషికీ ఓ పర్సనల్ జోన్ ఉంటుంది. దాన్ని చేధించి వారి అంతరంగానికి సమీపంగా చేరుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులు ఎవరూ ఒక స్థాయికి మించి ఆ మనిషి యొక్క పర్సనల్ జోన్ లోకి ప్రవేశించలేరు. కానీ కొన్ని మానవ సంబంధాల్లో అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం కొద్దీ వారి అంతరంగ ప్రపంచంలోకి చొరబడి వారిని పూర్తిగా వశం చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. పిల్లల పట్ల తాము కనబరుస్తున్న ప్రేమ, బాధ్యతలను ఆసరాగా చేసుకుని తామే వారు, వారే తాము అన్నంతగా వారితో జీవితాన్ని పెనవేసుకుపోయిన తల్లిదండ్రులు వారి అన్ని బాగోగులనూ చూడాలన్న తాపత్రయంతో సదరు పిల్లల యొక్క పర్సనల్ జోన్ లోకీ ప్రవేశించి దిశానిర్దేశాలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక స్థాయికి మించి ఎవరి జోక్యం స్వాగతించకపోవడం మానవ సహజనైజం. అందుకే తల్లిదండ్రుల మితిమీరిన జోక్యాన్నీ పిల్లలు "నా సంగతి నాకు తెలుసు కదా. అన్నీ నువ్వే చెయ్యాలనుకుంటావు." వంటి మాటలతో తిరస్కరించడం కన్పిస్తూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇదే మాదిరి సంఘర్షణ చోటుచేసుకుంటూ ఉంటుంది. పెళ్లయిన తర్వాత తన భార్య, తన భర్త పూర్తిగా తన స్వంతం, అన్నీ తనకు తెలిసి జరగాలి, లేదా తాను తెలుసుకోవాలి, లేదా తాను వారి ప్రతీ కదలికను దిశానిర్దేశం చెయ్యాలి వంటి స్వార్థంతో కూడిన అపరిమితమైన ప్రేమ కావచ్చు, లేదా స్వార్థమే కావచ్చు దంపతుల్లో కన్పిస్తుంటుంది. కొందరైతే ప్రేమ పేరుని అడ్డుగా పెట్టుకుని జీవిత భాగస్వామి పర్సనల్ జోన్ లోకి ప్రవేశించి అన్నీ తామే అవ్వాలన్న కోరికతో భాగస్వామి మనసుని విరిచేవారూ కన్పిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకోవాలంటే జీవితంలోని వివిధ దశల్లో తమదైన వ్యక్తిత్వంలోకి ఎవరినీ చొరబడకుండా రక్షించుకోవడానికి మనుషులు చేసే తిరస్కరణలు, తద్వారా గాయపడే అహాలు, తద్వారా బంధాల మధ్య ఏర్పడే అగాధాలు.. ఇదో నిరంతర ప్రక్రియ. కాకపోతే ఎంత ఆత్మీయులైనా, మన వద్ద ఎంత ప్రేమ ఉన్నా వారి మనసులోకి మనం కొంతవరకే చొచ్చుకుపోగలం, అంతకుమించి సమీపంగా వెళ్లాలనుకుంటే నిరాశే మిగులుతుంది అనే ప్రజ్ఞ కలిగి ఉంటే మనుషుల మధ్య అపార్థాలకు తావుండదు.

14 comments:

ఆనందగురు said...

మీ టపా చాలా బాగుంది.

"సామీప్యాన్ని అంగీకారం క్రింద భావించ కూడదు.అంగీకారం ఉంటే పర్సనల్ జోన్లు చిన్నవై ,"మన"(మనసు,మనము) స్థితి పెరుగుతుంది.

అంతేనంటారా ?

Anonymous said...

ఇప్పుడే అనుకోకుండా మీ బ్లాగు చూడటం జరిగింది. తీరా చూస్తే రెండో పోస్ట్!టపాలు చదవకుండానే మీ బ్లాగు చూసిన ఆనందంలో ముందు కామెంట్ రాస్తున్నాను. wish you all the best! మీ టపాల కోసం ఎదురు చూస్తూ...!

Rajendra Devarapalli said...

ఒప్పుకోవాలనిపించటం లేదు గానీ,తప్పదు కఠోరం గా ఉన్నా నిజం నిజమే,బాగుంది శ్రీధర్ గారు
http://www.vizagdaily.co.cc/

సుజాత వేల్పూరి said...

అవతలి వాళ్ళ మీద తమకు ఉన్న concern ని చూపించుకోడానికి ఇలా పర్సనల్ జోన్ లోకి ప్రవేశ్తిస్తుంటారు. తల్లితండ్రులు పిల్లల జోన్ లోకి, భార్యా భర్తలు ఒకరి పర్సనల్ జోన్ లోకి ఒకరు. అందుకే ఈ మధ్య ఒక మాట తరచుగా వినపడుతోంది give me some space to me అని! అంటే "నా పర్సనల్ జోన్ లోకి మరీ అంతగా చొరబడకు" అని దీని అర్థం అన్నమాట.

Ramani Rao said...

"కళ్ళలో ఉన్నదేదో కళ్ళకేలా తెలుసు? అన్నట్లుగా ఆలోచిస్తే, పసి పిల్లు వాళ్ళకేమి తెలియదు అన్న భావనలో "నీ మొహం నీకేమి తెలుసు? వేలడంత లేవు అనో, నీ మనసు నాకు తెలుసు అనో పిల్లల అవసరాలు చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాని ఒక వయసంటూ వచ్చాక వాళ్ళింకా తమ అడ్డాలలొ బిడ్డలే అన్న భ్రమలో అలాగే కొనసాగి పోతూ ఉంటారు, పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ ఆలోచనలతో, చుట్టూ ఉన్న పర్స్థితుల అధారంగా పరిణితి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లల పరిణితి వక్రమార్గంలో కాక సవ్యమైనది అయితే, వారి వారి పర్సనల్ జోన్ కి తల్లితండ్రులు వెళ్ళాల్సిన అవ్సరం లేదు+ పిల్లల పరిణితి పరిణామాలు తెలుకోగలిగే అవగాహన తల్లితండ్రులకి ఉండాలి.

నాలో ఉన్న మనసు నాకు మాత్రం ఇంకెవరికి తెలుసు? అని అనేసుకొని బార్య/భర్త ఎవరికి వారే పర్సనల్ జోన్ అని అనుకొంటే ఇది సంసారానికి కొంచం ఇబ్బందే. పర్సనల్ జోన్ అన్నదాన్ని బార్య భర్త ఇద్దరూ అంగీకరించగలగాలి. ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఇద్దరిమధ్య గొడవలే. తనసొత్తు, తను అడుగు తీసి అడుగు వేస్తే అది నాకోసమే అని భర్త, తన సొంతం, తనగురించే ఉండేది, తన ఆలోచనలన్ని నావి అని బార్య అనుకొంటే వీళ్ళమధ్య పర్సనల్ జోన్ అన్న అవగాహన ఉండదు. పైపెచ్చు అవగాహన లోపించి, అనవసరంగా కీచులాటలు మొదలవుతాయి.

కాని మొత్తానికి మీ "పర్సనల్ జోన్" నన్ను బాగా ఆలోచింపజేసింది..

Unknown said...

@ఆనందగురు గారు, ఒక్క మాటలో బాగా చెప్పారు.
@ బాబు గారు ధన్యవాదాలు. తప్పకుండా వీలైనప్పుడల్లా రాస్తుంటాను.
@రాజేంద్ర గారు :)
@ సుజాత గారు మీరన్నది నిజం.
@ రమణి గారు టాపిక్ కి మరింత క్లారిటీ ఇచ్చారు. ధన్యవాదాలు.

శరత్ కాలమ్ said...

'శరీరాలు మాత్రమే వేరు - మనసులు మాత్రం ఒకటే ' లాంటి స్నేహాలు కొన్ని వున్నప్పుడు వాటిల్లో పర్సనల్ జోన్ లాంటివి వుండవు. అలాంటి గాఢమయిన బంధాలలో పర్సనల్ జోన్ వుండటం అసంబద్దంగా వుంటుంది. అలాంటి జోన్ లేకపోవడమే హృద్యంగా వుంటుంది. సబ్మిస్సివ్ రిలేషన్ వుంటే ఈ జోన్ కి అర్ధమే లేదు.

@ రమణి
మీరు చక్కగా చెప్పారు. మా పిల్లల పర్సనల్ జోన్ కి వెళ్ళకుండా జాగ్రత్తపడుతూ వుంటాను.

Anonymous said...

Nice post ! If I am not wrong Yandamuri wrote regarding this in one of his non fictions (may be vijayaniki 5 metlu)

Unknown said...

శరత్ గారు, "శరీరాలు మాత్రమే వేరు - మనసులు మాత్రం ఒకటే' లాంటి స్నేహాలు కొన్ని వున్నప్పుడు వాటిల్లో పర్సనల్ జోన్ లాంటివి వుండవు. అలాంటి గాఢమయిన బంధాలలో పర్సనల్ జోన్ వుండటం అసంబద్దంగా వుంటుంది".. నేను టచ్ చెయ్యని కోణం. మీరన్నది నూటికినూరుశాతం వాస్తవం. ఒకరికొకరు ఎల్లలు దాటి మనసులు కలిసే చక్కటి స్నేహాలు చాలా ఉంటాయి.
@ అనానిమస్ గారు, థాంక్యూ. గురువు గారు యండమూరి గారు రాసి ఉండవచ్చు. అయితే వృత్తిపరమైన ఒత్తిడుల వల్ల గత పదేళ్లుగా పుస్తకపఠనమే వీలవక గురువుగారి నాన్ ఫిక్షన్లు చాలావరకూ చదవలేకపోయాను.యూనివర్శల్ కాన్సెప్ట్ లు కదా ఎక్కడోచోట గతంలో ప్రస్తావించబడి ఉండవచ్చు. ఇది స్వీయవిశ్లేషణే.

Bolloju Baba said...

సుజాత రమణి ల కామెంట్ల ద్వారా ఈ పోస్ట్ కంటెంట్ సుస్ఫష్టం అయింది.
మంచి టాపిక్కు.
దాదాపు ఇదే లైన్లపై నువ్వు నువ్వే నేను నేనే అంటూ ఓ కవితొకటి వ్రాసాను. పోస్ట్ చేస్తాను.

శ్రీలేఖ said...

చాలా కరెక్ట్ గా చెప్పారు...

కొండూరు కృష్ణ (ఆత్రేయ ) said...

చాలా బాగా చెప్పారు శ్రీధర్ గారు. ప్రాణ స్నేహితులు
ప్రాణ మిత్రులు వంటి మాటలకు ఇప్పుడు అర్ధాలు, తార్కాణాలు కనుక్కోవటం కష్టమే. అంతా ఎవరికి వారే యమునా తీరే.

చైతన్య కృష్ణ పాటూరు said...

పెళ్ళి నాటికే సొంత అభిప్రాయాలతో, స్థిరపడిపోయిన వ్యక్తిత్వాలతో ఉండే ఈ రోజుల్లో ఈ పర్సనల్ జోన్ల సమస్య ఉండేదే. అందరి పర్సనల్ జోన్స్ కీ పూర్తి స్థాయిలో స్థలం కేటాయించటం ప్రపంచానికైనా, సమాజానికైనా, కుటుంబానికైనా సాధ్యం కాదని తెలుసుకొంటే కొంత సర్దుబాటు మనస్తత్వం అలవడుతుంది.

తాడేపల్లిగారు తమ ఇటీవలి టపాలో ఒక మాట చెప్పారు. "మానవ సంబంధాలు పరస్పర అవసరాలతో మొదలవుతాయి. పరస్పర కృతజ్ఞతలతో అవి కొనసాగుతాయి" - అని. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అయినా, భార్యాభర్తల మధ్యనున్న సంబంధంలోనైనా కొంత పరస్పర కృతజ్ఞత ఉంటే, పర్సనల్ జోన్స్ మధ్య బౌండరీస్ కరిగి అవి ఒకదానితో ఒకటి కలుస్తాయి. అలా కలవనంత కాలం ఒకరి స్పేస్ లోకి ఇంకొకరు intrude అవుతున్నట్టే ఉంటుంది.

లక్ష్మి said...

బాగుంది మీ టపా. నా మటుకి నాకు నా పర్సనల్ జోన్ అంటే నా చిన్ని చిన్ని భావాలు, అనుభూతులు, అనుభవాలు, ఆనందాలు. శరీరాలు వేరు కానీ మనసు ఒకటే అనుకున్నా కూడా ఒకరి మనసు వేరొకరు పూర్తిగా తెలుసుకోలేరు. అనుభవాలు పంచుకోగలరు కాని, అనుభూతిని పంచుకోలేరు. ఒక పసి పాప బోసి నవ్వు ని చూసి నేను చాలా ఆనందించాను... ఈ మాట చాలా చప్పగా ఉంటుంది, ఎందుకంటే ఆ సమయంలో నేను అనుభవించిన ఆనందం వర్ణించటానికి మన భాష సరిపోదు, అదొక అద్వితీయమైన అనుభూతి. ఆ అనుభూతి నాకే సొంతం....