Thursday, December 11, 2008

పెద్దరికం

తనకు నచ్చితేనే ఒప్పుకునే తత్వం ఏ మనిషిదైనా! సామాజిక బంధాల్లో ఇలా మనకు నచ్చడం అన్నది ఎల్లప్పుడూ సాధ్యపడదు. ముఖ్యంగా తరాల అంతరాలున్న బంధాల్లో పెద్దల ఇష్టాలకు అనుగుణంగా పిల్లలు సగౌరవంగా గానీ, అయిష్టంగా గానీ.. అలాగే పిల్లల ఆధిపత్యాన్ని నిస్సహాయస్థితిలో కాదనలేక పెద్దలు గానీ ఒక్కోసారి ఒద్దికగా కావచ్చు, తప్పనిసరై కావచ్చు తలవంచక తప్పదు. పిల్లల పరంగా చూస్తే పెద్దల అనుభవానికి గౌరవం ఇవ్వాలా లేక వయసుతో ఆపాదించబడే పెద్దరికానికి తలవగ్గాలా అన్నది అంత సులభంగా నిర్ణయించుకోలేని ప్రశ్న. అనుభవంతో పరిపక్వత సంతరించుకున్న పెద్దరికం అప్రయత్నంగానే అన్ని బంధాల నుండి గౌరవాన్ని దక్కించుకుంటుంది. ఎటొచ్చీ "వయసులో పెద్దవారం" అన్న అర్హతను ఆధారంగా చేసుకుని ప్రత్యక్ష చర్యల ద్వారానూ, మాటలు చేతల ద్వారానూ ఆధిపత్యాన్ని కనబరచాలనుకునే పెద్దలకు అణిగిమణిగి ఉండాలంటేనే చిర్రెత్కుకొచ్చి చివరకు చిన్న పిల్లలు సైతం ఎదురు తిరుగుతారు. తమకంటూ ఓ నిర్థిష్టమైన వ్యక్తిత్వం ఏర్పరచుకోలేని పెద్దలు, డబ్బు, సామాజిక హోదాల మత్తులో మునిగి ఖద్దరు బట్టల్లో పెద్దరికం ఒలకబోయాలనుకునే పెద్దలు చిన్నవారి మనసుల్లో తిరస్కరణలకు గురవుతూ ఉంటారు. వయస్సు, ఆడంబరత గౌరవం పొందడానికి అర్హతలని ఎప్పుడైతే పెద్దలు భావించడం మొదలెడతారో అక్కడే వారికి ప్రతిఘటన ఎదురవుతుంది.

మన సంస్కృతి పెద్దలను గౌరవించమంటుంది కాబట్టి ఎటూ ఇష్టంగానైనా, అయిష్టంగానైనా పిల్లలు పెద్దలను గౌరవిస్తూనే ఉంటారు. కనీసం గౌరవిస్తున్నట్లు నటిస్తూనే ఉంటారు. కొందరు పెద్దలు తమ వ్యక్తిత్వంలోని ఔన్నత్యంతో పిల్లల మనసుల్ని చాలా సులభంగా కొల్లగొట్టగలం అన్న సూత్రాన్ని మరిచి గౌరవం పొందడానికి పెద్దరికాన్ని అడ్డుపెట్టుకోవాలనుకోవడమే విచారకరమైన విషయం. ఎప్పుడైనా ప్రేమ, ఆప్యాయతలే మనసుల్ని కట్టిపడేసి గౌరవాన్ని అందించగలవు తప్ప వయసుతో అజమాయిషీ చెయ్యడానికి ప్రయత్నిస్తే అది వికటించడం ఖాయం.

విచిత్రమేమిటంటే ఆ వయస్సూ కొంతకాలం మాత్రమే గౌరవాన్ని పొందడం విషయంలో ఆదుకుంటుంది. మరికొన్నేళ్లు గడిస్తే అదే వయస్సు శాపంగా పరిణమిస్తుంది. పిల్లల పట్ల ప్రేమతో మెలిగిన వారికే వృద్ధాప్యంలో కష్టాలు తప్పకపోతే ఇక "పెద్దరికం" ముసుగేసుకుని జులుం ప్రదర్శించిన వారికి వృద్దాప్యంలో ఎలాంటి మర్యాదలు దక్కుతాయో చెప్పనవసరం లేదు. గౌరవించబడుతూ వచ్చిన అతి కొద్దికాలంలోనే వయస్సు మీదపడి నిస్సహాయతలో కూరుకుపోవడం మింగుడుపడని దారుణ పరిస్థితి. నిన్నటి వైభవం బుర్రలో చెరిగిపోకముందే నేటి బాధలు వైరాగ్యంలో ముంచెత్తుతుంటాయి. ఇక్కడ తమకంటూ అనుభవం ఉన్నా, స్వంత అభిప్రాయాలు ఉన్నా తమకూ, కుటుంబానికి చెందిన అన్ని విషయాల్లోనూ పిల్లలకు ఎదురు చెప్పలేక, జోక్యం చేసుకోలేక మౌనప్రేక్షకులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చెయ్యలేని దుర్భరజీవితం పెద్దలది. అందుకే బంధాలను ప్రేమతో గెలవాలి తప్ప వయస్సు, హోదాలతో కాదు అన్నది అందరం గుర్తుంచుకోవాలి.

8 comments:

Ramani Rao said...

పెద్దల మాట వినాలి, పెద్దలని గౌరవించాలి, పెద్దల మాట చద్దన్నం మూట, ఇత్యాది విషయాలని చిన్నప్పటినుండి పాఠ్యాంశాల ద్వారనైతెనేమి, వివిధ పద్ధత్లులలో పిల్లలికి ఉగ్గుపాలనుండి గౌరవించడం, మన్నిచడం లాంటివి నేర్పుతారు. ఒకవిధంగా ఈ మర్యాద ఇచ్చి పుచ్చుకోడం అనేది మన భారత దేశం సాంప్రదాయం. "నమస్కారం" అనే ఒకే ఒక పదం మనలోని హుందాని, దాన్ని అంది పుచ్చుకొన్నా వారిలోని పెద్దరికాన్ని మనకి తెలియకుండానే తెలియజేసే మంచి సంస్కారవంతమైన పదం.

ఇక పెద్దరికాన్ని నిలుపుకోడం అనే విషయానికి వస్తే, తల్లి తండ్రులు వృద్ధ్యాప్యం లోకి అడుగుపెట్టినా వాళ్ళ కంటికి ఎదిగి తమకంటూ ఓ వ్యక్తిత్వాన్ని, ఓ జీవన శైలిని అలవర్చుకొన్న పిల్లలు చిన్న పిల్లల్లాగ కనపడడం జరుగుతుంది. దాని వల్ల అయిన దానికి కాని దానికి కలుగజేసుకొని, సలహాలు ఇవ్వడం వారి నైజం అయిపోతుంది. ఇక్కడ వారిద్దరి మధ్యా సంఘీ భావం, అర్థం చేసుకొనే తత్వం ఉండాలి తప్ప, పెద్దరికం ప్రశ్న కాదని నా అభిప్రాయం. అప్పుడు కనక చిన్నవాళ్ళు కరెక్ట్ గా వారి సొంత వ్యక్తిత్వాలని కాని పెద్దవారికి అర్థం అయ్యేలా చెప్పుకోగలిగితే (పెద్దవారు పెద్దరికం ముసుగులో కాక అర్థం చేసుకోగలిగితెనే సుమా) "పెద్దరికం" అనే పదానికే పెద్దరికం చేకూర్చగలుగుతామని నా అభిప్రాయం, విసుక్కోడం, కసురుకోడం, చిన్నపిలలముందు చులకన చూడడం అనేది బాధాకరమైన విషయమే. ఎందుకంటే వృద్ధ్యాప్యం అనేది మరో బాల్యం లాంటిది. మన బాల్యంలో మనం చేసే ఎన్నో పనులకి మురిసిపోతూ తట్టుకొనే ఆ పెద్దల బాల్యాన్ని మనమెందుకు అంగీకరించలేకపోతున్నాము?

అయితే నేను పెద్దవాళ్ళని వెనకేసుకొస్తున్నాను, మీ పోస్ట్ ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అనుకోవద్దు. "అతి వినయం ధూర్త లక్షణం " అన్నారు ఆ పెద్దలు, మన పరిమితులకి లోబడి వారిన్ని వారి పెద్దరికాన్ని కాపాడగలగాలి కాని, మనకంటూ ఓ సొంత వ్యక్తిత్వం ఉంది అని అర్థం చేసుకోకుండా వితండ వాదన చేస్తుంటే చేతులు కట్టుకొని అతి వినయంగా తలూపకుండా మన అభిప్రాయాన్ని వారి పెద్దరికాన్ని గౌరవిస్తూనే (వారి పూర్వ వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని) నిక్కచ్చిగా చెప్పగలగాలి.

ఈ పెద్దరికం అనేది ఒక్క తల్లి తండ్రులకీ పిల్లలికే కాదండి, అన్నా తమ్ముళ్ళు , అక్కా చెల్లెళ్ళు, బావా , బావామర్దులు ఇలా అందరూ తమకన్నా చిన్నవారికి 'ఏమి తెలీదు' అనే భ్రమలో ఉండి, తమ పెద్దరికాన్ని చూపించే ప్రయత్నంలో అర్థం లేని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, అది ఈ చిన్నవారికి నచ్చకపోతే అనవసరమైన గొడవలు.. తమకన్నా చిన్నవారికి కూడా ఓ సొంత వ్యక్తిత్వం ఉంటుందని కాని, వారు ఆలోచించగలరని కాని ఈ పెద్దవాళ్ళు ఆలోచించలేక, ఒకవేళ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెయ్యకపోతే వారి మర్యాదకి ఏదో భంగం వాటిల్లినట్లు ప్రవర్తించేవారు కూడా మన చుట్టూ చాలా మంది ఉన్నారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోడం అనే విషయానికి వస్తే ఇలాంటి వాళ్ళకి పుచ్చుకోడం తప్పితే ఇవ్వడం తెలీదు. అదే వాళ్ళ పెద్దరికం.

మనలో మన మాట... వ్యాఖ్య రాయబోయి పోస్ట్ రాసేసినట్లున్నాను. సారీ! శ్రీధర్ గారు. నాకు తెలిసింది కొంచం చెప్దామని ప్రయత్నించి చాలా ఎక్కువ చెప్పేసాను.

Unknown said...

రమణి గారు, కామెంట్ ద్వారా చాలా చక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. కేవలం "పెద్దరికాన్ని" ముసుగుగా ధరించి అజమాయిషీ చెయ్యాలనుకునే స్వభావాలను ఉద్దేశించే నేను రాసినది. మీరన్ననట్లు వృద్దాప్యం అనేది రెండవ బాల్యం. మానవతా విలువలు ఉన్న ఏ మనిషీ వృద్ధులను, పెద్దలను వారు ఎలా ప్రవర్తించినా సమర్థించుకోకుండా ఉండలేరు. అది మన బాధ్యత కూడా! పెద్దలను గౌరవించడం మన సంస్కారం. కానీ పెద్దలు ఇలా ఆలోచించాలి అన్నది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్. మీరు చివరి పేరాలో అన్నట్లు తల్లిదండ్రులనే కాదు ఒక్క సంవత్సరం పెద్ద వయస్సు ఉన్నా తోబుట్టువులు, ఇతరులందరూ తాము వయస్సులో పెద్ద అనే ఫీలింగ్ ఉంటే వారూ తమ పెద్దరికాన్ని ఒక్కోసారి చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. వ్యాఖ్య ఇంత వివరంగా రాయడం నాకు నచ్చింది. కారణం రాజకీయాలు, సినిమాలు ఇతర అంశాల గురించి ఎంత చర్చ జరుగుతుందో అనునిత్యం మనకు కళ్లెదుట కన్పించే ఇలాంటి అంశాలపై చక్కని చర్చ జరిగితే చక్కని స్పష్టత వస్తుంది. నేను రాయలేకపోయిన పార్శ్యాలు ఇంకొకరు కామెంట్ లో వ్యక్తపరచవచ్చు. దానివల్ల విషయంపై పరిపూర్ణత వస్తుంది.

లక్ష్మి said...

శ్రీధర్ గారు, మంచి అంశాన్ని స్పృశించారు. పెద్దరికం అనేది వయసుతో కాదు వాళ్ళ వ్యక్తిత్వం వల్ల వస్తుంది అన్నది చాలా మంది "సో కాల్డ్" పెద్దవాళ్ళకి ఎప్పుడర్థం అవుతుందో నాకు తెలియదు. పెద్దరికం పేరుతో ప్రతీ నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి, మనం వాళ్ళ అడుగుజాడల్లోనే నడవాలీ అనుకోవటం అర్థరహితం అనిపిస్తుంది. మన జీవితాన్ని కూడా వాళ్ళే జీవించేస్తే మనకి మిగిలేదేముంది. కొడుకు విప్రో లో ఉద్యోగం చెయ్యాలా, సత్యం లో నా అన్నది కూడా వాళ్ళే నిర్ణయించేస్తుంటారు కొంతమంది. అలాంటివి చాల ఫన్నీ గా ఉంటాయి, కాని అది అనుభవించే వాళ్ళకి ప్రత్యక్ష నరకం. అలా అని మాట కాదన్నామో వీళ్ళు మా చెయ్యి దాటిపోయారో అని ఊరంతా గోల గోల చేస్తారు. ఇలాంటి పెద్దవాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని అందరూ ఒకేలా ఉంటారు అని కాదు. నిజంగానే వాళ్ళ పెద్దరికం నిలబెట్టుకుంటూ ఇలాంటి పెద్దవాళ్ళు మా ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుండు అని అనిపించే వాళ్ళు కూడ ఉంటారు. అమ్మో మీ టపా కన్నా నేను పెద్ద కామెంట్ రాసేసినట్టున్న

కామేశ్వరరావు said...

నా మనసుకి దగ్గరైన విషయం ఇది. "పెద్దరికం" ఆపాదించుకొని పిల్లలమీద అజమాయిషీ చేసే తల్లిదండ్రులు నాకు తెలుసు, పిల్లలని పూర్తిగా అర్థం చేసుకొనే తల్లిదండ్రులూ తెలుసు. మొదటి రకం గురించి ఎందుకుగాని, రెండవ రకానికి చెందినవాళ్ళలో మా అమ్మా నాన్నా మొదట ఉంటారని సగర్వంగా చెప్పగలను. ఇంకా చెప్పాలంటే, నేనే వాళ్ళని సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది! పెద్దవాళ్ళుగా వాళ్ళు నన్ననడం కాదు, రమణిగారన్నట్టు, నేనే అప్పుడప్పుడూ వాళ్ళమీద చికాకు పడటం ఆ తర్వాత బాధ పడటం జరుగుతూ ఉంటుంది!
నిజానికి పైన నేను చెప్పిన రెండు రకాలూ రెండు extremes. చాలా మంది ఆ రెంటికీ మధ్యనుండే వాళ్ళే. చాలా సందర్భాలలో పెద్దలది తప్పా పిల్లలది తప్పా అని ఖచ్చితంగా నిర్ణయించ లేము. పిల్లల జీవితాలకి సంబంధించినదే అయినా, పెద్దవాళ్ళ దృష్టితో ఆలోచిస్తే అది తప్పు/సమస్య కావచ్చు. పిల్లల దృష్టిలో అది వాళ్ళకి మంచి కావచ్చు. అలాటి సందర్భాలలో పెద్దవాళ్ళ దృష్టితో ఆలోచించి సమస్యని అర్థం చేసుకొని, వాళ్ళకి నచ్చచెప్పాల్సిన బాధ్యత పిల్లలకి ఉందని నా అభిప్రాయం. అలాటి ప్రయత్నం చేయకుండా, నా జీవితం నా ఇష్టమనే దృక్పథం వాళ్ళ మధ్య దూరాన్నే పెంచుతుంది.
పెద్దలకీ పిల్లలకీ మధ్య ప్రేమానురాగాలు, అనుబంధమూ అసలు కీలకం. వాటికి అందరూ విలువనిచ్చినంత కాలం, ఎన్ని మనస్పర్థలు వచ్చినా అవి తాత్కాలికమే అవుతాయి.

Anonymous said...

వయసు = అనుభవం
వయసు= మనతో వాళ్ళకున్న అనుబంధం
కాబట్టి వయసుకు గౌరవం ఇవ్వటమంటే వారి అనుభవానికి విలువ ఇవ్వటం
కాస్తో కూస్తో మనకంటే ఈ ప్రపంచంలొ కి ముందుగా వచ్చారు కనుక కచ్చితంగా మనకంటే కాస్తో కూస్తో ఎక్కువే చూసుంటారుకనుక నాకు తెలియనిది ఏదీలేదు అన్న అహంకారం వుండటం సహజమేకదా . ఇప్పుడు నేను అరకు వెళ్ళా దామనుకుంటున్ననండీ శ్రీధర్ గారూ అన్నాననుకొండీ మీరు వెంటనే మీ అనుభవం దృష్యా యేదో ఓ సలహా ఇవ్వకుండా వుండలేరుకదా . అక్కడ ఫలానా ఇబ్బందులుంటాయి జాగ్రత్త అనో లేకపొతే ఇలా ఐతే సులువెగా చేరచ్చూ అనో ఇలా అన్నమాట .
వయసులోనో, అనుభవంలోనో, మరేవిధంగానో పెద్దవాళ్ళంకాబట్టి మాకు తగిన గౌరవం ఇవ్వలని కోరుకోవటం చిన్నపిల్లాడు బజర్లో చాక్లెట్ కోసం మారాం చెయ్యటం లాంటిది అది వాళ్ళ హక్కు అంతే ఎప్పటికెయ్యది ప్రస్తుతమో .............అన్నట్టుగా అప్పటికి వాళ్ళని సంతుస్టుల్ని చేయడం మనధర్మం

Unknown said...

@ లక్ష్మి గారు పెద్దలు ఆలోచించవలసిన విధంగా చాలా బాగా రాశారు. నిజంగా కొన్ని కుటుంబాల్లో, బయటా పెద్దల ప్రవర్తన చూస్తే చాలా ఆనందం అన్పిస్తుంది. వారిలో కలుపుగోలుతనం, భేషజం లేని నైజం, ఉత్సాహపరిచే గుణం వంటి ఎన్నో మంచి లక్షణాలు వారిని మనం గౌరవించేలా చేస్తుంటాయి.

@ భైరవభట్ల కామేశ్వరరావు గారు, మీ వంటి అనుభవజ్ఞుల నుండి కామెంట్ పొందడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. మీలాంటి అనుభవమే నాది కూడా. నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ, తాతయ్యలు ఎంత ఆపేక్ష కనబరిచేవారో, వారు నా స్థాయికి వచ్చి నా మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారో కళ్లముందర మెదులుతోంది మీ వాక్యాలతో! "పెద్దవాళ్ల దృష్టితో ఆలోచించి సమస్యని అర్థం చేసుకుని, వాళ్లకు నచ్చచెప్పవలసిన బాధ్యత పిల్లలకు ఉంది" అన్నది అక్షర సత్యం. నా జీవితం నాది అనే కోణంలో పిల్లలు ఆలోచిస్తే వచ్చే అనర్థాలు ఇప్పుడు వ్యష్టి కుటుంబాల్లో చూస్తూనే ఉన్నాం.

@ లలిత గారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. పెద్దలను గౌరవించడం మన ధర్మం. నేను ఏ దశలోనూ దాన్ని కాదనను. ఇక్కడ కేవలం ఓ ప్రత్యేకమైన మనస్థత్వం కలిగిన పెద్దల గురించీ, అది ప్రధానంగా ఇంట్లో కన్నా బయట ఇతరులపై డాబూ దర్పంతో పెద్దరికం చూపించాలనుకునే పెద్దల గురించి రాయదలుచుకుని పోస్ట్ ప్రారంభించాను. చివరకు అది కుటుంబంలో చిన్న పెద్ద సంబంధాలను కూడా లైట్ గా స్పృశించింది. నేను ప్రధానంగా రాసింది "అలా కాదమ్మా.. ఓ టికెట్ బుక్ చేసి పెట్టమ్మా" (ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే) అంటూ కొంతమంది ఖద్దరు బట్టల బాపతు వ్యక్తులు పెద్దరికం ప్రదర్శించుకోవడానికి "అమ్మా అమ్మా" అంటూ ప్రతీ ఒక్కరినీ సంబోధిస్తూ ఆజ్ఞలు జారీ చేస్తుంటారు చూడండి అలాంటి వారు ఈ టపా రాసేటప్పుడు నా మనసులో ఉన్న ప్రధానమైన వస్తువు. కాకపోతే రాతల్లోకి వచ్చేసరికి అది జనరలైజ్ అయిపోయింది. నిజంగా పెద్దలకు గౌరవం ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. వివరంగా కామెంట్ రాసినందుకు మరోసారి ధన్యవాదాలు.

Anonymous said...

వ్యాఖ్యానించాలని ఉంది కానీ, పెద్దలు చూస్తున్నట్లున్నారు.ఇంకెప్పుడైనా....!

Aruna said...

బావుంది. ఇంకోటి కూడా చేర్చుకోండి, మీ బ్లాగు టాపిక్ కి పరిపూర్ణత కోసం. సందర్భాన్ని బట్టి, పెద్దల(మనుషులు)కి గౌరవాలు దక్కుతాయి అని.
"కొన్ని చోట్ల పెద్దలని ప్రశ్నించే హక్కే వుండదు తోటివారికి. (పెద్దమనుషుల వల్ల లాభం వుంటే)
మరి కొన్ని సందర్భాల్లో వారికి నిక్కచ్చిగా మన అభిప్రాయాల్ని చెప్పగలగాలి.(పెద్దమనుషుల వల్ల లాభం లేకుంటే)"

వివాదాస్పదమైన వ్యాఖ్యలతో mediaలో longivity వుంటుంది. :) :)) :D.

ఏదో సినిమా పాట గుర్తు వస్తోంది. "పెద్ద మనిషి అంటేనే బుధ్ధులన్ని వేరయా..." నేను కేవలం నిజాల్ని నిక్కచ్చి గా చెప్తున్నాను అంతే. :)

@Sridhar garu,
Nice write up from your side. :)