"ఫలానా పని సరిగా చెయ్యలేకపోయానే.. ఇలాగైతే బాగుణ్ణు..", "అవునూ అప్పుడలా మాట్లాడి ఉండవలసింది కదూ... ప్చ్ వెధవ బుర్ర టైమ్ కి వెలగదు...", "ఇంతకీ వచ్చేవారం ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి...?", "ఆ శ్రీకాంత్ గాడికి ఎంత చెప్పినా విన్పించుకోడు.. వాడి ఖర్మ, ఇక్కడ నాకేదో పట్టినట్లు..!", "షేర్లు పడిపోయాయి కదా మంచి స్క్రిప్ చూసి కొనిపారేస్తే అలా పడుంటాయేమో... ఆలోచించాలి! ", "ఇప్పుడే తాళాలెక్కడో పెట్టాను ఓ పట్టాన అవసరానికి కన్పించి చావవు"..
ఇవి చదువుతుంటే ఒకదానికొకటి ఏమాత్రమైనా పొంతన ఉందా? ఉండదు. బుర్రలో క్షణక్షణానికీ పరిగెడుతుంటే ఆలోచనల ప్రవాహం ఇది. ఆ క్షణానికి ఆ ఆలోచనే అత్యవసరమైనది. "క్షణం" మారితే చిత్తమూ చిత్రంగా మారిపోతుంది. ఏ అన్యాయమో మెదడుని తొలుస్తున్నప్పుడు మనసులో నిరసనగళం పురివిప్పుతుంది... ఏ ఆనందంలోనో పులకించిపోతున్నప్పుడూ అంతే.. కొన్ని క్షణాలు మైమరపు కమ్ముకుంటుంది.. అన్నీ ఆలోచనలూ క్షణికమాత్రాలే. ఓ ఆలోచన యొక్క ఉనికి అంతకన్నా బలీయమైన మరో ఆలోచనచే అది ఆక్రమించబడేవరకే!
మనసు పొరల్లో క్షణకాలం పాటు తళుక్కున మెరిసి మాయమయ్యే ఆలోచనల్ని ఒడిచిపట్టలేక యాంత్రికంగా సాగిపోతుంటాం. కొండొకచో ప్రయత్నపూర్వకంగా కొన్ని ఆలోచనల్ని జ్ఞాపకపు అలమారాల్లోకి సర్థేసి తర్వాతెప్పుడైనా వాటిని తీరిగ్గా విశ్లేషిద్దామని నిర్ణయానికి వచ్చి మళ్లీ మరిన్ని ఆలోచనల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఆ క్షణం తళుక్కుమన్న ఆలోచన దృష్టి చెదిరేసరికి మరుక్షణం వెలవెలబోతుంది. మెదడు అలమారాల్లో భద్రపరిచిన ఆలోచనలూ తీరా ఏ తీరిక క్షణానో తవ్వి తీస్తే జీవం కోల్పోయి వెక్కిరిస్తుంటాయి. ఈ "మనసులో" బ్లాగులో స్పష్టంగా, అస్పష్టంగా, రేఖామాత్రంగా, ఊహల ప్రతిరూపంగా నా మనసులో కదలాడే ప్రతీ ఆలోచననీ ఒడిచిపట్టి అక్షరరూపం ఇవ్వాలన్నది నా మనోభీష్టం. క్షణకాలంలో తళుక్కున మెరిసి అందుకునేలోపు కనుమరుగైపోయే ఆలోచనలను మరింత నేర్పుతో మనో:ఫలకంపై ముద్రించుకుని అక్షరబద్ధం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. వేగంగా పారిపోయే ఆలోచనలకు గాలం వేసి దగ్గరకు లాగి నిగ్గుదేల్సాలన్న ఈ ఆలోచనా ఆ ప్రయత్నంలో భాగమే.
మనసు నిండా ఎన్నో ఆనందాలు, అసంతృప్తులు, ఆవేశాలు. నా చుట్టూ కదలాడే ప్రపంచం క్షణానికో అనుభూతిని మిగుల్చుతున్నప్పుడు వాటన్నింటికీ ప్రతిస్పందించకపోతే నా మనసు ద్వారాలు స్వయంగా మూసుకున్నట్లు కాదూ...! అందుకే ఏదైనా, ఎవరేమనుకున్నా, ఎవరి మానసిక స్థాయిలో నా రాతలను ఎలా స్వీకరించుకున్నా.. నా రాతలను బట్టి నాకంటూ ఓ అసమగ్రమైన "ముద్ర" వేయబడుతుందని తెలిసినా.. నా రాతలకు నా మనసుని సాక్షిని చేసుకుని నాదైన శైలిలో విభిన్న అంశాలపై ఇప్పటిలానే రాస్తాను.
ఇదీ ఒక టపానేనా.. ఏముంది ఇందులో అని ఓ సందేహమూ కొందరికి వస్తుంది. నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి నా ఆలోచనలను మధించుకుంటూ నా ఆలోచనా సరళిని బ్లాగు మిత్రులతో పంచుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది. "సాంకేతికాలు" బ్లాగు నుండి "సామాజికం" వైపు దృష్టి సారించినప్పుడు "అస్సలు నేనేం రాయగలను?" అన్న ప్రశ్నతో ప్రారంభమై కుప్పలు తెప్పలుగా కమ్ముకుంటున్న ఆలోచనల్లో దేనిపై రాయాలో నిర్థిష్టంగా నిర్థారణకు రాలేకపోయిన క్షణం ఏర్పడిన ఆలోచనే "రాయగలగాలే గానీ ఈ అస్పష్టతా ఓ టపాగా ఎందుకూ రాయకూడదు?" అన్నది! ఇదే మాదిరి ఊగిసలాటను తోటి మిత్రులు నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటారు కదా అని వెంటనే కీబోర్డ్ కి పనిచెప్పాను. అందుకే ఇదీ ఓ టపాగా అక్షరాల్లోకి అమరింది. అదన్నమాట సంగతి. J
9 comments:
అస్పష్టత లో కూడా స్పష్టత ఉంది. గుడ్ ఒన్!
Wow..wonderfully penned.
"నా రాతలను బట్టి నాకంటూ ఓ అసమగ్రమైన "ముద్ర" వేయబడుతుందని తెలిసినా.. " That shows a lot of maturity.
"మెదడు అలమారాల్లో భద్రపరిచిన ఆలోచనలూ తీరా ఏ తీరిక క్షణానో తవ్వి తీస్తే జీవం కోల్పోయి వెక్కిరిస్తుంటాయి"..So true.
అందరం అసమగ్ర మనుషులమే. కానీ సంపూర్ణత్వం సాధించే ప్రయత్నంలో ప్రతిక్షణం పరిపూర్ణులుగాకూడా మారుతూ ఉంటాం. ఆక్షణానికేసుమా!
నా మిత్రుడొకర్ని "బ్లాగు రాయరా!" అంటే, నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటినిరాసేస్తే,"ఎందుకు మారిపోయావు?" అని దాని ఆధారంగా కొన్నాళ్ళకు ఎవరైనా నన్ను ప్రశ్నిస్తారేమో! అన్నాడు.
ఆ ఆలోచనల్లోని మార్పుచూసుకోవడానికైనా రాయాలన్నది నా పాలసీ...అసమగ్రంలోంచీ సమగ్రమయ్యేదశలో ఎవరి పద్ధతులు వాళ్ళవి. కానీ చాలామంది అందరిలోని అసమగ్రత గురించీ తెలిసీ సమగ్రత లేదంటారెందుకో!
కాదేదీ కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ..ఈ సృష్టిలో పనికి రాని వస్తువు పనికిరాని ఆలోచన ఉండవు స్వామీ..ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా పనికొస్తూనేఉంటాయి..అమ్మే వస్తువు సరి అయినది అయితే కొనుక్కొనే వాడు ఎప్పుడూ ఉంటాడు కదా..అలాగన్నమాట..
Wow!!! Beautiful way of penning down your thoughts... meelo edo special andi sridhargaaru... chinni chinni matallo ento cheppagalaru. Great!!!
@బాబు గారు, "అస్పష్టత"లో కూడా "స్పష్టత".. క్లుప్తంగా చాలా బాగుందీ ప్రయోగం. ధన్యవాదాలు.
@కుమార్ గారు థాంక్యూ అండీ.
@మహేష్ గారు, మన ఆలోచనల్లోని మార్పు చూసుకోవడానికైనా రాయాలన్న పాలసీ చాలా బాగుంది. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు గారు, మన ఆలోచనలకు ఉన్న విలువను చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@laxmi గారు, నేనేం స్పెషల్ కాదండీ, నిజం చెప్పమంటారా.. మీ కామెంటే నాకు హాపీగా ఉంది. చిన్న చిన్న మాటల్లో సరిగ్గా రాయగలనా లేదా అన్న సందేహం వీడిపోయింది. ధన్యవాదాలు.
"క్షణ క్షణ భంగురముల్ జవరాండ్ర చిత్తంబుల్" అన్నారు. అంటే ఆడవారి ఆలోచనలు క్షణ క్షణానికి మారతాయట. అదేమి లేదు, ఏదన్నా రాయాలి అంటే ఆడవాళ్ళే కాదు, అందరూ ఒకేలా మనసులో ఆలోచనల చిక్కుముడులు విప్పుకొనే ప్రయత్నంలో ఉంటారని మీ ఈ టపా స్పృష్టంగా చెప్తోంది(అస్పృష్టంగా కాదు) . క్షణ క్షణానికి మారే ఆలోచనలని ఒడిసిపట్టి బ్లాగులో అక్షర రూపంలో ఆలోచనలని బందీ చేసిన వైనం బాగుంది.
"క్షణ క్షణ భంగురముల్ జవరాండ్ర కాదు కాదు బ్లాగు జనుల చిత్తంబుల్"
బాగుంది మీ ఆలోచనా స్రవంతి.
శ్రీధర్,
అందరికి మనసులో ఎన్నో ఆలోచనలు కదలాడుతూనే ఉంటాయి. వాటిని సరైన రీతిలో వెలిబుచ్చడం అందరికీ రాదేమో. కాని ముఖ్యమైనవాటికే మనం ప్రాముఖ్యత ఇస్తాం. అలా అని మిగతావాటిని అణగదొక్కడం మంచిది కాదు. మన ఆలోచనలను అలా రాతలా మార్చుకుంటేనే మంచిది , ఆ ఆలోచనలు , విశ్లేషణలు పెరుగుతాయి. ఏదో చూసాము, తిన్నాము పడుకున్నాము తెల్లవారింది అనుకోవద్దు... express చేస్తుంటేనే కదా మనసును తట్టి పలకరించే సంగతులెన్నో బయటకొస్తాయి. వాటిని అలా రాతల్లోకి మార్చేస్తుండూ. ఈ రాతలు ఒకే విధంగా ఉన్నాయా. భిన్నంగా ఉన్నాయా అనేది నీ ఆలోచనాస్రవంతి మీద ఆధారపడి ఉంటుంది. నీ ఇష్టానికి తగ్గట్టుగా ఆలోచిస్తావా, లేదా ఆలోచనలను అలా విహరించనిస్తావా..
మనసు నిండా ఎన్నో ఆనందాలు ,అసంతృప్తులు, ఆవేశాలు, నా చుట్టూ కదలాడే ప్రపంచం ..........................ఇలా మీ స్పందన బాగుంది శ్రీధర్‌గారు .మళ్ళీ ఒకసారి మనసులో అలజడులకు అక్షరరూపం ఇచ్చారు .మీదైన శైలిలో ఒక టాపిక్రాయండి. ఆల్‌ది బెస్ట్.
Post a Comment