Thursday, September 30, 2010

సంతృప్తితో 10వ సంవత్సరంలోకి..

ICWAI చదివి.. సినిమా జర్నలిస్ట్ గా దాదాపు పెద్ద నటీనటులందరితోనూ పనిచేసి.. 1996లో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ సాహిత్యానికి శ్రీకారం చుట్టే అదృష్టం లభించీ.. ఎన్నో మలుపులతో సాగిన నా ప్రస్థానం 2001 అక్టోబర్ నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ద్వారా తెలుగు ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో కొనసాగుతూ వచ్చింది. ఈ అక్టోబర్ 2010తో "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగిడబోతోంది. ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో నిఖార్సయిన నాలెడ్జ్ ని అందించడానికి, పాఠకులకు వీలైనంత సమాచారం ఇవ్వడానికి అహోరాత్రాలు ఎంత శ్రమించానో నా ఒక్కడికే తెలుసు! కారణం "కంప్యూటర్ ఎరా"ని 9 సంవత్సరాల పాటు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ ప్రతీ లైనూ ఒక్కడినే రాస్తూ, టైప్ చేస్తూ, పేజ్ మేకప్ చేస్తూ నిర్వహిస్తూ వస్తున్నాను కాబట్టి.. ఇంత బాధ్యతని నిర్వర్తించడం వెనుక ఎంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటానో నాకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు. సగర్వంగా చెప్పుకుంటున్నాను.

1996లో తెలుగులో టెక్నికల్ లిటరేచర్ ని మొదటిసారిగా మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ ఎంతోమంది నా మిత్రులు, ఆత్మీయులు, పాఠకులు నా గైడెన్స్ లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నతస్థానంలో స్థిరపడుతూ వచ్చినా ఇప్పటికీ సాధారణ ఎడిటర్ గా పనిచేస్తూ పాఠకులకు మంచి నాలెడ్జ్ ని అందించాలన్న తపనని ఇంకా కాపాడుకుంటూ రాగలుగుతున్నానంటే ఖచ్చితంగా అది నా స్థిరనిశ్చయాన్ని ప్రతిఫలిస్తుంది.

ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకుని కంప్యూటర్ ఎరా ద్వారా నేను రాసే ఎడిటోరియల్స్ స్ఫూర్తితో, మేగజైన్ లో రాసే టెక్నికల్ కంటెంట్ తో నాలెడ్జ్ ని పెంచుకుని ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ ఆశావాదంతో జీవితం సాగిస్తున్న ఓ పాఠకుడూ, 65 ఏళ్ల వయస్సులోనూ వేరే ఊరి నుండి నన్ను ఎలాగైనా కలుసుకోవాలని వచ్చి నేను అందుబాటులో లేకపోతే నడివేసవిలో పగలంతా బయటతిరిగి సాయంత్రం వరకూ నా కోసం వెయిట్ చేసిన నాగార్జునసాగర్ కి చెందిన ఓ పెద్దాయనా, అస్థవ్యస్థమైన జీవనశైలి నుండి ఎలాగైనా జీవితంలో పైకెదగాలని పట్టుదలతో ఏకలవ్యశిష్యునిలా నన్నూ, కంప్యూటర్ ఎరానీ ఆసరాగా చేసుకుని ఈరోజు అద్భుతమైన ప్రతిభతో NTV వంటి ఛానెల్ లో వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న మరో ఆత్మీయుడూ.. ఇలా ఎందరో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ తమ ఆశీర్వచనాలను అందిస్తూ నాకు మనోస్థైర్యాన్ని అందిస్తున్నారు.

వీళ్లందరినీ కాదనుకుని నేను ఇప్పటికన్నా గొప్పగా జీవించగలను.. కానీ ఎందరికో జీవితంలో స్థిరపడడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగే గురుతర బాధ్యత ముందు నా ఒక్కడి స్వార్థం సరైనదని అనుకోను. అందుకే ఇప్పటికీ తొమ్మిదేళ్లు గడిచినా "కంప్యూటర్ ఎరా"లో నాదైన పర్సనల్ టచ్ ఉంటూనే ఉంటుంది. మార్కెట్లో ఎన్నో కంప్యూటర్ పత్రికలు ఉండొచ్చు.. ఏరోజూ "కంప్యూటర్ ఎరా"ని ఇతర పత్రికలతో పోల్చుకోలేదు.. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషువి గానీ, తెలుగువి కానీ ఇతర కంప్యూటర్ పత్రికలు నేను తిరగేసి చూసింది చివరిగా 2005లో.. అదీ ఓ బుక్ స్టాల్ మిత్రుడి కోరిన మీదట. మొదటి నుండి "కంప్యూటర్ ఎరా"ని ఓ సాధారణ పత్రికగా కాకుండా పదిమందికీ నాలెడ్జ్ ని పంచిపెట్టే ఓ చక్కని అవకాశంగా భావిస్తూ వచ్చాను. అందుకే వీలైనంత వరకూ పాఠకులకు అందుబాటులో ఉంటూ వచ్చాను. 2001 నుండి 2005 వరకూ రోజుకి 60-65 మందికి ఫోన్ ద్వారా డౌట్లు క్లారిఫై చేస్తూ వచ్చాను.. తర్వాతి కాలంలో సమయాభావం వల్ల పాఠకులు ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలా 13,000 మందితో 2007 నుండి 2009 జూలై వరకూ "కంప్యూటర్ ఎరా" ఫోరమ్ ని నిర్వహించడం జరిగింది. పలు టెక్నికల్, సంస్థాపరమైన, ఇతర కారణాల వల్ల ఫోరమ్ ని నిలిపివేయవలసి వచ్చింది.

రోజు మొత్తంలో 60-65 ఫోన్ కాల్స్ కి డౌట్లు చెప్పేటప్పుడూ, ఫోరమ్, ఛాట్ సర్వీసులను నిర్వహించి రెండేళ్లకు పైగా ఆరోగ్యం అశ్రద్ధ చేస్తూ వేకువజాము 2-3 వరకూ సమయాన్ని దాని నిర్వహణపై వెచ్చించినప్పుడూ గుర్తుకురాని నేను.. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించక ఆ సర్వీసులను నిలిపివేయడం జరిగిందో అప్పుడు నిష్టూరమాడడానికి కొంతమంది పాఠకులకు టార్గెట్ గా నిలిచాను. అయినా రకరకాల మనుషుల మనస్థత్వం మొదటినుండీ అలవాటైనదే కావడం వల్ల సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నిజంగా నాకు ఇంతటి గొప్ప బాధ్యతని అప్పజెప్పినందుకు భగవంతునికి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటున్నాను. సమాజం పట్ల నా బాధ్యతని తీర్చుకునే అవకాశం నాకు కలిగింది. అందుకే నన్ను ఎంతోమంది అర్థం చేసుకున్నా, కొందరికి నేను సరిగ్గా అర్థం కాకున్నా నాకెవరూ శత్రువులు లేరు.. అందరూ నాకు శ్రేయోభిలాషులే.. అందరి శ్రేయస్సునూ అభిలషించే వాడినే! మొదటి నుండి ఎలాంటి పబ్లిసిటీ హంగామా లేకపోయినా "కంప్యూటర్ ఎరా" తెలుగు పత్రికని ఆదరించి, తమకు తెలిసిన పదిమందికీ పరిచయం చేస్తూ మా కష్టం మరెంతో మందికి నాలెడ్జ్ అందించేలా సహకరిస్తున్న పాఠకులకు వందనాలు.

తొమ్మిదేళ్ల పాటు ప్రతీ నెలా 1వ తేదీకల్లా పత్రికను మార్కెట్లోకి తీసుకురావడానికి ఒంటిచేత్తో మేగజైన్ రాస్తూ ఎన్ని ముఖ్యమైన శుభకార్యాలు, సంఘటనల్ని మిస్ చేసుకున్నానో, అనారోగ్య కారణాల వల్ల అతి కొద్ది సందర్భాల్లో మేగజైన్ మార్కెట్లో విడుదల అవనప్పుడు ఫోన్ల ద్వారా ఆరా తీసే రీడర్స్ కి నా వ్యక్తిగతమైన ఇబ్బందులను వివరించలేక ఎన్ని తంటాలు పడ్డానో అవన్నీ ఇంత సుదీర్ఘమైన మైలురాళ్ల ముందు దిగదుడుపుగానే భావిస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజం "కంప్యూటర్ ఎరా" లాంటి చిత్తశుద్ధి, పర్సనల్ టచ్ తో కూడిన ఏ పత్రికనూ పాఠకులు ఎప్పటికీ చూడలేరు. ఇది అతిశయోక్తిగా భావిస్తే ఓసారి 2001 నుండి 2010 వరకూ విడుదలైన అన్ని సంచికలూ కనీసం పేజీలైనా తిరగేసి చూడండి.. ఎందుకింత థీమాగా మాట్లాడుతున్నానో!

చివరిగా ఇంతకాలం స్వంత వ్యక్తిగా ఆదరించిన పాఠకులకు హృదయపూర్వక ధన్యవాదాలతో..

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక
http://computerera.co.in

9 comments:

M.Srinivas Gupta said...

Congratulations...

duppalaravi said...

శుభాకాంక్షలు

Unknown said...

@ శ్రీనివాసగుప్త గారు ధన్యవాదాలు.

@ దుప్పల రవి గారు ధన్యవాదాలు.

చదువరి said...

శ్రీధర్,
నిజానికి ఒక పత్రికను ఒంటిచేత్తో ఏళ్ళ తరబడి జయప్రదంగా నడుపుకుంటూ రావడం మామూలు సంగతేమీ కాదు. మీతో కలిసి కొన్ని e-తెలుగు కార్యక్రమాల్లో పనిచేసాను కాబట్టి, పనిపట్ల మీ అంకితభావం తెలుసు కాబట్టి, అది మీకు మామూలు విషయమేనని నేను అనుకుంటాను.

మీకు మన్స్పూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.

Unknown said...

చదువరి గారు.. మేగజైన్ కావచ్చు, e-తెలుగు కావచ్చు.. ఈ వ్యాపకాలన్నింటి ద్వారా నాకంటూ ఏర్పడిన ఆత్మీయులందరిలోనూ మీపట్ల నాకెందుకో ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉంటాయి. ఈ మైలురాయికి చేరుకున్న శుభసమయంలో మీ ఆశీస్సులు అందడం సంతోషంగా ఉంది.

Unknown said...

No words can express our gratitude for your sincere efforts in bringing this only Telugu magazine with computer knowledge.

Hats off and congratulations Mr. Srinivas.

With best regards
Naveen Kumar

Shiva Bandaru said...

అభినందనలు

Sunita.R said...

శ్రీధర్ గారు, ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి సులభమైన శైలిలో మా ముందు వుంచటం లో మీకు మీరే సాటి. మాగజైన్ లో నేను గమనించిన విషయం ఇది. హ్యట్స్ ఆప్ అండీ. మాగజైన్ పది కాలాల పాటు ఎన్నో విషయాలని అందించాలని కోరుకుంటున్నాను. అది సరే నాకు ఒక చిన్న డౌట్. మీకు మాలాగే రోజుకు 24 గంటలే వున్నాయి కదా?

Unknown said...

@ నవీన్ కుమార్ గారు, థాంక్యూ వెరీమచ్ అండీ.

@ శివ బండారు గారు బాగున్నారా, థాంక్యూ.

@ సునీత గారు ఎలా ఉన్నారు? తప్పకుండా మంచి కంటెంట్ అందిస్తూ ఉంటాను. ఇప్పుడే రోబో సినిమా చూసి వచ్చానండీ.. 24 గంటలలోపలే :)