Wednesday, November 19, 2008

సమాజంలో మార్పు వస్తుందంటారా?

"సమాజంలో మార్పు తెద్దాం.. వ్యవస్థని సమూలంగా కడిగేద్దాం.." ఇటీవల విన్పిస్తున్న నాయకులందరి ఇలాంటి నినాదాలతో ఉప్పొంగిపోతున్నాం... ఇంకేముంది దేశం బాగుపడేరోజు వచ్చేసిందని మురిసిపోతున్నాం. అస్సలు సమాజమంటే..? మీరూ, నేనూ, మన పక్క ఉన్న వ్యక్తుల సమూహమే కదా. మనం ఇదే మాదిరి బాధ్యతారాహిత్యంగా ఉంటుంటే ఎవరో వచ్చి మనతో కూడి ఉన్న సమాజాన్ని ఉద్ధరించగలుగుతారా? అస్సలు మనలో ఎంత వరకూ సామాజిక బాధ్యత ఉందో ఎప్పుడైనా గమనించామా? మనం మారకుండానే ఎవరో వచ్చి మన సమాజాన్ని మారుస్తారని కలలు గనడం ఎంత మూర్ఖత్వమో కదా! వచ్చేది ఎంత గొప్ప నాయకుడైనా కావచ్చు వ్యక్తిస్థాయిలో సామాజిక స్పృహ లేకపోతే వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? ఫలానా చిరంజీవి, ఫలానా జయప్రకాష్ నారాయణ, ఫలానా బాలకృష్ణ, చంద్రబాబు అధికారంలోకి వస్తే మనం ఇప్పటికన్నా బాధ్యతగా నడుచుకుంటామా? ఆ నమ్మకం మనకుందా? నాయకుడిపై అంత అభిమానం ఉండి మారగలిగిన వారైతే అదే అభిమానాన్ని దేశంపై ఇన్నాళ్లూ ఎందుకు చూపించలేకపోయాం? ప్రతీ పౌరుడూ వ్యవస్థ అంటే తన ఆవల ఉన్న మిగతా ప్రపంచం అనుకుంటారు. మనలోనూ ప్రభుత్వోద్యోగులు ఉన్నారు, అధికార్లు ఉన్నారు, ఎవరి స్థాయిల్లో వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వారు ఎంతోమంది ఉండనే ఉన్నారు. అలాగే మంత్రులు, అధికార్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. వీళ్లు మాత్రమే కాదు వ్యవస్థ అంటే! ప్రతీ పౌరుడూ వ్యవస్థలో భాగమే. కానీ మనం మనల్ని మినహాయించి మిగతా ప్రపంచంలో అవినీతి పోవాలని, అందరూ బాధ్యతగా ఉండాలని, మార్పులు రావాలని, తద్వారా మన జీవితాలు బాగుపడతాయని పగటి కలలు కంటున్నాం. చూడడానికి చిన్న చిన్న విషయాలే అయినా కొన్ని ఎంతో బాధ కలిగిస్తాయి. ఒక నాయకుడికి మద్దతుగా విద్యావంతులు రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించి ఎంతోమంది సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేయడం, వేలాది రూపాయల బాణాసంచా క్షణాల్లో బుగ్గిపాలు చేయడం.. నాయకుడిని ఎవరైనా తెలిసీ తెలియక విమర్శిస్తే భౌతిక దాడులకు దిగడం.. చెప్పుకుంటూ పోతే రాజకీయ పార్టీలకు దన్నుగా నిలవడానికి మనం వృధా పరుస్తున్న మానవ, ఆర్థిక వనరుల్ని పరిగణనలోకి తీసుకుంటే అవన్నీ వృధా పరచడమేనా మనం కోరుకునే మార్పు? సమాజం పట్ల విభిన్న కోణాల్లో సగటు పౌరుడు బాధ్యతాయుతంగా ఉండనంత వరకూ ఎంత గొప్ప నాయకుడూ కూడా ఆశించినంత మార్పుని తీసుకురాలేడు అన్నది స్పష్టం. గొప్ప నాయకుడు పగ్గాలు చేపడితే ఏతావాతా మంత్రులు, అధికార్లలో కొంతవరకూ జవాబుదారీ తనం వచ్చే అవకాశం ఉండొచ్చేమో కానీ మనలాంటి మనుషుల్లో మనకి మనం మార్పు ఆహ్వానించనంత వరకూ ఇలాగే ఉంటాం.

16 comments:

చైసా said...

చాలా బాగా చెప్పారు.

లక్ష్మి said...

Good Show!!!

Anonymous said...

Really this is one of the worthy message I read in the telugu blogs !

కొత్త పాళీ said...

బలే బలే.

Ramani Rao said...

సమాజం, వ్యవస్థ, సామాజిక స్పృహ ఇవి మాట్లాడలంటే నాకంత రాజకీయ పరిజ్ఞానం లేదు కాని, మీరన్నట్లుగా సమాజం అంటే మనమే అని మటుకు తెలుసు. అలా ఆలోచిస్తే, మొదట మన గురించి మనము ఆలోచించుకోవాలి, మారాలి అని ప్రతిఒక్కరూ అనుకొంటే, అంటే మనలోని ఆలోచనలని సవ్య దిశవైపు మరల్చుకొంటే, సమాజంలోని మార్పు సులువే కదా. నా కుటుంబం బాగుండాలి అని నేననుకున్నట్లే పక్కవాళ్ళు అనుకొంటారు అలా ప్రతిఒక్కరూ బాగుపడ్తారు. అయితే ఈ బాగుండాలి అనేది ఎదుటివారి మీద దౌర్జన్యం చేసో, ఎదుటి వాడిని అణగదొక్కో, పైకి రావడం కాదు. నీతిగా, నిజాయితిగా అని అనుకొంటే ఎలాంటి నాయకుడు వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ నాయకుడు అన్నది ఒక హోదా మాత్రమే. మనమే సమాజం, సమాజమే మనము. "నా కోసం" అనుకొంటూ కాస్త నిజాయితి + స్వార్ధం ఉంటే చాలు మనిషికి. సమాజం లో మార్పు వస్తుంది.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగా చెప్పారు శ్రీధర్ గారూ,ప్రతి వ్యక్తిలోనూ మార్పు వచ్చినప్పుడే ఇది సాధ్యం.ఒక్క నాయకుల మార్పువల్లనే ఇది సాధ్యమవుతుందా !

Unknown said...

@ చైసా గారు ధన్యవాదాలు.
@ లక్ష్మి గారు థాంక్యూ.
@ Anonymous గారు ధన్యవాదాలు.
@ కొత్తపాళీ గారు, :) మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
@ రమణి గారు మీరన్నది నిజం. మన ఆలోచనలను సవ్యదిశలోకి మరల్చుకుంటే ఆటోమేటిక్ గా సమాజంలో మార్పు వస్తుంది.
@ విజయమోహన్ గారు నాయకుల వల్ల మార్పు పరిమితంగానే ఉంటుంది. నాయకుడు ఎంత నీతివంతుడైనా అనుచరుల్లో అవినీతి మూలాలు ఉంటే ఆ కొద్దిపాటి మార్పునీ ఆశించలేం. ముందు వ్యక్తులుగా మనం బాధ్యతగా ఉండాలి. ధన్యవాదాలు.

Burri said...

అవును మీరు చెప్పినది ఆక్షరాల నిజం శ్రీధర్ గారూ, నాయకుడు ఏసి బస్సులో తిరిగితే మంత్రులు ఏసి కార్లు కావాలంటారు అప్పుడు సగటు పౌరుడికి కనీసం కాళ్ళకు చెప్పులు ఉండవు. నా వరకు మొదట నాయకుడు మారాలి, అదే సమాజ మార్పుకు నాందీ. మధురై సభకు ఒంటి మీద చొక్కా లేకుండా వచ్చిన రైతులను చూసి చలించి, మార్పు కొసం గాంధీగారు చొక్కాను వదిలారు కాని మన నాయకులు సిగ్గును వదిలారు అని అనుకున్నారు, సిగ్గును వదిలి బతుకుతున్నారు. రమణి గారు చెప్పినట్లు, మారాలి అని ప్రతిఒక్కరూ అనుకొంటే.. సమాజం లో మార్పు వస్తుంది.

మరమరాలు

durgeswara said...

గుర్రాన్ని బండి వెనకాలకడితే బండిఎలా కదలదో సమాజములో వ్యక్తి నిర్మాణము జరగకుండా మంచిసమాజము అలాగే నిర్మితంకాలేదు.అందుకే వివేకానందులవారు అన్ని ఇజాలకన్నా ముందు వ్యక్తినిర్మాణము జరిపేప్రక్రియ కావాలన్నారు.లేకుంటే స్వాతంత్ర్యమొచ్చినా ఏమి జరుగుతుందో ఆయన ఊహించి చెప్పినట్లుగానే ఈ పుణ్యభూమిలోకూడా పరిస్థితులు తయారయ్యాయి.సమ్మజము పట్లమీఆవేదన ప్రశంశనీయము.

visalakshi said...

నిజమే. బాగా చెప్పారు.ప్రతీ వ్యక్తి సమాజం పట్ల భాధ్యతాయుతంగా ఉంటే సమాజంలో మార్పు రావచ్చు.

మధు said...

ఇలాంటి పరిస్తితులు మనవల్లే ఏర్పడ్డాయని చక్కగా చెప్పారు. చదువుకున్న వారుకూడా వ్యక్తి ఆరాధన చేయడం చాలా భాధాకరం. ప్రతీ పార్టీ కి ఒక 'ఒక సాంకేతిక సేన ' కూడా బయలుదేరింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల జిమ్మిక్కులు, దాడులు, సభ్యతా సంస్కారం లేని వాగుడు చూస్తుంటే ఎవరికి వోటు వెయ్యాలో అనే సంగతి దేవుడెరుగు...అసలేందుకు వోటు వెయ్యాలో కూడ అర్ధం కావటం లేదు.

Anonymous said...

టఫ్ టపా! మీ టపా చదువుతుంటే సీతారామశాస్త్రిగారి పాట "నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని-అగ్గితోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని..." జ్ఞప్తికొచ్చింది.ఆవేశంతో ఆయన పాట..ఆవేదనతో మీ టపా!

@రమణిగారు
"నా కోసం" అనుకొంటూ కాస్త నిజాయితి + స్వార్ధం ఉంటే చాలు మనిషికి...?విరుద్ధ భావజాలం. నేను,నా కోసం అనేభావం ఎప్పుడైతే మొదలయ్యిందో మీరు ఆశించినవి జరగవు.అదే ఎక్జిస్టెన్షియలిజం.యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నసమస్య(?).

పరిమళం said...

మీరుచెప్పింది నిజమే కాని ,బాధ్యత గల నాయకులు కూడా వున్నారు ,ప్రజల్ని చైతన్య పరచాలని ప్రయత్నిస్తూనే వున్నారు.అటువంటి వారికి ప్రజాదరణ ఏమాత్రం వుంటుందో మనకూ తెలుసు .మార్పు కేవలం ఒక పార్టీ తోనో లేక ఒక నాయకుడి వల్లో లేదా ఏ కొద్దిమంది బాధ్యతగల ప్రజలవల్లో ఒక్కసారిగా రాకపోవచ్చు .కాని ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా
ముందుగా అటో ఇటో ఎటోవైపు .మార్పు తప్పక వస్తుందండీ .వుందిలే మంచి కాలం ముందు ముందునా .....అన్నారు కదండీ .....

Unknown said...

@మరమరాలు గారు, మీరు ఉదహరించిన గాంధీ గారి ఉదాహరణ ఆయనలోని గొప్ప నాయకుడ్ని మనకు చూపించేదిగా ఉంది. ధన్యవాదాలు.
@ దుర్గేశ్వరరావు గారు, చాలా కరెక్ట్ గా చెప్పారు, మంచి సమాజనిర్మాణంలో వ్యక్తి నిర్మాణం పాత్ర అతి ముఖ్యమైనదని బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@ వేద గారు బాధ్యతగా ఉంటే తప్పకుండా మార్పు వస్తుందండీ. ధన్యవాదాలండీ.
@ మధు గారు.. సాంకేతిక సేన పేరిట హైటెక్ పంధా పట్టడం సరికొత్త పోకడ. ఎవరికి ఓటు వెయ్యాలో అర్థం కాకపోయినా ఓటుని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఎవరినో ఒకరిని ఎన్నుకోక తప్పదు.
@ బాబు గారు, మహానుభావులు సీతారామశాస్త్రి గారికీ నాకూ పోలికేమిటండీ. ఈ టపా ఎంతో ఆవేదనతో రాశానన్నది మాత్రం వాస్తవం.
@ పరిమళం గారు, బాధ్యత గల నాయకులు చాలామంది ఉన్నారు. ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉన్నారు. ప్రజల్లో మార్పు వస్తుంటే, ఉన్నత భావాలు కలిగిన గొప్ప నాయకులను మాత్రమే వారు కోరుకుంటుంటే, అలాగే వారు బాధ్యతాయుతంగా మెలుగుతుంటే క్రమేపీ మార్పు రావడం చాలా సులభం. నేను చాలా ఆశాజీవిని. ఎంతో నియంత్రించుకున్న మీదట ఆగలేక ఇలా మనం బాధ్యతగా మారకపోతే ఎలా అన్న అతి ముఖ్యమైన కోణాన్ని రాశాను. తప్పకుండా మన సమాజం డెవలప్ అవుతుంది.

నవకవిత said...

బాగుంది...

Anonymous said...

అందరికి భాధ్యత వున్నది,అందరు మారితెనే మార్పు అంటున్నారు.

కొందరు సమాజానికి దిశా నిర్దేశం చెస్తే మార్పు వస్తుంది. దిశా నిర్దెశం దార్శనికులైన కొంత మంది మహానాయకులు చేయగలరు.
ఇప్పుడున్నవి పెద్ద వ్యవస్థలు కాబట్టి, పెద్ద నాయకులే నిర్ణయం (దిశా నిర్దేశం) చేయాలి. పెద్ద నాయకులు కొద్దిమంది మాత్రమే దార్శనికులు.
గాంధి గారిలాంటి దార్శనికుని వలె ఒక నాయకుడు చిన్న వ్యవస్థలు (గ్రామస్వరాజ్యాలు) చేయగలిగితే మనకు చాలా మంది నాయకులు(అంటె ప్రజలే) దొరుకుతారు. అలాంటి చిన్న నాయకులు చాలామందిలో కొందరైన దార్శనికులు వుండరా? ప్రజలు వారి రాజ్యంలోనె మారుతారు. అప్పుడే పెద్ద మార్పు వస్తుంది.
పెద్ద వ్యవస్థలో దార్శనికతలేని పెద్దనాయకులే ఈ దుస్థితికి కారణం.