Thursday, December 02, 2010

Android ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? వీడియో సమీక్ష

ఇటీవలి కాలంలో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితమైన ఫోన్లు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. లేటెస్ట్ కెర్నల్ తో Windows Mobile 7ని కలిగి HTC HD 7 వంటి ఫోన్లను, iPhone OS4 ఫోన్లకు ధీటుగా మార్కెట్లో నిలుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ల స్వరూపాన్ని ఏమాత్రం వీటిపై అవగాహన లేని వారి కోసం పరిచయం చేయడానికై తెలుగులో ఆడియో వివరణతో ఒక వీడియో తయారు చేశాను ఆసక్తి ఉన్నవారు ఈ క్రింద చూడగలరు.

- నల్లమోతు శ్రీధర్


మరో విషయం ఈరోజు శుక్రవారం (3 డిసెంబర్ 2010) ETV2 సఖిలో మధ్యాహ్నం 2.35 నుండి 2.45 గంటల వరకూ నా ప్రోగ్రామ్ ని మిత్రులు చూడవచ్చు.

Tuesday, November 30, 2010

ఆన్ లైన్ షాపింగ్ పై ETV2 సఖిలో నేను చేసిన ఓ ఎపిసోడ్ వీడియో

ఆన్ లైన్ ద్వారా డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా చెల్లింపులు చేస్తూ మనకు కావలసిన వస్తువలను ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే డెలివర్ అయ్యేలా ఎలా తెప్పించుకోవచ్చో ఇటీవల ETV2 Sakhi ప్రోగ్రామ్ లో నేను చేసిన ఓ ఎపిసోడ్ వీడియోని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇందులో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా వివరించడం జరిగింది. స్పీకర్లు ఆన్ చేసుకుని చూడగలరు.

నేను చేసిన మరిన్ని టివి షోలను చూడాలంటే.. http://youtube.com/nallamothu అనే లింక్ ని విజిట్ చేయండి.


Friday, November 26, 2010

దేన్నయినా ఈజీగా PDF ఫైల్ గా మార్చుకోవడం ఎలా? (ఆడియో వివరణతో వీడియో)

మీకు నచ్చిన వెబ్ పేజీ లను, స్వంత బ్లాగులను PDF ఫైళ్లుగా చేసుకోవడం ఎలాగో "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" అనే నా టెక్నికల్ బ్లాగ్ లో 2007లోనే వివరంగా రాశాను. ఈ ప్రొసీజర్ పై అవగాహన లేని వారి కోసం తెలుగులో నా వాయిస్ వివరణతో ఈ క్రింద ఓ వీడియో తయారు చేశాను. మీ కంప్యూటర్ స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ వీడియో చూస్తే అంతా మీకే అర్థమవుతుంది. PDF ఫైళ్లని Windows, Mac OS X, లైనక్స్, విండోస్ మొబైల్, ఆండ్రాయిడ్, బ్లాక్ బెర్రీ, Symbian వంటి అన్ని ప్లాట్ ఫారమ్ లపై నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసి పెట్టగలిగే reader సాఫ్ట్ వేర్ ఒక్కటి ఆయా డివైజ్ లలో ఇన్ స్టాల్ అయి ఉంటే!

Thursday, November 18, 2010

I News తెలుగు ఛానెల్ లో తరచూ వచ్చే కంప్యూటర్ సమస్యలపై లైవ్ ప్రోగ్రామ్ వీడియో

మిత్రులకు నమస్కారం. I News తెలుగు ఛానెల్ లో తరచూ వచ్చే పలు కంప్యూటర్ సమస్యల గురించి నేను చేసిన ఓ లైవ్ ప్రోగ్రామ్ యొక్క వీడియోని ఈ క్రింద పొందుపరుస్తున్నాను. ఇతర టివి ప్రోగ్రామ్ ల కోసం http://youtube.com/nallamothu అనే లింక్ ని సందర్శించవచ్చు.



Monday, November 15, 2010

కంప్యూటర్ ని స్పీడప్ చేయడం ఎలా? (తెలుగులో వీడియో వివరణ)

అందరం ఏదో ఒక పని కోసం కంప్యూటర్ వాడుతుంటాం. రోజులు గడిచే కొద్దీ టెంపరరీ ఫైళ్లు పేరుకుని, హార్డ్ డిస్క్ లోని క్లస్టర్లు ఫ్రాగ్ మెంట్ అయి సిస్టమ్ స్లో అవుతుంటుంది. వినడానికి ఇవేవో కఠినమైన పదాల్లా అన్పించినా ఇలా జరక్కుండా అడ్డుకోవడం ఇప్పుడు చెప్పే పద్ధతితో చాలా సులభం. ఇలాంటి పలు సమస్యలను పరిష్కరించడంతో పాటు పిసిని finetune చేసుకునే మార్గం గురించి ఈ క్రింది వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే అర్థమవుతుంది. 2007 నుండి నేను చేసిన మరిన్ని టెక్నికల్ వీడియోలు, నా టెలివిజన్ షోలు చూడాలంటే..
http://youtube.com/nallamothu అనే లింక్ ని క్లిక్ చేయండి.

Sunday, November 14, 2010

USB పెన్ డ్రైవ్ లు ఎలా తయారు చేయబడతాయి? (తెలుగులో ఆడియోతో వీడియో)

ముఖ్యమైన డేటాని వివిధ కంప్యూటర్ల మధ్య ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి అనునిత్యం మనం వాడే USB పెన్ డ్రైవ్ లను సాధారణ మెటల్ ముక్క దశ నుండి కొనడానికి సిద్ధంగా ఉండే ప్యాకేజ్డ్ దశ వరకూ ఎలా తయారు చేస్తారో ఈ క్రింద నా తెలుగు డబ్బింగ్ తో ఓ వీడియోలో చూపించడం జరిగింది. ఆసక్తి ఉన్న వారు చూడగలరు.

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం అయిన నా ఇతర ప్రోగ్రాముల కోసం http://youtube.com/nallamothu అనే లింక్ ని క్లిక్ చేయండి.

Friday, November 12, 2010

ETV 2 సఖిలో ఈరోజుటి నా ప్రోగ్రామ్ వీడియో ఇది

మిత్రులకు నమస్కారం. గత ఏడాది కాలంగా ETV 2, I News, ABN, Zee 24 Hours ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న నా ప్రోగ్రాములను కొంతమంది మిత్రుల కోరిక మేరకు ఎప్పటికప్పుడు Youtubeలో అప్ లోడ్ చేస్తున్నాను.

ఇప్పటివరకూ ప్రసారం అయిన 60+ ప్రోగ్రాముల వీడియోలను

http://youtube.com/nallamothu అనే నా యూట్యూబ్ ఛానెల్ లో మిత్రులు చూడవచ్చు. అలాగే ఈరోజు (నవంబర్ 12, 2010,శుక్రవారం) ETV 2 సఖి ప్రోగ్రామ్ లో టెలికాస్ట్ అయిన నా ఎపిసోడ్ ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మనం రోజువారీ చేయాల్సిన పనుల్ని నేరుగా మన ఫోన్, మెయిల్ కే రిమైండర్స్ వచ్చేలా ఎలా కాన్ఫిగర్ చేసుకోవచ్చో ఈ ఎపిసోడ్ లో వివరించడం జరిగింది.

Thursday, September 30, 2010

సంతృప్తితో 10వ సంవత్సరంలోకి..

ICWAI చదివి.. సినిమా జర్నలిస్ట్ గా దాదాపు పెద్ద నటీనటులందరితోనూ పనిచేసి.. 1996లో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ సాహిత్యానికి శ్రీకారం చుట్టే అదృష్టం లభించీ.. ఎన్నో మలుపులతో సాగిన నా ప్రస్థానం 2001 అక్టోబర్ నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ద్వారా తెలుగు ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో కొనసాగుతూ వచ్చింది. ఈ అక్టోబర్ 2010తో "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగిడబోతోంది. ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో నిఖార్సయిన నాలెడ్జ్ ని అందించడానికి, పాఠకులకు వీలైనంత సమాచారం ఇవ్వడానికి అహోరాత్రాలు ఎంత శ్రమించానో నా ఒక్కడికే తెలుసు! కారణం "కంప్యూటర్ ఎరా"ని 9 సంవత్సరాల పాటు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ ప్రతీ లైనూ ఒక్కడినే రాస్తూ, టైప్ చేస్తూ, పేజ్ మేకప్ చేస్తూ నిర్వహిస్తూ వస్తున్నాను కాబట్టి.. ఇంత బాధ్యతని నిర్వర్తించడం వెనుక ఎంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటానో నాకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు. సగర్వంగా చెప్పుకుంటున్నాను.

1996లో తెలుగులో టెక్నికల్ లిటరేచర్ ని మొదటిసారిగా మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ ఎంతోమంది నా మిత్రులు, ఆత్మీయులు, పాఠకులు నా గైడెన్స్ లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నతస్థానంలో స్థిరపడుతూ వచ్చినా ఇప్పటికీ సాధారణ ఎడిటర్ గా పనిచేస్తూ పాఠకులకు మంచి నాలెడ్జ్ ని అందించాలన్న తపనని ఇంకా కాపాడుకుంటూ రాగలుగుతున్నానంటే ఖచ్చితంగా అది నా స్థిరనిశ్చయాన్ని ప్రతిఫలిస్తుంది.

ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకుని కంప్యూటర్ ఎరా ద్వారా నేను రాసే ఎడిటోరియల్స్ స్ఫూర్తితో, మేగజైన్ లో రాసే టెక్నికల్ కంటెంట్ తో నాలెడ్జ్ ని పెంచుకుని ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ ఆశావాదంతో జీవితం సాగిస్తున్న ఓ పాఠకుడూ, 65 ఏళ్ల వయస్సులోనూ వేరే ఊరి నుండి నన్ను ఎలాగైనా కలుసుకోవాలని వచ్చి నేను అందుబాటులో లేకపోతే నడివేసవిలో పగలంతా బయటతిరిగి సాయంత్రం వరకూ నా కోసం వెయిట్ చేసిన నాగార్జునసాగర్ కి చెందిన ఓ పెద్దాయనా, అస్థవ్యస్థమైన జీవనశైలి నుండి ఎలాగైనా జీవితంలో పైకెదగాలని పట్టుదలతో ఏకలవ్యశిష్యునిలా నన్నూ, కంప్యూటర్ ఎరానీ ఆసరాగా చేసుకుని ఈరోజు అద్భుతమైన ప్రతిభతో NTV వంటి ఛానెల్ లో వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న మరో ఆత్మీయుడూ.. ఇలా ఎందరో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ తమ ఆశీర్వచనాలను అందిస్తూ నాకు మనోస్థైర్యాన్ని అందిస్తున్నారు.

వీళ్లందరినీ కాదనుకుని నేను ఇప్పటికన్నా గొప్పగా జీవించగలను.. కానీ ఎందరికో జీవితంలో స్థిరపడడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగే గురుతర బాధ్యత ముందు నా ఒక్కడి స్వార్థం సరైనదని అనుకోను. అందుకే ఇప్పటికీ తొమ్మిదేళ్లు గడిచినా "కంప్యూటర్ ఎరా"లో నాదైన పర్సనల్ టచ్ ఉంటూనే ఉంటుంది. మార్కెట్లో ఎన్నో కంప్యూటర్ పత్రికలు ఉండొచ్చు.. ఏరోజూ "కంప్యూటర్ ఎరా"ని ఇతర పత్రికలతో పోల్చుకోలేదు.. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషువి గానీ, తెలుగువి కానీ ఇతర కంప్యూటర్ పత్రికలు నేను తిరగేసి చూసింది చివరిగా 2005లో.. అదీ ఓ బుక్ స్టాల్ మిత్రుడి కోరిన మీదట. మొదటి నుండి "కంప్యూటర్ ఎరా"ని ఓ సాధారణ పత్రికగా కాకుండా పదిమందికీ నాలెడ్జ్ ని పంచిపెట్టే ఓ చక్కని అవకాశంగా భావిస్తూ వచ్చాను. అందుకే వీలైనంత వరకూ పాఠకులకు అందుబాటులో ఉంటూ వచ్చాను. 2001 నుండి 2005 వరకూ రోజుకి 60-65 మందికి ఫోన్ ద్వారా డౌట్లు క్లారిఫై చేస్తూ వచ్చాను.. తర్వాతి కాలంలో సమయాభావం వల్ల పాఠకులు ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలా 13,000 మందితో 2007 నుండి 2009 జూలై వరకూ "కంప్యూటర్ ఎరా" ఫోరమ్ ని నిర్వహించడం జరిగింది. పలు టెక్నికల్, సంస్థాపరమైన, ఇతర కారణాల వల్ల ఫోరమ్ ని నిలిపివేయవలసి వచ్చింది.

రోజు మొత్తంలో 60-65 ఫోన్ కాల్స్ కి డౌట్లు చెప్పేటప్పుడూ, ఫోరమ్, ఛాట్ సర్వీసులను నిర్వహించి రెండేళ్లకు పైగా ఆరోగ్యం అశ్రద్ధ చేస్తూ వేకువజాము 2-3 వరకూ సమయాన్ని దాని నిర్వహణపై వెచ్చించినప్పుడూ గుర్తుకురాని నేను.. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించక ఆ సర్వీసులను నిలిపివేయడం జరిగిందో అప్పుడు నిష్టూరమాడడానికి కొంతమంది పాఠకులకు టార్గెట్ గా నిలిచాను. అయినా రకరకాల మనుషుల మనస్థత్వం మొదటినుండీ అలవాటైనదే కావడం వల్ల సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నిజంగా నాకు ఇంతటి గొప్ప బాధ్యతని అప్పజెప్పినందుకు భగవంతునికి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటున్నాను. సమాజం పట్ల నా బాధ్యతని తీర్చుకునే అవకాశం నాకు కలిగింది. అందుకే నన్ను ఎంతోమంది అర్థం చేసుకున్నా, కొందరికి నేను సరిగ్గా అర్థం కాకున్నా నాకెవరూ శత్రువులు లేరు.. అందరూ నాకు శ్రేయోభిలాషులే.. అందరి శ్రేయస్సునూ అభిలషించే వాడినే! మొదటి నుండి ఎలాంటి పబ్లిసిటీ హంగామా లేకపోయినా "కంప్యూటర్ ఎరా" తెలుగు పత్రికని ఆదరించి, తమకు తెలిసిన పదిమందికీ పరిచయం చేస్తూ మా కష్టం మరెంతో మందికి నాలెడ్జ్ అందించేలా సహకరిస్తున్న పాఠకులకు వందనాలు.

తొమ్మిదేళ్ల పాటు ప్రతీ నెలా 1వ తేదీకల్లా పత్రికను మార్కెట్లోకి తీసుకురావడానికి ఒంటిచేత్తో మేగజైన్ రాస్తూ ఎన్ని ముఖ్యమైన శుభకార్యాలు, సంఘటనల్ని మిస్ చేసుకున్నానో, అనారోగ్య కారణాల వల్ల అతి కొద్ది సందర్భాల్లో మేగజైన్ మార్కెట్లో విడుదల అవనప్పుడు ఫోన్ల ద్వారా ఆరా తీసే రీడర్స్ కి నా వ్యక్తిగతమైన ఇబ్బందులను వివరించలేక ఎన్ని తంటాలు పడ్డానో అవన్నీ ఇంత సుదీర్ఘమైన మైలురాళ్ల ముందు దిగదుడుపుగానే భావిస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజం "కంప్యూటర్ ఎరా" లాంటి చిత్తశుద్ధి, పర్సనల్ టచ్ తో కూడిన ఏ పత్రికనూ పాఠకులు ఎప్పటికీ చూడలేరు. ఇది అతిశయోక్తిగా భావిస్తే ఓసారి 2001 నుండి 2010 వరకూ విడుదలైన అన్ని సంచికలూ కనీసం పేజీలైనా తిరగేసి చూడండి.. ఎందుకింత థీమాగా మాట్లాడుతున్నానో!

చివరిగా ఇంతకాలం స్వంత వ్యక్తిగా ఆదరించిన పాఠకులకు హృదయపూర్వక ధన్యవాదాలతో..

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక
http://computerera.co.in

Saturday, September 04, 2010

మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం.. సెప్టెంబర్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అనుసరించే పద్ధతే కరెక్ట్‌ అని ఫిక్స్‌ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్య ఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగా హఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులే’ అన్న అహం కమ్ముకుపోతుంది. అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుని ఉంటారు. ఓ చిన్న అపార్థం బుర్రని తొలవడం మొదలు.. ‘వాళ్లు మనకు చేసిందానికన్నా మనం వాళ్లకు ఎంతో సాయం చేశామని.. మనం లేనిదే వాళ్లకు జరుగుబాటు కాదని’ గత జ్ఞాపకాలను ప్రేమతో మానేసి ద్వేషంతో గుర్తుకుతెచ్చుకుంటాం. గతంలో అవతలి వారి చిరునవ్వులకు పులకించిపోయిన మనసు కాస్తా ద్వేషంతో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చినప్పుడు ఆ నవ్వులనే గుర్తు చేసుకుని మరీ చిటపటలాడుతుంది.


హ్యూమన్‌ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో మనుషుల మనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులో ఎక్కడా చిక్కదనం లేదు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌ నవ్వుకీ మన నవ్వుకీ తేడానే లేదు. రెండు నవ్వులూ అరక్షణమే విచ్చుకుంటాయి. అంతలోనే మూసుకుపోతాయి. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంత సులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్‌ చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు, ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యం పెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్‌ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే.. అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే ఆ అవసరాలు తీరగానే ఆ స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలో పైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులో స్వచ్ఛత లేనప్పుడు ఆ అనుబంధాలకు బలమెక్కడ?

మీ
నల్లమోతు శ్రీధర్