Tuesday, November 04, 2008
నేను ప్రత్యేకం
"అందరిలాంటి వ్యక్తిని కాదు నేను" అనుకుంటూ మనకిమనం ప్రత్యేకతను ఆపాదించుకోవడం ద్వారా మనం ఎంతో సంతృప్తిని మూటగట్టుకుంటుంటాం. ఇలా విభిన్నంగా ఉండాలన్న కోరికే ఒక రకంగా మన జీవితానికి జీవం కూడా పోస్తుందేమో! సామాజిక సంబంధాల్లో మనదైన ముద్రని స్థిరీకరించడానికి మనసు ఉవ్విళూరుతుంటుంది. అందుకే ఇంకొకరిని అనుకరించడం మనస్కరించదు. ఎన్నో అనుభవాల కలబోతగా విభిన్నమైన వ్యక్తిత్వం ఈపాటికే సంతరించుకోబడిన వ్యక్తుల గురించి కాదు ఇక్కడ ప్రస్తావిస్తున్నది! నూటికి తొంభైతొమ్మిది మనస్థత్వాలు మానసికంగానో, సామాజికంగానో, ఆర్థికంగానో.. ఏదో ఒక పార్శ్యంలో ఓ గుర్తింపుని సంతరించుకోవడానికి తాపత్రయపడేవే. ఎక్కడి వరకో ఎందుకు అందరికన్నా భిన్నంగా రాయాలన్న చిన్న కాంక్ష లేకపోతే ఈ బ్లాగుని ప్రారంభించాలన్న పురుగు కూడా నా మనసుని తొలిచి ఉండేది కాదు. జన్మతః మనసులో "నేను ప్రత్యేకం" అనే భావం మేటవేసుకోపోయి ఉన్నట్లయితే.. జీవితాంతం మానసికంగానూ, సామాజికంగానూ మనుషుల్లో ఎదుగుదల కరువయ్యేదేమో! మనల్ని నడిపిస్తున్న అదృశ్యశక్తి ఇది. ఏ క్షణమైతే "నేను అందరిలాంటి వ్యక్తిని, లేదా అందరికన్నా తక్కువ వ్యక్తిని" అన్న భావన మన అహాన్ని సజీవంగా నిలుపుతున్న కాంక్షని కాలరాస్తూ మనసులో చొరబడుతుందో ఆ క్షణం నుండి బ్రతుకు అతి సాధారణమైపోతుంది. నాకు "అహం" లేదు అంటూ మనం చిలకపలుకులు పలుకుతుంటాం కానీ పరిమిత స్థాయిలో ఆ భావనే లేకపోతే అందరి జీవితాలు నిస్సారంగానే ఉంటాయి. అందరికన్నా బాగా చదవాలి, పిల్లల్ని మనదైన పద్ధతిలో పెంచాలి, వ్యాపారంలో మనదైన ముద్రవేయాలి.. ఇలాంటి ఆలోచనలు చేయకపోతే జీవితాలకు ఇప్పటి తళుకులు ఎక్కడి నుండి వచ్చేవి? అందరికన్నా భిన్నంగా ఉండాలన్నది కొందరిని పెడద్రోవలనూ తొక్కిస్తుంది. అలాంటి వారి ప్రస్తావనా ఇక్కడ అప్రస్తుతమే. జీవితాన్ని నడిపిస్తున్న ఆ "ప్రత్యేకవాదాన్ని" :) పదిలంగా కాపాడుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
19 comments:
"నేను ప్రత్యేకం" అంటే మీగురించి ఏదో చెప్తున్నారెమో అనుకొన్నా! ప్రత్యేకవాదాన్ని, ప్రత్యేకంగా ప్రత్యేకించి చెప్పారు. "మనకంత లేదు లెండి", "అంత సీన్ లేదు" అంటూ ఎవరికి వారు, వారి వారి ప్రత్యేకతలను వాళ్ళకి తెలియకుండానే "నేను ప్రత్యేకం సుమా" అని చెప్తూనే ఉంటారు. మనము అందరికన్నా భిన్నంగా ఉండాలి అనే అభిలాష ప్రతి మనిషి కి అంతర్లీనంగా ఉంటుంది. అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలి అన్న భావనని మీ మనసులోంచి ప్రత్యేకించి చెప్పిన వైనం, మీ ప్రత్యేకతని చెప్పకనే చెప్తోందని, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనిపిస్తోంది.
మీరు ప్రత్యేకమే. ఈ సృష్టిలో ప్రతి వ్యక్తీ విభిన్న వ్యక్తే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఒక్కరు కారు. భిన్నంగా ఆలొచిస్తారు, స్పందిస్తారు. అన్ని బ్లాగులూ ఒక్కలా ఉండవు. శ్రీధర్ బ్లాగు, వ్యక్తి ప్రత్యేకమే. మీ భార్య కూడా ప్రత్యేక విశిష్ట వ్యక్తే. ఒక్కరు పోలి మరొకరుండరు. అదే సృష్టి వైచిత్రి.
-cbrao,
San Jose, CA.
ఇంతకాలం మీ సాంకేతికాలతో అందరిని ఆకట్టుకున్న మీరు, ఇలా "నేను ప్రత్యేకం" అంటూ నిజంగానే మీ ప్రత్యేకతని చాటుకున్నారు... మీనుండి మరిన్ని మంచి మంచి పోస్టులని రావాలని కోరుకుంటూ
రమణి గారన్నట్లు, నేను కూడా మీ ప్రత్యేకత గురించి చెబుతున్నారేమొ అనుకున్నా!
నిజమే.. దేని ప్రత్యేకత దానికుంటుంది.. లేదు లేదు అంటూనే చాలా ప్రత్యేకత చూపిస్తుంటాం..!
మీ సాంకేంతికాలు బ్లాగ్ Open అవడం లేదండీ నాకు..! కొంపతీసి ఇదేమైనా నా System ప్రత్యేకతా!!!
meeru nijamgaanE pratyEkamE sridhar gaaru!
@రమణి గారు ప్రత్యేకపురాణం విప్పేశారు కదా.. :):) థాంక్యూ!
@సిబిరావు గారు తెలుగు బ్లాగ్లోకంలో మీరే ఓ ప్రత్యేకమైన వ్యక్తి.
@లక్ష్మి గారు ధన్యవాదాలు, తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తాను.
@మేధ గారు థాంక్యూ. సాంకేతికాలు బ్లాగు ఒక్కోసారి సర్వర్ సమస్య వల్ల, మరికొన్ని సార్లు ISPల DNSల సమస్య వల్ల, India, US, UK, UAE దేశాలను మినహాయించి ఇతర దేశాల iprangesని స్పామ్ కారణంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల సమస్యలు వస్తున్నాయి. మొదటి రెండు కారణాలైతే కొద్దిసేపాగి ప్రయత్నిస్తే వస్తుంది.
@సుజాత గారు :) థాంక్యూ అండీ!
మీ రచనలో వైవిద్యం బాగుంది. పదక్రమం కూడా చాలా బాగుందండి...మీనుండి మరిన్ని మంచి మంచి పోస్టులని రావాలని కోరుకుంటూ.....
మీ శ్రీసత్య...
wow super.. blog template is also..
శ్రీధర్ గారూ, మీ రచనల్లో సరళత్వం, పదును రెండూ ఉంటాయి.. మీరు అప్పుడప్పుడు జ్యోతిగారి బ్లాగ్ ద్వారా చెప్పే ఇన్స్పిరేషనల్ సంగతులు నాకెంతో నచ్చుతాయి.. మీనించి ఇంకెన్నో రచనలకోసం ఎదురుచూస్తాము.
మీ బ్లాగ్ టెంప్లేట్ బావుంది :-)
అందరికన్నా భిన్నంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకోవడం మానవ నైజం! అది కొన్ని సార్లు పెడదోవలు పట్టిస్తుందేమో నాకు తెలీదు కానీ, ఎల్ల వేళలా అభివృద్ధికి దారులు వేస్తుందని, కొత్త పుంతలు తొక్కిస్తుందని నా అభిప్రాయం! నూతనత్వమే మనిషి జీవితంలో ఆశను చిగురింపజేస్తుంది. మీ నుంచి ప్రత్యేకమైన పోస్టుల్ని ఆశిస్తూ.(ఇందాక లేఖిని పని చేయలేదండి)
బాగా చెప్పారు. ఆ మాత్రం అహం ఉండాలి మనుషుల్లో! :)
ఈ టెంప్లేటు భలే ఉందే. చక్కగా అక్షరాలు తీగకి గుచ్చిన ముత్యాల్లా లైను వెంబడే వచ్చాయి. టపా పొడుగుని బట్టి పేజిలో ఇంకా లైన్లొస్తాయా?
శ్రీధర్ గారు, అయితే నాకు Open అవకపోవడానికి కారణం చివరిదే... నేను ఉండేది కొరియాలో.. అందుకనే site open అవడం లేదు...
@శ్రీసత్య గారు ధన్యవాదాలు.
@పసిగుడ్డూ :)
@నిషిగంధ గారు మీ కామెంట్ తో చాలా హాపీ
@సుజాత గారు లేఖినితో మరోమారు వచ్చి వివరంగా కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.నిజంగా నూతనత్వమే మనిషి ఆశల్ని చిగురింపజేస్తుంది. ప్రత్యేక గుర్తింపు కోసం సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వర్గాలను దృష్టిలో ఉంచుకుని "పెడదోవల"తోనూ విభిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అని రాశాను.
@కొత్తపాళీ గారు ధన్యవాదాలు. టపా పెరిగేకొద్దీ లైన్లూ ఎంచక్కా పెరిగిపోతాయండీ.
@మేధ గారు బ్లాగుకి కొరియన్ స్పామర్ల సమస్య తక్కువే. ఫోరంని అల్లాడిస్తున్నారు కానీ! బ్లాగు ఎవరైనా యాక్సెస్ చేసేలా బ్లాగులిస్ట్ సడలిస్తున్నాను. మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించండి.
@మేధ గారు, వెబ్ రూట్ లో ఆ restrictions ఏర్పాటు చేయబడి ఉండడం వల్ల ఫోరంతోపాటు, బ్లాగు, ఛాట్ వంటివన్నీ బ్లాక్ చెయ్యబడుతున్నాయి. కేవలం బ్లాగు వరకూ కొరియన్ రేంజ్ ని అనుమతించడానికి అవకాశం కన్పించలేదు. ప్చ్.
శ్రీధర్ గారు, మీరు నాకోసం ప్రత్యేకంగా ప్రయత్నించినందుకు నెనర్లు.. ఫర్లేదు లెండి, నేను కొన్ని రోజుల్లోనే భారతానికి వచ్చేస్తున్నాను, సో ఇక ఇబ్బంది లేదు :)
టపా కూడా ప్రత్యేకమే.. :-)
ఆనందం
నల్లమోతు శ్రీధర్ గారికి కృతజ్ఞతలు. మెయిల్ చేశాను, ఎన్నాళ్ళకు ఈనాడు దిన పత్రికా ద్వారా సమాధానం లభించినదుకు ఆనందం గా ఉంది. తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించిన రోజు స్వంత బ్లాగు ఏర్పాటు చేసుకోవటం సంతోషంగా ఉంది. డి. శ్రీ రామా రావు
రామారావు గారు మీరు స్వంత బ్లాగుని సృష్టించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి టపాలతో అందరినీ ఇక అలరించండి.
"అందరిలాంటి వ్యక్తిని కాదు నేను"... sridhar gaaru nijamgaane meeru andari laanti vyakthi kaadandi...
Post a Comment