Thursday, January 22, 2009
నిజంగా మనం మంచి వాళ్లమా?
అలసిన ఓ నిమిషం కళ్లెదుటి బాహ్యప్రపంచాన్ని బలవంతంగా కనురెప్పల బిగింపుతో తిరస్కరించి కళ్లు మూస్తే ఎన్నో అలజడులు కళ్లల్లో ఎగిరెగిరి పడుతున్నాయి. బాల్యపు "నేను"కీ, యవ్వనానికీ, నిన్నటికీ, ఇప్పటి "నేను"కీ సారూప్యత దొరకబుచ్చుకోలేక మెదడు జ్ఞాపకాల దొంతరుల్ని తిరగేస్తూనే ఉంది. అంతలో ఏ సమూహంలోనో అభిప్రాయాలు ఆరాటపడుతూ మనుషుల నాలుకల్ని తొలుచుకు వచ్చేటప్పుడు "నేనలా.. తెలుసా" అంటూ మనసూ ఉండబట్టలేక బలహీనంగా మూలుగుతుంది. నా గురించి నేను చెప్పుకోవడానికి ఎంత ఆరాటమో కదా! "అహం" తన లోతుల్ని తాను తవ్వుకోలేక, నిశ్చలత్వాన్ని పొందలేక నిరంతరం ఊగిసలాడుతూ కూడా ఓ అనిశ్చిత అభిప్రాయాన్ని "స్థిరమైనదిగా" ప్రకటితం చెయ్యడానికి పడే తపన చూస్తుంటే మంచివాళ్లగానో, దయాపరులు గానో, మేధావులుగానో.. ఏదో ఒక స్థిరమైన ముద్రని ఆపాదింపజేసుకోవడానికి మారుతుండే చిత్తాలతోనే ప్రయత్నాలు సాగించడం హాస్యాస్పదంగా తోస్తుంది. తీవ్రమైన సంఘర్షణ తీరం దాటని తుఫానులా మనసుని తడుపుతున్నా బండబారిన స్థితప్రజ్ఞుల్లా ముఖకవళికల్లో రక్తికట్టించడానికి కుదేలైన కండరాల్ని బిగదీసి మరీ నటనావైధుష్యాన్ని ప్రదర్శించడం రివాజైపోయింది. కోరుకున్న ముద్రల కోసమే అభిప్రాయాలూ సహజత్వాన్ని కోల్పోయి హంగులు అద్దుకుంటున్నాయి. అన్నింటిలోనూ "ఈ క్షణానికే నిశ్చితంగా ఉండే నిశ్చితాభిప్రాయాలు" మన స్వంతం. కానీ ముద్రలు మాత్రం శాశ్వతమైనవి కావాలి. గతించిన అభిప్రాయానికీ, మారిన ఆలోచనకు లంకె వేస్తే పుటుక్కున భండారం బయటపడుతుందన్న ఆలోచనా స్ఫురించదు. మనపై సమాజం వెయ్యాలనుకునే ముద్రని సాధించడానికి ఇచ్చినంత విలువ మన ఆలోచనల్లో స్థిరత్వం పొందడానికి ఇవ్వం. అందుకేనేమో ముద్రలు ముఖస్తుతికి పనికొస్తుంటే మారుతుండే మన ఆలోచనలు కొరుక్కునే చెవుల్లో నిందలుగా షికారు చేస్తుంటాయి. మంచివాడో, గొప్పవాడో, త్యాగశీలో, మేధావో వంటి ముద్ర మన సమక్షంలో బలంగా విన్పిస్తే చాలు.. మనం అవేం కాకపోయినా అహం సంతృప్తిపడి శాంతిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
ఎందుకోసం చేసినా మంచి మంచే. మంచిగా నటించటం మొదలు పెడితే, ఆటోమేటిక్ గా అలవాటయ్యిపోతుంది.
మంచి వెనకాల ఉద్దేశం ఎదైనా మంచి మంచేదేనని నా ఉద్దేశం.
ఈ పోస్ట్ కి నేను పెట్టిన టైటిల్ మాత్రం సూట్ అవదు. అర్థరాత్రి 1 గం. సమయంలో పోస్ట్ అంతా రాసేశాక టైటిల్ పెట్టడానికి ఎక్కువ ఆలోచించే ఓపిక లేక ఏదో పెట్టేశాను. దయచేసి టైటిల్ కి జస్టిఫికేషన్ లభించలేదని అంచనాకు రాకండి. పోస్ట్ ని టైటిక్ కి డిటాచ్ చేసి చదవగలరు.
నిజమే పై పై మెరుగులకి పోయి మన అస్తిత్వాన్నే మరచిపోతున్నాము. మన గురించి ఎవరేమి అనుకుంటారో అన్న తాపత్రయమే కానీ మన గుండె ఆరాటాన్ని పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యం గా దాని గొంతు నొక్కేస్తున్నాము అని అర్థం చేసుకోలేకపోతున్నాము. నటించి నటించి ఆ నటనలో అలిసి నేనెవరు అని అడిగితే అప్పటికే మూగదైపోయిన గుండె ఏమి సమాధానం ఇస్తుందో మరి?
a2zdreams గారు, నటించడం గురించి కన్నా ఫలానా ముద్ర కావాలని మన మనసు పడే తాపత్రయానికి పూర్తి కాంట్రాస్ట్ గా మన ఆలోచనలు నిరంతరం కొత్త రూపు సంతరించుకుంటూ ఉంటాయి అన్నది ఎస్టాబ్లిష్ చెయ్యదలుచుకున్నాను. ఇకపోతే మీరన్నట్లు విషయమూ కరెక్టే. మంచిగా నటించడం అలవాటైతే కొన్నాళ్లకు ఎంతోకొంత మంచి వారవుతారు. ధన్యవాదాలు.
@ లక్ష్మి గారు "లోపలి నా రూపానికీ", బయట నాపై నా చర్యల వల్ల గానీ, ఇతరుల అంచనాల వల్ల కానీ ఏర్పడుతున్న ఇమేజ్ కీ ఎంత అంతరమో నన్ను ఈ పోస్ట్ రాసేలా చేసింది. అయితే లోపలి నా ఆలోచనలు స్థిరంగా లేకపోయినా బయట నాకొక స్థిరమైన ముద్ర కావాలి అని మనిషి కోరుకోవడం విచిత్రంగా తోస్తుంది. ఆ గమనింపుని వ్యక్తపరచడానికే ఈ టపా. చక్కని కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.
చాలామంది అవకాశాలు రాక మంచివాళ్ళుగా మిగిలిపోతుంటారు...
శ్రీధర్ గారూ ! టైటిల్ ఏదయితేనేం ?ప్రతీ మనిషిలోనూ జరిగే అంతర్మధనానికి అక్షర రూపమిచ్చారు .
"ముద్రలు ముఖస్తుతికి పనికొస్తుంటే మారుతుండే మన ఆలోచనలు కొరుక్కునే చెవుల్లో నిందలుగా షికారుచేస్తుంటాయి. ఎంత బాగా రాశారండీ .
naa comment edi?
రమ్య గారు మీ కామెంట్ రాలేదండీ. మళ్లీ రాసి పుణ్యం కట్టుకోండి :)
అందరూ కాకపోయినా కొందరుంటారు ఆదర్శాలని పిల్లలకి ఉగ్గు పాలతో రంగరించి పెంచుతారు..కానీ తప్పకుండా ఆ పిల్లలు అసమర్ధులుగా చాతకాని వాళ్ళలా ప్రపంచంతో ముద్రవేయించుకుంటారు..తన వాళ్ళంటూ వారికే సోకాల్డ్ సర్కిల్ సంపాదించుకోలేరు!
ఇంకోటేంటంటే వాళ్ళు చేసే పనులూ మాటలూ ముద్రలకోసం కాక నమ్మిన విలువల కోసమై ఉంటాయి.
నిజంగా మనం మంచివాళ్ళమా?
మిగతా వాళ్ళ గురించి నేను ఆలోచించలేను గానీ... యెస్ నేను మంచిదాన్ని (నా మనసు మూలగడం లేదు)
వింతగా చూస్తారేమో ఇలాగంటే! సొంతడబ్బా అనికూడా అనుకుంటారేమో!
బహుశా నేను మంచిదానిగా మిగిలి పోవాటానికి కారణం.. జీవితం సాఫీగా సాగటం, మంచి రక్షణ కలిగిన షెల్ లాంటి నా జీవితం. పోరాటం పోటీలేదు. ఎవరి కిందా పనిచేసింది లేదు! జన్మత వచ్చిన స్వభావం కొంత, పెంపకం కొంతా, దేనికీ కొరతలేని జీవితం కొంతా.
సరె అది వదిలేద్దాం!
మంచివాళ్ళు వేరు.. మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకోవటం వేరు.. ప్రదర్శన కొందరిని మంచివాళ్ళుగా చూపిస్తుందేమో!
శ్రీధర్ గారు: ఈ పోస్ట్ ఇప్పటికి 3 సార్లు చదివాను. అర్థం కాలేదో, మరి అర్థం చేసుకోడానికి ప్రయత్నమో తెలీదు కాని, ఎన్నిసార్లు చదివినా మనలోని మూగ మనసు మంచితనానికి పై పైన మాట్లడుతుంటే పడే మనపైన ముద్రకి ఎప్పుడూ ఎక్కడ పొంతన ఉండదు. ఒకళ్ళ మెప్పుకోసమో, మన లాభం కోసమో, లేక ఇంకేదన్నా మనకి ఉపయోగముందేమో అనే ప్రయత్నమో తెలీదు కాని మనుషులదంతా నటనే. కీర్తిప్రతిష్టలకోసమో, మంచివాళ్ళమన్న పేరుకోసమో పడే తాపత్రయమది. ఎందుకో ఒక్కసారికి నాకొకటి అనిపిస్తుంది అసలు మనకి మాటలే రాకపోతే మన మూగ మనసు బాసలు ఆ భాష మనము అర్థం చేసుకొని ఉండేవాళ్ళమేమో కదా ఇలాంటి సమయంలో నాకు ఒక్కటే గుర్తొస్తోంది.
"ఆది నుండి ఆకాశం మూగది,
అనాదిగా తల్లి ధరణి మూగది,
నడుమ వచ్చి ఉరుముతాయి ఉరుములు ,
ఈ నడమంత్రపు మనిషికే మాటలు.. "
మన మూగ మనసు చెప్పేది మనము వినము. మనం కోరుకొన్న ముద్రల కోసమే మన నడమంత్రపు మాటల కోటలు.
computerera test comment
కంప్యూటర్ ఎరా
computer era
కంప్యూటర్ఎరా
Post a Comment