“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే... హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఉండాలి అనే రీతిలో సినిమాలు, ప్రసారమాధ్యమాలు ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.
నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా... ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం.
ఇరు హృదయాల మధ్య సాన్నిహిత్యం చోటుచేసుకోవడానికి మన సమాజంకొన్ని అర్హతలు అనధికారికంగా నిర్దేశిస్తోంది. అయితే ప్రేమికులు కావాలి. లేదా రక్త సంబంధం కావాలి. ప్రేమికులు నాలికపై నుండి చిలకపలుకులు పలికినా దేవదాస్ పార్వతిలతో పోలుస్తూ ఎక్కడలేని ముగ్ధత్వం ఆపాదించబడుతుంది. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉండే అనుబంధం, అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలు... కూడా మన ప్రపంచానికి రిస్క్ లేదు. ఎటొచ్చీ అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అనుబంధమే.. దాని అంతేదో తేల్చాలి అన్నంత నిద్రలేకుండా చేస్తుంది సమాజాన్ని! ఇక ఆ ఇద్దరి మధ్య ప్రేమ, ఇష్టం వంటి పదాలు సమాజపు పాము చెవులకు విన్పిస్తే ఇంకేమైనా ఉందా? పుకార్లని షికారు చేయించి ఇద్దరి మనసులు విరిచేసి పైశాచికత్వం నిరూపించుకోదూ...?
నేను ICWAI చదివేటప్పుడు నీలిమా కిరణ్ అని ఓ ఆత్మీయనేస్తం ఉండేది. సబ్జెక్టుల్లో ఒకరికొకరు సహాయపడడం దగ్గర్నుండి, ఒకరి అనుభూతులు మరొకరు షేర్ చేసుకోవడం వరకూ ఇద్దరం వేరైనా ఇద్దరం ఒక్కరమే అన్నంత సాన్నిహిత్యం ఉండేది. నూటికి నూరుశాతం అది స్నేహం! దురదృష్టవశాత్తు మా స్నేహానికి కల్మషం ఆపాదించబడింది. ఒకరోజు కాలేజీ డైరెక్టర్ ఈ విషయమై తన మనసుని గాయపరిచేలా మాట్లాడడం తెలిసి నేనూ కలత చెంది తెలిసీ తెలియని ఆ వయస్సులో ముప్పైకి పైగా స్లీపింగ్ పిల్స్ మింగి చావుకు కొన్ని నిముషాల దూరం వరకూ వెళ్లి వచ్చాను. సమాజపోకడలపై అప్పటి నుండి ఆ అసంతృప్తి మేటవేసుకుపోయి ఉంది. ఇదిగోండి.. ఈరోజు రమణి గారు “మాటే మంత్రం” అనే పోస్టులో..
అన్ని అద్భుతమైన వ్యక్తీకరణలను ప్రేమకి ముడిపెట్టి మిగతా మానవ సంబంధాలకు(అవి ఏమైనా కావొచ్చు,స్నేహం, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముడు) ఎంత అన్యాయం చేశారో అస్సలు ఈ సినిమా రచయితలకు తెలియదు...
అని రాస్తే మనసు ఓ క్షణం చలించింది. హృదయం, ప్రేమ, ఇష్టం వంటి పదాలను, మనుషుల మధ్య అనుభూతులను భ్రష్టుపట్టిస్తూ నిజమైన అనుబంధాలను సమాజం ఎంత నిర్థాక్షిణ్యంగా కాలరాస్తుందో నా స్వీయ అనుభవంతో రాద్దామని చేసిన ప్రయత్నమే ఇది. తన పోస్ట్ ద్వారా ఈ ఆలోచనను రేకెత్తించిన రమణి గారికి ధన్యవాదాలు.
16 comments:
So True... We claim we're well educated, more civilized, more cultured, very broad-minded but unfortunately we've entered a state where we cannot even digest the fact that there could be only friendship between a boy and girl nothing beyond that. Even I'm a victim for such abuses. Good One Sir!!!
మనుషుల భావాలకన్నా,అపోహాపూరితమైన కొలమానాలే మనకు మిన్న.సర్దుకుని బ్రతకాలి. మనసుని చంపుకుని బ్రతకాలి.సమాజానికి ఆమోదం కలిగేలా బ్రతకాలి.
అలాకాకపోతే బ్రష్టుపట్టడంకాదు, బష్టుపట్టిపోయేలా చేస్తారు.వెలివేసి వినోదించడానికి చూస్తారు. బలహీనంగా ఉన్నామా,చంపేసి తమ కక్షతీర్చుకుంటారు. అదే ధర్మం,నీతి,మతం,సమాజం.వాటిని మీరి బ్రతకాలనుకుంటే, వాటికన్నా ఉన్నతులయ్యుండాలి; అంటే వ్యక్తిత్వం కలిగుండాలి.
శ్రీధర్ గారు మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నానండీ టెంప్లేట్ ఆసక్తి కరం గా ఉంది...
టపా బాగుంది... కానీ సమాజం ఇలాంటిది అని తెలిసీ వారి మాటలకి విలువ ఇస్తే నిరాశ పడక తప్పదండీ.. అలా అలవాటు చేసిన సినిమాలనే అనాలేమో....
@లక్ష్మి గారు "we cannot even digest the fact that there could be only friendship between a boy and girl nothing beyond that" బాగా చెప్పారు. మన ఆలోచనల్ని ఇలా ట్యూన్ చేసేశారు. ధన్యవాదాలు.
@కత్తి మహేష్ కుమార్ గారు, యాంత్రిక జీవితంతో అందరి మనసులూ సగం చచ్చిపోయాయి. ఏ మూలనో చిగురించే కొద్దిపాటి భావాలనూ నిర్థాక్షిణ్యంగా అదిమిపట్టి చంపుకోవలసి రావడం దౌర్భాగ్యమే. ధన్యవాదాలు.
@వేణూశ్రీకాంత్ గారు :) బ్లాగు టెంప్లేట్ నచ్చినందుకు థాంక్యూ. సమాజం మాటలకు విలువ ఇస్తే నిరాశపడవలసి వస్తుంది కరెక్టే. అలాగని మనుషుల అంతరంగాల్లోకి చొరబడి వారి సున్నిత భావాలకు బురదజల్లి నిష్కల్మషమైన అనుబంధాలను కాలరాయడం సమాజంలో ఉన్న మనమందరమూ చేస్తుంటే ఎవరికైనా మనస్సు గాయపడడం సహజం. మన మెచ్యూరిటీతో ఆ గాయం తీవ్రతని ఎటూ తగ్గించుకుంటామనుకోండి. మీరన్నట్లు సినిమాలు, టి.వి.లు తెల్లటి కాగితం లాంటి మన మనసుల్ని ఎంత కలుషితం చేస్తున్నాయో!
నిజమే శ్రీధర్,
ఆడామగా కాస్త చనువుగా మాట్లాడుకుంటే చాలు , అక్రమసంబంధం తప్ప వేరే గుర్తుకు రాదు చూసే జనాలకు. వారి మధ్య వయసు తేడా కూడా గుర్తించరు. అందుకే ఎన్నో అనుబంధాలను అందరి ముందు వ్యక్తపరచుకోవడం అనవసరం అనిపిస్తుంది. ఆ వ్యక్తుల మధ్య ఎంత ఆత్మీయబంధం ఉన్నా కూడా అందరిముందు పరిచయస్తుల్లా కొన్ని కొలమానాలతో మాట్లాడాల్సి వస్తుంది. జీవితానుభవం ఉన్న పెద్దవాళ్లకంటే ఇలాంటి చచ్చు, పుచ్చు ఆలోచనలేవే లేని ఈనాటి యువతరం మేలు అనిపిస్తుంది. స్నేహితులు అనగానే దానికొక పవిత్రమైన అర్ధం చెప్తారు వాళ్లు. ఇందులో ఎటువంటి నియమ నిబంధలు ఉండవు వాళ్లకు. చ.. ఈ మనుషులు ఎప్పుడు మారతారో? వాళ్ల ఆలోచనల్లాగే ఇతరులు కూడా అలాగే ఉంటారు అనుకుంటారు. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటే ఇదే మరి...
చాలా అద్భుతమైన భావ వ్యక్తీకరణ శ్రీధర్ గారు మీది.
"బావాలను భ్రష్టు పట్టించకండీ " అని అంటున్నారు కాని భ్రష్టు పట్టించేసారు. అది ఎంతలా అంటే, ఇప్పుడు ఎక్కడన్నా ఒక అమ్మాయి, అబ్బాయి కనిపించి మాట్లాడుకొంటుంటే, వాళ్ళు స్నేహితులా? ప్రేమికులా? వాళ్ళిద్దరిమధ్య ఏదన్నా రిలేషన్ ఉందేమో అని ఇవేవి ఆలొచించకుండా ఇవన్నీ రాసే నేనే, క్షణకాలం "ఎంటలా బయట నవ్వుకోడం అని అనుకొంటాను" అంటే అదేదో ఈర్ష, కోపం, అసూయ కాదు. సినిమా ప్రభావం. ఇలాంటి పనులు ప్రేమికులు మాత్రమే చెయ్యాలి అన్న భ్రమలో ఉండడం వల్ల కలిగిన క్షణికాలోచన అది. అసకంకిల్పితంగా వచ్చే ఆలోచన అది, చుట్టు ఉన్న పరిసరాల ప్రభావం + సినిమాల ప్రభావం.
ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే మనల్ని చేరుకొంటాయి. వీటినుండి ముందు మనమే మారాలి. ఆ తరువాతే మార్చడం గురించి ఆలోచించాలి.
నా టపా మిమ్మల్ని ఓ టపా రాసేలా చేయడం చాలా సంతోషంగా ఉంది.
శ్రీధర్ గారు
మంచి టపా రాసారు. విశ్లెషణాత్మకంగా ఉంది. కేవలం సినిమాలదే తప్పంటారా!సినిమాల ప్రభావం అంతగా ఉంటుందా!
@జ్యోతి గారు.. మీరన్నట్లు ఇప్పటి తరంలో స్నేహానికి ఓ చక్కని విలువ ఉంది. స్నేహమే కాదు, ప్రతీ అనుబంధానికీ స్పష్టమైన సరిహద్దు గీసుకోగలిగిన పరిణతి చాలావరకూ యువతలో ఉంది. పెద్దల్లోనూ అనుబంధాన్ని ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలిగిన వారు లేకపోలేదు. కానీ అలాంటి వారి శాతం తక్కువ. ధన్యవాదాలు.
@ రమణి గారు మనం మన మనసులు అనేక బాహ్యశక్తులచే నియంత్రించబడుతున్నాయి. "మనం మారాలి" అని అనుకున్నామంటే సగం మారినట్లే. మనల్ని మనం మార్చుకున్నా మీడియాలోనూ, సినిమాల్లోనూ పరిణతి రావాలి. అప్పుడే కేవలం "ప్రేమికుల్లో" కాకుండా ఇంకెన్ని రకాల అనుబంధాల్లో సున్నితమైన పార్శ్యాలు దాగి ఉంటాయో గమనింపుకు రావడంతో పాటు అలాంటి నిష్కల్మషమైన అనుబంధాలకు అందరి ఆమోదం లభిస్తుంది. ధన్యవాదాలు.
@బాబు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. ప్రేమ, ఇష్టం వంటి మధురమైన మాటలన్నీ నాలుక నుండే ఆవిర్భవిస్తూ వాటి విలువ అంతగా దిగజారిపోయిందంటే ఈ పాపం వాటిని విచ్చలవిడిగా వాడిన సినిమా వారిది కాదంటారా? భావాలు వ్యక్తపరచగలిగితేనే ఏ అనుబంధమైనా మరింత బలపడగలుగుతుంది. స్నేహితులు, ఆత్మీయుల ఆయా అద్భుతమైన భావాలు వ్యక్తపరచాలంటే సిగ్గుపడేటంతగా వాటి స్థాయి దిగజార్చడంలో సింహభాగం మాత్రం సినిమా, మీడియాదే అని నేను భావిస్తున్నాను. మనలోనూ అవలక్షణాలున్నాయి. మనకూ చక్కని బంధాలు ఒక్కోసారి వక్రంగానే కన్పిస్తాయి. మనం ఆలోచించేది తప్పు అని గుర్తించిన మరుక్షణం మనం ఎటూ మారతాం. కానీ సినిమా, మీడియా సున్నిత భావాలను ఓ వర్గానికే కట్టబెట్టేసి ఇతర బంధాలన్నింటికీ వాటి మాధుర్యాన్ని దూరం చేస్తోంది. ఏది తప్పో ఏది ఒప్పో గుర్తించగలుగుతున్నాం, మనం మారతాం సరే.. సినిమాల వల్ల స్లో పాయిజన్ లా కలుషితం చెయ్యబడే కోట్లాది బుర్రలు సవ్యంగా ఆలోచించాలంటే వారిని మనం మార్చగలమా? దానికి బాధ్యత ఎవరు వహించాలి? మనసుల్ని కలుషితం చేసిన సినిమాలే కదా!
ఎటువంటి ఆడా మగా సంబంధాలకైనా రంగులు పులిమే మన అలవాటుందే .. అది ఎక్కణ్ణించి వచ్చిందో అని వెదికితే కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు కనిపిస్తై. పిల్లలున్న తలిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి.. లోకం ఇలా కూడా ఉంటుందనీ, అది ఇలాంటి వెధవ్వేషాలు వేసినప్పుడు ధైర్యంగా నిలబడమనీ చెప్పే ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నూరి పొయ్యండి.
శ్రీధర్, సున్నితమైన విషయాల్ని, రొమాంటిసైజ్ చెయ్యకుండానే, అంతే సున్నితంగా వ్యక్త పరిచే మీరు మంచి పరిణతి సాధిస్తున్నారు. అభినందనలు.
ఓ వ్యక్తితో సంబంధం ఏంటి? ఇద్దరూ పంచుకునే అనుబంధం ఎలాంటిది అనే విషయాల మీద ఉన్న ఇద్దరికీ అవగాహన ఉంటే ఏ కాలమాన స్థితిగతుల్లోనైనా, సమాజం ఎంత గింజుకున్నా వారి "స్నేహాని"కి వచ్చే నష్టమేమీ లేదు. స్నేహం అభాసపాలవుతున్నప్పుడు ధైర్యంగా ఎదురునిలవాలే కానీ, పారిపోవడమో, పాతిపెట్టడమో చేస్తే మనకే నష్టం.
ఓ వ్యక్తి కోసం లోకాన్ని ఎదిరించడమా? లోకం కోసం ఆ వ్యక్తిని వదులుకోవడమా లాంటి సమస్యలు మాటి మాటికీ రాదు. ఆ సందర్భాలు చాలా అరుదు. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే పర్లేదు! లేకపోతే చాలా మిస్స్ అవుతాం.
బాగా రాశారు. అభినందనలు!
@కొత్తపాళీ: గురువుగారు మీ ఆశీస్సులకు ధన్యవాదాలు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ రకమైన ధైర్యం నూరిపోయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే లోకపు క్రూరపు స్వభావం తెలియని వయస్సులో పిల్లలు బెంబేతెత్తే ప్రమాదం ఉంది.
@పూర్ణిమ గారు మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు అన్నది నిజం. జీవితంలో ఒక దశకు వచ్చాక సమాజాన్ని ఎదిరించే ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ అస్సలు సమాజపు స్వభావం తెలియని వయస్సులో ఇలాంటివి తటస్థిస్తే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది.
శ్రీధర్ గారు మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నా!మీ విశ్లేషణ బాగుంది .ఇటువంటి అనుభవం ఇంచుమించుగా అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే వుంటుంది.అలా బాధ పడిన వారైనా తిరిగి ఎదుటి వారిని కామెంట్ చెయ్యకుండా అర్ధం చేసుకుంటే కొందరికైనా మీలాంటి చేదు అనుభవం ఎదురవకుండా వుంటుంది .
@పరిమళం గారు, ఈ సోషల్ బ్లాగు కొద్ది రోజుల క్రిందనే మొదలుపెట్టడం జరిగింది. ఏడాదికి పైగా http://computerera.co.in/blog అనే చోట టెక్నికల్ బ్లాగు నిర్వహిస్తున్నాను.
కరెక్టే.. అనునిత్యం చూపులతోనూ, మాటలతోనూ దారిన పోయే జంటలని స్కాన్ చెయ్యడం ఆ బాధ తెలిసిన వారైనా ఆపేస్తే కొందరికి ఉపశమనం. ధన్యవాదాలు.
శ్రీధర్ గారు,
మీరన్నట్లు సినిమాల పాత్ర చాల ఉందన్నది సుస్పష్టం. ఎందుకంటే మాయబజార్ సినిమా కొన్ని వందలసార్లు చూసిన నేను పోకిరి సిన్మా కూడా రెండు సార్లు చూసేసాను. తప్పించుకోలేకపోతున్నామో..తప్పుకోలేకపోతున్నామో తెలియట్లేదు కాని తప్పొప్పుకుంటున్నట్లే ఉంది...
విచక్షణ లేకుండా విరివిగా ఉపయోగించడం మూలాన ప్రేమ అనే పదం సంకుచితంగా ధ్వనిస్తుంది. కానీ సహృదయస్పందన అంతా ప్రేమే. వ్యక్తం చేయడం, కమ్యూనికేట్ చేయడం ఒక విధి, ఫార్మాలిటీ కింద అయిపోయింది కానీ ఒక హృదయ స్పందన ఇంకొక హృదయానికి చేరడనికి భాష అనే మాధ్యమం లేకున్నా అది అంతస్రవంతిగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఫార్మాలిటీ ప్రకారం కమ్యూనికేట్ కావడం లేదనేది మన ఆదుర్దా మాత్రమే.
చాలా బాగా వ్రాశారు మీరు. కానీ అసంతృప్తి కూడదని నా అభిలాష, అభిమతం.
Post a Comment