Wednesday, January 28, 2009

చక్కని కాలెండర్ - సుమణి వెంకట్ గారికి ధన్యవాదాలు

http://computerera.co.in/forum అనే లింకులో కంప్యూటర్ నాలెడ్జ్ ని ఒకరికొకరు షేర్ చేసుకోవాలన్న ఉన్నతాశయంతో రెండేళ్లుగా ఆన్ లైన్ ఫోరమ్ నిర్వహిస్తూ వస్తున్నాం. ఇప్పటికే 7,164 మంది సభ్యులున్న ఈ ఫోరం గురించి ముఖ్యమైన సందర్భాల్లో బ్లాగులో ప్రస్తావించడమూ జరిగింది.

ఈ నేపధ్యంలో ఈ పోస్ట్ చెయ్యడానికి ముఖ్య కారణం.. సుమణి వెంకట్ గారు అనే ఇటీవల ఫోరంలో జాయిన్ అయిన ఒక మెంబర్ ఫోరంలో పోస్టులన్నీ గత కొన్ని వారాలుగా చదువుతూ తెలుగులో ఇంత చక్కని సమాచారం ఉందని తెలియదని వండర్ అవుతూ.. తన మనసులోని భావాలను ఫోరంలో రాశారు. అంతేకాదు ఎంతో కష్టపడి కంప్యూటర్ ఎరా ఫోరం కోసం ఎంత చక్కని క్యాలెండర్ ని రూపొందించారో ఈ క్రింద కొద్దిసేపటి తర్వాత లోడ్ అయ్యే కాలెండర్ ని చూస్తే అర్థమవుతుంది. తనకు చేతనైన విద్యతో చక్కని కాలెండర్ ని రూపొందించి పదివేల పోస్టులకు పైగా ఉన్న ఈ ఫోరం గురించి మరో పదిమందికీ తెలిసేలా చేసిన సుమణి వెంకట్ గారికి "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" బృందం అందరి తరఫునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొద్దిగా ఓపికగా PDF లోడ్ అయ్యే వరకూ ఆగి కాలెండర్ లోని అన్ని పేజీలూ చూడండి, ఆయన్ని అభినందించకుండా ఉండలేం.

- చిన్న విషయమే అయినా మా టీమ్ ఆనందాన్ని స్వీకరించినందుకు సందర్శకులకు ధన్యవాదాలు
నల్లమోతు శ్రీధర్


Sumanivenkat Format

Thursday, January 22, 2009

నిజంగా మనం మంచి వాళ్లమా?

అలసిన ఓ నిమిషం కళ్లెదుటి బాహ్యప్రపంచాన్ని బలవంతంగా కనురెప్పల బిగింపుతో తిరస్కరించి కళ్లు మూస్తే ఎన్నో అలజడులు కళ్లల్లో ఎగిరెగిరి పడుతున్నాయి. బాల్యపు "నేను"కీ, యవ్వనానికీ, నిన్నటికీ, ఇప్పటి "నేను"కీ సారూప్యత దొరకబుచ్చుకోలేక మెదడు జ్ఞాపకాల దొంతరుల్ని తిరగేస్తూనే ఉంది. అంతలో ఏ సమూహంలోనో అభిప్రాయాలు ఆరాటపడుతూ మనుషుల నాలుకల్ని తొలుచుకు వచ్చేటప్పుడు "నేనలా.. తెలుసా" అంటూ మనసూ ఉండబట్టలేక బలహీనంగా మూలుగుతుంది. నా గురించి నేను చెప్పుకోవడానికి ఎంత ఆరాటమో కదా! "అహం" తన లోతుల్ని తాను తవ్వుకోలేక, నిశ్చలత్వాన్ని పొందలేక నిరంతరం ఊగిసలాడుతూ కూడా ఓ అనిశ్చిత అభిప్రాయాన్ని "స్థిరమైనదిగా" ప్రకటితం చెయ్యడానికి పడే తపన చూస్తుంటే మంచివాళ్లగానో, దయాపరులు గానో, మేధావులుగానో.. ఏదో ఒక స్థిరమైన ముద్రని ఆపాదింపజేసుకోవడానికి మారుతుండే చిత్తాలతోనే ప్రయత్నాలు సాగించడం హాస్యాస్పదంగా తోస్తుంది. తీవ్రమైన సంఘర్షణ తీరం దాటని తుఫానులా మనసుని తడుపుతున్నా బండబారిన స్థితప్రజ్ఞుల్లా ముఖకవళికల్లో రక్తికట్టించడానికి కుదేలైన కండరాల్ని బిగదీసి మరీ నటనావైధుష్యాన్ని ప్రదర్శించడం రివాజైపోయింది. కోరుకున్న ముద్రల కోసమే అభిప్రాయాలూ సహజత్వాన్ని కోల్పోయి హంగులు అద్దుకుంటున్నాయి. అన్నింటిలోనూ "ఈ క్షణానికే నిశ్చితంగా ఉండే నిశ్చితాభిప్రాయాలు" మన స్వంతం. కానీ ముద్రలు మాత్రం శాశ్వతమైనవి కావాలి. గతించిన అభిప్రాయానికీ, మారిన ఆలోచనకు లంకె వేస్తే పుటుక్కున భండారం బయటపడుతుందన్న ఆలోచనా స్ఫురించదు. మనపై సమాజం వెయ్యాలనుకునే ముద్రని సాధించడానికి ఇచ్చినంత విలువ మన ఆలోచనల్లో స్థిరత్వం పొందడానికి ఇవ్వం. అందుకేనేమో ముద్రలు ముఖస్తుతికి పనికొస్తుంటే మారుతుండే మన ఆలోచనలు కొరుక్కునే చెవుల్లో నిందలుగా షికారు చేస్తుంటాయి. మంచివాడో, గొప్పవాడో, త్యాగశీలో, మేధావో వంటి ముద్ర మన సమక్షంలో బలంగా విన్పిస్తే చాలు.. మనం అవేం కాకపోయినా అహం సంతృప్తిపడి శాంతిస్తుంది.

Wednesday, January 07, 2009

NGOలకు e-తెలుగు ఇచ్చిన ప్రదర్శన

"మంచి పుస్తకం" పేరిట ప్రధానంగా చిన్నారులకు ఉపయోగపడే అనేక పుస్తకాలను ప్రచురిస్తున్న సురేష్ గారు తమకు తెలిసిన NGO's కి e-తెలుగు కార్యకలాపాల గురించి, తెలుగు టైపింగ్, బ్లాగింగ్ నేర్పించడంపై ఓ demo ఏర్పాటు చేశారు. దానికి గాను ఈరోజు నేనూ, దూర్వాసుల పద్మనాభం గారు తార్నాకలోని సురేష్ గారి ఆఫీసుకి వెళ్లి వారి కాన్ఫరెన్స్ హాలులో ప్రొజెక్టర్ పై మనం తెలుగు వ్యవస్థాపించడం, తెలుగు టైపింగ్, కొత్త బ్లాగు సృష్టించడం తదితర అంశాలపై వీడియోలు చూపించడం జరిగింది. అలాగే వారికి వచ్చిన సందేహాలను అప్పటికప్పుడు నివృతి చేసి ఒకరిద్దరి లాప్ టాప్ లలో తెలుగు ఎనేబుల్ చేసి, బరహ వంటివి ఇన్ స్టాల్ చేశాం. సురేష్ గారు డెమో పూర్తయిన తర్వాత http://manchipustakam.blogspot.com/ అనే అడ్రస్ లో అక్కడికక్కడే తమ బ్లాగు మొదలెట్టారు. 15-20 మంది వరకూ ఈ demoకి హాజరయ్యారు. దాదాపు అందరూ త్వరలో తామూ బ్లాగులు మొదలెడతాం అని తెలిపారు. ప్రోగ్రామ్ కి సంబంధించి తీసిన వివిధ వీడియోల్లో ఒక చిన్న క్లిప్ ని క్రింద చూడవచ్చు.
video

Sunday, December 28, 2008

ఎగ్జిబిషన్ లో తెలుగు బ్లాగర్ల వాణి - 28-12-2008 నివేదిక (చివరి రోజు)




సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలన్న లక్ష్యంతో గత ఏడాది కాలంగా "కంప్యూటర్ ఎరా" "సాంకేతిక సహాయం" పేరిట టెక్నికల్ ఛాట్ రూమ్, ఫోరంలను నిర్వహిస్తోందన్న విషయం కొందరికి తెలిసే ఉంటుంది. దానికి సంబంధించి బ్లాగర్ల మీటింగ్ మాదిరిగానే అదే కృష్ణకాంత్ పార్క్ లో ప్రతీ నెలా నాలుగవ ఆదివారం like minded వ్యక్తులతో మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గం.లకు ఆ మీటింగ్ కి హాజరై 5 గంటల వరకూ ఉండి మధ్యలో ఇటు ఎగ్జిబిషన్ స్టాల్ వద్దకు నేనూ, నాగభూషణం గారు (మిత్రులు, పాఠకులు, వరంగల్) బయల్దేరాం. మేం వెళ్లేటప్పటికి వీవెన్, దాట్ల శ్రీనివాసరాజు గారు, కశ్యప్ గారు, దూర్వాసుల పద్మనాభం గారు, వెంకటరమణ గారు, మురళీ గారు, సతీష్ కుమార్ గారు, యోగి గారు, అనిల్ అట్లూరి గారు తదితరులు కార్యరంగంలో బిజీ బిజీగా ఉన్నారు. పద్మనాభం గారు అందరికన్నా ముందు 12 గంటలకే వచ్చేశారని తెలిసింది. పుస్తక మహోత్సవం చివరిరోజు కావడం వల్ల అప్పటి నుండే విపరీతంగా జనసందోహం ఉన్నట్లు తెలిసింది. 4 గంటల ప్రాంతంలో ఇతర మిత్రులు ఒకరొకరుగా వచ్చినట్లు తెలిసింది.


ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కార్యక్రమాలకు అతిధిగా విచ్చేసిన సిపియం బి.వి. రాఘవులు గారు మన e-తెలుగు స్టాల్ వద్దకు వచ్చి మన కార్యకలాపాల గురించి తెలుసుకుని అభినందించినట్లు, వారి ఇ-మెయిల్ తదితర వివరాలు అందించినట్లు తెలిసింది. అలాగే మహిళా నాయకురాలు సంధ్య గారు కూడా మన స్టాల్ ని సందర్శించారని తెలిసింది. ఎగ్జిబిషన్ నిర్వాహకులు కేంద్రమంత్రి పురంధరేశ్వరి గారినీ, రాఘవులు గారినీ అతిధులుగా ఆహ్వానించి ఎగ్జిబిషన్ ముగింపు సభ జరిపారు. ఆ సభపై అతిధుల ప్రసంగాల తర్వాత ఎంపిక చెయ్యబడిన కొన్ని స్టాళ్లకు షీల్డ్ లు బహూకరించే కార్యక్రమం నిర్వహించారు. ఎంపిక చెయ్యబడిన వాళ్లలో ఒకరిద్దరు స్టాల్ నిర్వాహకులకు షీల్డ్ లు బహూకరించడం పూర్తయిన తర్వాత పురంధరేశ్వరి గారూ, రాఘవులు గారు బయల్దేరడం వల్ల మన e-తెలుగు తరఫున మన బ్లాగు మిత్రులు వారి చేతుల మీదుగా షీల్డ్ అందుకునే అవకాశాన్ని పొందలేకపోయాం. అయినప్పటికీ పురంధరేశ్వరి గారికి మన e-తెలుగు పుస్తకాన్ని అందజేయగలిగాం. ఇకపోతే సినారె (నారాయణరెడ్డి) గారిని మొన్నొక రోజు కలిసినప్పటికీ ఆరోజు మన పుస్తకాన్ని అందజేయడానికి మాత్రమే వీలుపడింది. ఈరోజు ఆయన్ని స్టాల్ వద్దకు తీసుకువచ్చి ఓ రెండు నిముషాలు వివరించడానికి సాధ్యపడింది. మాటల్లో మొన్న మనం ఇచ్చిన పుస్తకాన్ని ఆయన చదివినట్లు తెలిపారు. ఇకపోతే చుక్కా రామయ్య గారికి సన్నిహితులైన రాము గారు ఈరోజు కూడా మరోమారు కలిసి తెలుగు ఎనేబుల్, బ్లాగులపై డెమో కోసం చేసిన సిడిని తీసుకోవడంతో పాటు తెలుగుపై తనకున్న అభిమానం కొద్దీ తానూ మన కార్యకలాపాల్లో ఇకపై చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. ఈరోజు చెప్పుకోదగ్గ మరో విశిష్ట వ్యక్తి ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గారు. ఆయన మన కార్యకలాపాలకు సంతోషించి చాలా ఆత్మీయంగా తన వంతు సహకారం అందిస్తామన్నారు. మరో విషయం ఈరోజు ఉదయం ఈటీవీ -2లో "తెలుగు వెలుగులు" ప్రోగ్రామ్ లో తెలుగు భాష వ్యాప్తికి కృషిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థల గురించి వివరిస్తూ కొన్ని సెకండ్ల పాటు మన e-తెలుగు గురించి కూడా మొన్న షూట్ చేసిన విజువల్స్ చూపిస్తూ ప్రసారం చేశారట. "నా స్పందన" బ్లాగర్ లలిత గారు దాన్ని రికార్డ్ చేశారట. ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు. మొన్నొక రోజు కూడా TV5లో వచ్చిన క్లిప్ ని కూడా రికార్డ్ చేసి పంపించారు. అయితే TV5 క్లిప్ ఒరిజినల్ ని అనిల్ గారు సంపాదించారు. యోగి గారు http://in.youtube.com/watch?v=HkbNCSBw0EE అనే లింకులో హై క్వాలిటీ క్లిప్ ని పొందుపరిచారు. ఈ క్రింద కూడా ఆ వీడియో చూడవచ్చు. ETV 2ది లభించే మార్గం లేదు కాబట్టి లలిత గారు రికార్డ్ చేసినది మన archivesకి పనికొస్తుంది.







ఎగ్జిబిషన్ ముగిసింది, అందరూ దుకాణాలు కట్టేసుకుంటున్నారు. మేమూ సరంజామా సర్ధుకుని ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఎగ్జిబిషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలైన శ్రీనివాసరావు గారినీ, హన్మంతరావు గారికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారితో ఫొటోలు దిగాం. వారి గురించి ఒక్క ముక్క చెప్పాలి. ఎక్కువ రోజులు వారితో స్పెండ్ చేయడం వల్లనేమో, లేదా వారి మంచితనం వల్లనేమో వారితో ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఓ రకంగా మిత్రులం అయిపోయాం. రేపటి నుండి వారి చిరునవ్వులు, కనుసైగలతో వారిద్దరూ వ్యక్తపరిచే ప్రోత్సాహాలు మిస్ అవుతానన్న ఫీలింగ్ తో గుండె బరువుతో ఎగ్జిబిషన్ ని విడిచి బయటపడ్డాను. మన మిత్రులకూ ఇదే మాదిరి ఫీలింగ్ కలిగే ఉంటుంది.


ఇక బ్లాగు మిత్రులతో ఇన్నాళ్లూ ఏర్పడిన సాన్నిహిత్యం గురించి కొన్ని వాక్యాల్లో ఏమని రాయను? రేపటి నుండి ఎవరి జీవితాలు వారివి! రోజూ ఎగ్జిబిషన్ లో సాయంత్రాలు గంటలు క్షణాల్లా గడిపేసిన జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. ఇదో మధుర జ్ఞాపకం. మన బ్లాగర్ల మధ్య బంధాలు మరింత బలపడడానికి వేదికైంది ఈ పుస్తక మహోత్సవం. నేరుగా ఇందులో పాల్గొన్న బ్లాగర్ల ద్వారానైతేనేమి, రోజువారీ నివేదికలకు స్పందిస్తున్న బ్లాగు మిత్రుల అభిప్రాయాల ఆధారంగానైతేనేమీ.. ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. బ్లాగర్లందరూ అరమరికలు లేని ఓ చక్కని కుటుంబం. ఇదే స్పిరిట్ తో ఉత్సాహంగా అడుగులు వేద్దాం.


పోస్ట్ కోసం వేగంగా ఫొటోలు పంపిన చావా కిరణ్ గారికీ, దాట్ల శ్రీనివాసరాజు గారికీ ధన్యవాదాలు.
12.32 AM (29-12-2008)

Saturday, December 27, 2008

ఎగ్జిబిషన్ లో తెలుగు బ్లాగర్ల వాణి - 27-12-2008 నివేదిక




ఈరోజు 1.30 ఆకాశవాణి Rainbow FM ఛానెల్ లో మన e-తెలుగు గురించి ప్రోగ్రాం ఆ స్టేషన్ ఇంఛార్జ్ అయిన మిత్రుడు ప్లాన్ చేసి చదువరి గారినీ, నన్నూ ఆహ్వానించారు. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని ఖైరతాబాద్ నుండి AIR స్టేషన్ కి వెళ్లడానికి 20 నిముషాలకు పైగా పట్టింది. ద్వారకా హోటల్ దగ్గరే 1.18 pm అయింది. ట్రాఫిక్కేమో భయంకరంగా ఉంది. మొత్తానికి 1.25 ప్రాంతంలో స్టేషన్ కి చేరుకున్నాం. వెళ్లడమే రికార్డింగ్ రూమ్ లోకి హడావుడిగా వెళ్లాం. మిత్రుడు రాంబాబు గారు ప్రశ్నలు వేస్తూంటే e-తెలుగు గురించి చదువరి గారూ, కంప్యూటర్లో తెలుగు చదవడం, రాయడం ఇతర సాంకేతిక విషయాల గురించి నేనూ సమాధానాలు ఇస్తూ వచ్చాం. మధ్య మధ్యలో రెండు మూడు పాటలు, ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడం జరిగింది. మన బ్లాగర్లు మురళీ గారు, చక్రవర్తి గారు, రమణి గారు, స్వాతి గారు (స్వాతి చక్రవర్తి గారనుకుంటాను) ఫోన్లు చేసి కొన్ని ప్రశ్నలు అడిగారు. సురేష్, శ్రీనివాసరావు వంటి కొందరు శ్రోతలు తమ సందేహాలు తీర్చుకున్నారు. ప్రోగ్రాంలో వీలైనంత వివరంగా మనందరి కార్యకలాపాల గురించి శ్రోతలకు వివరించడానికి సమయం దొరికింది.

ప్రోగ్రాం అయిపోయాక నేరుగా పుస్తక ప్రదర్శన వద్దకు బయల్దేరాం. అప్పటికే దూర్వాసుల పద్మనాభం గారు వచ్చి ఉన్నారు. ఈరోజు 12 గంటల నుండే ప్రదర్శన ఉంటుంది కదా! ఆయన 12కే వచ్చారట. ఆయన ఎన్నోసార్లు మీరు నన్ను ఎక్కువ పొగిడేస్తున్నారు అని అంటున్నా నాది పొగడ్త కాదు. ఆయన్ని చూస్తే నాకు అన్పించే ఫీలింగ్ ఖచ్చితంగా ఆయన నాకు ఒక కోణంలో ఆదర్శం అవుతారు. ఆయన్ని చూసి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. హ్యాట్సాఫ్ పద్మనాభం గారు. కొద్దిసేపటికి దాట్ల శ్రీనివాసరాజు గారు, "నేను లక్ష్మి" ఫేం లక్ష్మి గారు (వాళ్ల పాప మానస, మానస మిత్రుడు శ్రీకాంత్ తో కలిసి), మరో బ్లాగర్ సతీష్ కుమార్ యనమండ్ర గారు, యోగి గారు, మురళీగానం మురళి గారు, శ్రీనివాసకుమార్ గారు, అనిల్ అట్లూరి గారు, కత్తి మహేష్ గారు, క్రాంతి గారు, ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీతారాంరెడ్డి గారు ఒకరి తర్వాత ఒకరు విచ్చేశారు. అందరూ కష్టపడుతుంటే నిన్నా ఈరోజూ నాది ప్రేక్షకపాత్రే. వరుసగా ఒక్కరోజు విడిచి పదిరోజులుగా వెళ్తుండడం, రాగానే నివేదిక రాయడం, కొన్ని పనులు పెండింగ్ పడిపోవడం వగైరా కారణాల వల్ల అటు ఫిజికల్ గానూ, సైకలాజికల్ గానూ కొంత డల్ అయ్యాను. ఎటూ మన మిత్రులు ఎంతో ఉత్సాహంగా కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు కదా!

పుస్తకాలు కొనాలనుకున్న మిత్రులందరూ తడవలు తడవలుగా ఎగ్జిబిషన్ ని ఓ చుట్టు చుట్టేసి జ్ఞానాన్ని సంచుల్లో చుట్టుకువస్తున్నారు. నేనూ "మిట్టూరోడి పుస్తకం", మిత్రుడి సూచన మేరకు ఛంఘిజ్ ఖాన్ నవల, peace, vibrations, స్వరనీరాజనం శీర్షికలో అన్నమయ్య, త్యాగరాజ,రామదాసు కీర్తనల instrumental సంగీతం సిడిలు కొనేసి పరిమితంగా షాపింగ్ ముగించాను. నాకు అత్యంత ఇష్టమైన చలం మ్యూజింగ్స్ గతంలో మిస్ అయిన కాపీని పూరించడానికి కొత్తది మొన్ననే కొనేశాను. లక్ష్మి గారి పాప మానస మాటలకు, చలాకీతనం అందరికీ ముచ్చటేసింది. ఇదిలా ఉండగా అనూహ్యంగా జ్యోతక్క మళ్లీ పుస్తకప్రదర్శనలో దర్శనమిచ్చారు వారి అబ్బాయితో కలిసి! వస్తూ వస్తూ కుర్ కురే, హల్డీరామ్స్ తీసుకువచ్చారు మన మిత్రుల కోసం. ఓ 20 నిముషాలు ఉండి జ్యోతి గారు, మరికొద్ది సేపటికి లక్ష్మి గారు సెలవు తీసుకున్నారు. మిత్రులందరం ఓ పక్క సందర్శకులకు వివరంగా చెబుతూ మరో పక్క దొరికిన సందడి వాతావరణాన్ని మనసారా ఆస్వాదిస్తూ గడిపాం. రోజూ ఏవో ఒక కోటబుల్ కోట్స్, హైలెట్స్ ఉంటూనే ఉన్నాయి. జోకులు పేలుతూనే ఉన్నాయి. బ్లాగర్లకు మధ్య అనుబంధం మరింత బలపడుతూ ఉంది. ఏమాత్రం భేషజాలు లేని ఇలాంటి మిత్రులు ఒకచోట కలవడం, ఆలోచనలు పంచుకోవడం ఓ అదృష్టమే. ఇలా నేరుగా కలిసిన వారే కాదు బ్లాగుల్లోనూ, కామెంట్ల ద్వారానూ, తమ చర్యల ద్వారానూ మనమంతా ఒకటి అనే స్పిరిట్ ని కలిగి ఉన్న ఆత్మీయులందరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నివేదికలు పూర్తయిన తర్వాత ఈ 10 రోజుల అనుభవం మిగిల్చిన అనుభూతులను అక్షరాల్లో పేర్చి ఒక్క పోస్ట్ రాయాలనుకుంటున్నాను.


ఇకపోతే క్రితం పోస్ట్ లో ఆదివారం నేను వెళ్లబోవడం లేదని ప్రస్తావించాను. ఆదివారం (ఈరోజు) కంప్యూటర్ ఎరా రీడర్స్ మీటింగ్ ఉంది మధ్యాహ్నం 3 గంటలకు. సరిగ్గా సంవత్సరం నుండి ప్రతీ నెలా ఆ మీటింగ్ చివరి ఆదివారం జరుగుతూ వస్తోంది. దాదాపు 10-25 మంది సభ్యుల వరకూ హాజరవుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు మన e-తెలుగు స్టాల్ కి వెళ్లడం డౌట్ వ్యక్తం చేశాను. అయితే ఇన్ని రోజులు వెళ్లి చివరిరోజైన రేపొక్కరోజు వెళ్లకుండా ఉండడం నాకూ మనసొప్పడం లేదు. వీలైనంత వరకూ 5 గంటలకు మా మీటింగ్ ముగించేసి వెళతాను. వెళితే రేపటి నివేదికా రాస్తాను. ఈ నివేదికలను ఓపికగా చదువుతున్న మిత్రులకు మరోమారు ధన్యవాదాలు, అలాగే ఫొటోలను అందిస్తూ సహకరిస్తున్న దాట్ల శ్రీనివాసరాజు గారికి కూడా కృతజ్ఞతలు.

- 12.54AM (28-12-2008)

ఇతర భాగాలు:
ఈ నివేదిక మొదటి భాగం:
http://sridharcera.blogspot.com/2008/12/1.html


ఈ నివేదిక రెండవ భాగం:
http://sridharcera.blogspot.com/2008/12/1_21.html

ఈ నివేదిక మూడవ భాగం:
http://sridharcera.blogspot.com/2008/12/5.html


ఐదవ రోజు నివేదిక:
http://sridharcera.blogspot.com/2008/12/3.html


ఆరవ రోజు నివేదిక:
http://sridharcera.blogspot.com/2008/12/6-23-12-2008_23.html


ఏడవ రోజు నివేదిక:
http://sridharcera.blogspot.com/2008/12/7-24-12-2008.html

26-12-2008 నివేదిక:
http://sridharcera.blogspot.com/2008/12/26-12-2008.html

ఎగ్జిబిషన్ లో తెలుగు బ్లాగర్ల వాణి - 26-12-2008 నివేదిక




26వ తేదీ నివేదిక:


తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారూ, దాట్ల శ్రీనివాసరాజు గారూ, నేనూ కలిసి ఈరోజు స్టాల్ వద్దకు వెళ్లాం. వెళ్లూ వెళ్లూ నెక్లెస్ రోడ్ ని తాడేపల్లి గారు కామ్ కోడర్ లో బంధించారు. e-తెలుగు ప్రదర్శన జరిగిన రోజు ఆయన షూట్ చేసిన footageని వీలైనంత హృద్యంగా మలచాలన్నది ఆయన ఆకాంక్ష. స్టాల్ వద్దకు చేరుకునేసరికి అప్పటికే "జీవితంలో కొత్తకోణం" బ్లాగర్ శ్రీనివాసకుమార్ గారు వచ్చేసి సందర్శకులకు వివరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ కలిసిన మిత్రులతో మాట్లాడుతూ డయాస్ వద్ద అరగంటకు పైగా ఉండిపోయాను. తిరిగి వచ్చేసరికి అష్టావక్ర యోగి గారు, మరో వ్యక్తీ మన స్టాల్ లో కూర్చుని ఉన్నారు. యోగి గారిని విష్ చేసి ఈయనెవరా అని డైలమాలో ఉండగా ఆయనే హరిసేవ బ్లాగరి దుర్గేశ్వరరావు గారని తెలిసింది. అంతకుక్రితమే ఆయన హైదరాబాద్ లో ఉన్నానని కాల్ చేయగా స్టాల్ వద్దకు వస్తే బాగుంటుందని అన్నాను. ప్చ్.. ఆయన్ని పోల్చుకోలేకపోయాను. ఆయన చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ తనతో పాటు తీసుకువచ్చిన అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. చాలా సంతోషం అన్పించింది.
యోగి గారు, దుర్గేశ్వరరావు గారు, తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు.

కొద్దిసేపట్లో కత్తి మహేష్ కుమార్ గారు కూడా వచ్చేశారు. అలాగే మురళీగానం మురళి గారు, చదువరి గారు, చావా కిరణ్ గారు, వెంకటరమణ గారు, అనిల్ అట్లూరి గారు, కశ్యప్ గారు ఒకరొకరిగా వచ్చి మన గుంపులో కలిశారు. దాట్ల శ్రీనివాసరాజు గారు, కత్తి మహేష్ గారు, వెంకటరమణ గారు, చావా కిరణ్ గారు వచ్చిపోయే సందర్శకులకు ఓపికగా వివరిస్తూ పూర్తిగా నిమగ్నమైపోయారు. ఈరోజు అస్సలు నా కంట్రిబ్యూషన్ ఏమీ లేదనే చెప్పాలి. మధ్యలో భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారు వచ్చి మన మిత్రులతో కాసేపు ముచ్చటించి వెళ్లారు.



ఈరోజు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారినీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్ గారినీ, రిటైర్డ్ IPS అప్పారావు గారిని, ముద్ర కమ్యూనికేషన్స్ అధినేత ఎ.జి. కృష్ణమూర్తి గారిని కలిసి మన కార్యకలాపాల గురించి క్లుప్తంగా వివరించాం. లక్ష్మీప్రసాద్ గారు ఎగ్జిబిషన్ ఆవరణలో ఉన్న ప్రోగ్రామ్ ముగిశాక వెనువెంటనే ఢిల్లీ వెళ్లవలసి ఉందని, ఓసారి నేరుగా వచ్చి కలవమని తెలిపారు. అలాగే ఎ.బి.కె. ప్రసాద్ గారు కూడా ప్రోగ్రాం హడావిడిలో ఉన్నారు. 30వ తేదీ నేరుగా తన ఆఫీసులో కలవండి అని టైమ్ ఇచ్చారు.

అందరు బ్లాగు మిత్రులు ఒక చోట కలవడం, బ్లాగులకు సంబంధించి, మున్ముందు చేయవలసిన కార్యకలాపాల గురించి, ఇతర అంశాల గురించి చర్చించుకున్నాం. సందర్శకులు మాత్రం కంప్యూటర్లో తెలుగు అక్షరాలను చూసీ, అదీ చాలా సులభంగా మెయిల్, ఛాటింగ్ లో తెలుగు వాడవచ్చని తెలుసుకుంటూ ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఒక్క మాట అన్పిస్తోంది.. ఇందరు వ్యక్తులు ఒక్క క్షణం పాటు మనందరం తెలుగు భాషకు ఉడతాభక్తిగా చేస్తున్న ఈ కొద్దిపాటి సేవకు తన్మయులు అవుతున్నారంటే అంతకన్నా మనకు కావలసిన ఆత్మతృప్తి ఏముంటుంది?




Friday, December 26, 2008

ఈరోజు 1.30-2.30 Rainbow FMలో e-తెలుగు లైవ్ ప్రోగ్రామ్

ఆల్ ఇండియా రేడియో వారి Rainbow FM 101.9 ఫ్రీక్వెన్సీ లోని ఛానెల్ లో ఈ రోజు మధ్యాహ్నం 1.30 - 2.30 కంప్యూటర్లో తెలుగు, e-తెలుగు కార్యకలాపాల గురించి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. బ్లాగు మిత్రులకు ఎటూ ఈ అంశాలపై అవగాహన ఉంటుంది. మీ మిత్రులకెవరికైనా ఆయా అంశాలపై సందేహాలుంటే 040- 23234821 లేదా 040-23234822 అనే నెంబర్లలో కాల్ చెయ్యమని చెప్పగలరు.

ఎగ్జిబిషన్ లో నిన్నటి నివేదిక కొన్ని పెండింగ్ పనులను చూసుకోవలసి వచ్చి రాయలేకపోయాను. నిన్నటిదీ, ఈరోజుదీ కలిపి నివేదిక రాస్తాను. రేపు ఆదివారం నేను స్టాల్ వద్దకు వెళ్లడం లేదు. సో ఈరోజుదే చివరి నివేదిక. ఎవరైనా మిత్రులు రేపటి విశేషాలు రాస్తే ఓకే.

Thursday, December 25, 2008

ఎగ్జిబిషన్ లో తెలుగు బ్లాగర్ల వాణి - 8వ రోజు నివేదిక (25-12-2008)

బ్లాగర్లందరూ మరోమారు ఒక చోట చేరిన మరో పండుగరోజు ఈరోజు. ఈరోజు 12 గంటల నుండే ప్రదర్శన ప్రారంభం. నేనూ, భార్గవ్ 1.45కి అక్కడికి చేరుకున్నాం. అప్పటికే దూర్వాసుల పద్మనాభం గారు దుకాణం తెరిచి ఉన్నారు. క్రిస్టమస్ కావడం వల్ల అంత మధ్యాహ్నం కూడా విపరీతంగా జనాలు వచ్చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చేశారు. అలాగే బెంగుళూరు నుండి స్వస్థలం వెళుతూ శ్రీకాంత్ గారు కూడా ప్రత్యేకంగా అందరినీ కలిసినట్లవుతుందని స్టాల్ కి వచ్చారు. విరజాజి బ్లాగరి శిరీష గారు కూడా పెందలాడే వచ్చేశారు. జనాలు గుంపులు గుంపులుగా రావడం తాడేపల్లి గారు, పద్మనాభం గారు, శ్రీనివాసకుమార్ గారు, నేనూ సందర్శకులకు తెలుగులో టైప్ చేయడం, తెలుగు చూడడం పై వివరాలు అందిస్తుంటే శిరీష గారు, భార్గవ్ గారు, శ్రీకాంత్ గారు అన్ని పాంప్లెట్లపై లేఖిని, బరహ లింకులు ప్రత్యేకంగా రాసిపెడుతూ సమయానికి అందజేస్తూ వచ్చారు. దాట్ల శ్రీనివాసరాజు గారూ ఛార్జ్ తీసుకున్నారు. చదువరి గారూ విచ్చేసి విజయవాడ పుస్తక ప్రదర్శనకి ఒక రోజు ప్రదర్శనకు వెళ్లడానికి సిద్ధం అవమని అందరు బ్లాగర్లని కోరడం జరిగింది. 4వ తేదీన అది ప్లాన్ ఉంది. తాడేపల్లి గారు అరటిపండు వలిచినట్లు మాటలతోనూ, లాప్ టాప్ లో చూపిస్తూనూ వివరిస్తుంటే సందర్శకులు అలాగే వింటూ ఉండడం చూసి మరికొంత మంది సందర్శకులు ఆకర్షితులై మన స్టాల్ వద్ద సందడి సందడిగా తయారైంది.




4.30 pm నుండి తోటి బ్లాగర్ల ప్రవాహం ప్రారంభమైంది. ముందూ వెనకలగా ఎవరెప్పుడు వచ్చారో ఇధమిద్ధంగా గమనించలేదు కానీ కొల్లూరి సోమశంకర్ గారు, జ్ఞాన ప్రసూన గారు, పూర్ణిమ గారు, వరూధిని గారు, సుజాత గారు, జ్యోతి గారు, రమణి గారు, మురళీగానం మురళి గారు, అనిల్ అట్లూరి గారు, స్వాతీచక్రవర్తి దంపతులు, కల్హార స్వాతి కుమారి, సాంబశివరావు గారి దంపతులు, కస్తూరి మురళీకృష్ణ గారు, కత్తి మహేష్ కుమార్ గారు ఈరోజు ప్రదర్శనకు విచ్చేశారు. మొత్తం దాదాపు 24 మంది బ్లాగర్లు ఒకచోట చేరారన్నమాట. కొద్దిసేపు కొంతమంది బ్లాగర్లు మరికొద్ది సేపు మరికొంత మంది బ్లాగర్లు సందర్శకులకు సమాచారం అందిస్తూ వచ్చారు. అలాగే అందరూ ఒక చోట కలిశారు కదా జోష్ కీ, కబుర్లకూ హద్దే లేదు. ముచ్చట్లే ముచ్చట్లు. నడిచే లైబ్రరీ లాంటి తాడేపల్లి గారి మాటలకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. భార్గవ్ గారు, శిరీష గారు ఇతర మిత్రులు కలిసి కార్డ్ బోర్డ్ పై కొన్ని బ్లాగుల పేర్లు మూడు షీట్లుపై రాసి స్టాల్ బ్యాక్ డ్రాప్ లో కన్పించేలా అమర్చారు. "లీలామహల్ సెంటర్" వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దేవీ ప్రసాద్ గారిని మురళీగానం మురళీ గారు గుర్తించి చెప్పడంతో ఆయన్ని మన స్టాల్ కి ఆహ్వానించి దాదాపు ఓ 10 నిముషాల పాటు ఆయనకు మన కార్యకలాపాల గురించి, తెలుగు ఉనికిని నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించి ఆయన తదుపరి సినిమాల్లో ఎక్కడైనా కనీసం ఒక్క చిన్న షాట్ అయినా తెలుగు టైపింగ్, బ్లాగింగ్ ప్రక్రియల గురించి ప్రస్తావించమని కోరాను. ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. ఆయన వివరాలు తీసుకుని తర్వాత కలుస్తామని చెప్పాం.





బయటకు వెళ్లి వద్దామని స్టాల్ నిర్వాహకుల ఆఫీస్ మీదుగా నేను శ్రీనివాసరాజు గారు వెళ్తుండగా డా. బి.వి. పట్టాభిరాం గారు కలిశారు. దగ్గరకు వెళ్లి విష్ చెయ్యగానే ఆత్మీయంగా పలకరించారు. తెలుగు టైప్ చెయ్యడం ప్రయత్నించారట, "బాగుంది, చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి" అన్నారు. ఓరోజు ప్రత్యేకంగా మీవద్దకే వచ్చి వివరిస్తామని చెప్పాం. ఆయనా సంతోషంగా ఆహ్వానించారు. ఈరోజు బుక్ ఎగ్జిబిషన్ ఆవరణలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారిదీ, పట్టాభిరాం గారిదీ కార్యక్రమం ఉంది. చాలామంది హాజరయ్యారు. ఓ పక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మన స్టాల్ లో మన బ్లాగర్లు అందరూ ఒక చోట కలిశాం కదా ఏ క్షణాన్నీ మిస్ కానివ్వకుండా హాపీగా గడుపుతూ ఉన్నాం. (మీరెక్కడ మాతో కలిశారు అని నాపై దాడి చేయకండి :) )



చదువరి గారు, అనిల్ గారు, నేనూ బయట మాట్లాడుకుంటూ ఉండగా ప్రోగ్రామ్ ముగిసి చుక్కా రామయ్య గారు వెళ్లబోతూ కన్పించారు. ఆయన చుట్టూ పెద్ద అభిమాన వలయం, ఆటోగ్రాఫ్ ల కోసం. చదువరి గారు ఆయన్ని గమనించి చెప్పడంతో ఎలాగైనా ఆయన్ని మన స్టాల్ వద్దకు తీసుకువద్దామని ఆ వలయంలోకి చొరబడి ఆటోగ్రాఫ్ ల పని ముగియగానే మన కార్యకలాపాల గురించి కొన్ని సెకండ్లలో క్లుప్తంగా చెప్పి మన స్టాల్ ని ఒక్కసారి సందర్శించమని కోరడంతో పెద్ద మనస్సుతో ఆయన మన స్టాల్ కి వచ్చారు. ఆయన్ని కూర్చోబెట్టి e-తెలుగు గురించి తాడేపల్లి గారు క్లుప్తంగా వివరిస్తూ, demo తెలుగు టైపింగ్ చూపించారు. అంతలో రామయ్య గారి వ్యక్తిగత సిబ్బంది సమయం మించిపోతోంది అని వత్తిడి చేయడంతో ఆయన చేతిలో మన వివరాలతో బుక్ లెట్ అందజేసి ఒక్కసారి నేరుగా కలుస్తాం అని చెప్పి ధన్యవాదాలు తెలిపాం. ఆయన కౌన్సిల్ లో ఓసారి డిస్కస్ చేద్దాం అని మాట ఇచ్చారు. ఓసారి ఆయన్ని కలిసి మరింత వివరంగా దీనిపై చర్చించవలసి ఉంది. అలాగే నాగేశ్వర్ గారికీ ఇప్పటికే పరిచయం చేశాం కాబట్టి ఇద్దరి సాయమూ తీసుకోవచ్చునేమో!



పూర్ణిమ గారు వాళ్ల అమ్మగారిని తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు. ఆవిడా, మేమూ చాలా సంతోషించాం. జ్యోతి గారు కొద్దిసేపుండి వెళ్లిపోయారు. కల్హార బ్లాగరి స్వాతికుమారి గారిని కలవడం చాలా హాపీ. మరీ ముఖ్యంగా మా యోగా బ్యాచ్ మేట్ స్వాతికుమారి గారి భర్త సాంబశివరావు గారిని కలవడం చాలా సంతోషం అన్పించింది. (బ్యాచ్ మేట్ కన్నా యోగా instructorగా నేనూ, అప్పట్లో యోగాభ్యాసకుడిగా ఆయనా.. మా ఇద్దరికీ ముందే పరిచయం). అలాగే కర్నూల్ లో ఉన్నప్పుడు నా మిత్రుడు కరుణాకర్ గారు 12 సంవత్సరాల తర్వాత ఈరోజు కలవడం మరో సంతోషమైన విషయం. ఇవ్వాళ రిపోర్టులో నా వ్యక్తిగత విషయాలూ ప్రస్తావిస్తున్నానని అన్యధా భావించకండి. ఈ సంతోషాలను రిపోర్ట్ లో భాగం చెయ్యడం ద్వారా వాటిని మీతో పంచుకునే భాగ్యం కలుగుతోంది. అందరూ ఒకరొకరిగా సెలవు తీసుకుంటూ ఉన్నారు. చివరిగా మిగిలిన కొంతమందిమి దుకాణం మూసేసి అనుభూతులను మనసులో మోసుకుంటూ జ్ఞాపకాల అరల్లోకి తోసుకుంటూ ఇంటిదారి పట్టాం.

ఫొటోలను తీయడంతోపాటు ఇంత రాత్రి సమయంలో (11.45 PM) వాటిని నాకు అందజేయడం ద్వారా బ్లాగులో పెట్టే అవకాశం కల్పించిన దాట్ల శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు.

12.54 AM. (26-12-2008)



ఇతర భాగాలు:
ఈ నివేదిక మొదటి భాగం:
http://sridharcera.blogspot.com/2008/12/1.html


ఈ నివేదిక రెండవ భాగం:
http://sridharcera.blogspot.com/2008/12/1_21.html

ఈ నివేదిక మూడవ భాగం:
http://sridharcera.blogspot.com/2008/12/5.html


ఐదవ రోజు నివేదిక:
http://sridharcera.blogspot.com/2008/12/3.html


ఆరవ రోజు నివేదిక:
http://sridharcera.blogspot.com/2008/12/6-23-12-2008_23.html


ఏడవ రోజు నివేదిక:
http://sridharcera.blogspot.com/2008/12/7-24-12-2008.html