Showing posts with label భావ సంఘర్షణ. Show all posts
Showing posts with label భావ సంఘర్షణ. Show all posts

Thursday, January 22, 2009

నిజంగా మనం మంచి వాళ్లమా?

అలసిన ఓ నిమిషం కళ్లెదుటి బాహ్యప్రపంచాన్ని బలవంతంగా కనురెప్పల బిగింపుతో తిరస్కరించి కళ్లు మూస్తే ఎన్నో అలజడులు కళ్లల్లో ఎగిరెగిరి పడుతున్నాయి. బాల్యపు "నేను"కీ, యవ్వనానికీ, నిన్నటికీ, ఇప్పటి "నేను"కీ సారూప్యత దొరకబుచ్చుకోలేక మెదడు జ్ఞాపకాల దొంతరుల్ని తిరగేస్తూనే ఉంది. అంతలో ఏ సమూహంలోనో అభిప్రాయాలు ఆరాటపడుతూ మనుషుల నాలుకల్ని తొలుచుకు వచ్చేటప్పుడు "నేనలా.. తెలుసా" అంటూ మనసూ ఉండబట్టలేక బలహీనంగా మూలుగుతుంది. నా గురించి నేను చెప్పుకోవడానికి ఎంత ఆరాటమో కదా! "అహం" తన లోతుల్ని తాను తవ్వుకోలేక, నిశ్చలత్వాన్ని పొందలేక నిరంతరం ఊగిసలాడుతూ కూడా ఓ అనిశ్చిత అభిప్రాయాన్ని "స్థిరమైనదిగా" ప్రకటితం చెయ్యడానికి పడే తపన చూస్తుంటే మంచివాళ్లగానో, దయాపరులు గానో, మేధావులుగానో.. ఏదో ఒక స్థిరమైన ముద్రని ఆపాదింపజేసుకోవడానికి మారుతుండే చిత్తాలతోనే ప్రయత్నాలు సాగించడం హాస్యాస్పదంగా తోస్తుంది. తీవ్రమైన సంఘర్షణ తీరం దాటని తుఫానులా మనసుని తడుపుతున్నా బండబారిన స్థితప్రజ్ఞుల్లా ముఖకవళికల్లో రక్తికట్టించడానికి కుదేలైన కండరాల్ని బిగదీసి మరీ నటనావైధుష్యాన్ని ప్రదర్శించడం రివాజైపోయింది. కోరుకున్న ముద్రల కోసమే అభిప్రాయాలూ సహజత్వాన్ని కోల్పోయి హంగులు అద్దుకుంటున్నాయి. అన్నింటిలోనూ "ఈ క్షణానికే నిశ్చితంగా ఉండే నిశ్చితాభిప్రాయాలు" మన స్వంతం. కానీ ముద్రలు మాత్రం శాశ్వతమైనవి కావాలి. గతించిన అభిప్రాయానికీ, మారిన ఆలోచనకు లంకె వేస్తే పుటుక్కున భండారం బయటపడుతుందన్న ఆలోచనా స్ఫురించదు. మనపై సమాజం వెయ్యాలనుకునే ముద్రని సాధించడానికి ఇచ్చినంత విలువ మన ఆలోచనల్లో స్థిరత్వం పొందడానికి ఇవ్వం. అందుకేనేమో ముద్రలు ముఖస్తుతికి పనికొస్తుంటే మారుతుండే మన ఆలోచనలు కొరుక్కునే చెవుల్లో నిందలుగా షికారు చేస్తుంటాయి. మంచివాడో, గొప్పవాడో, త్యాగశీలో, మేధావో వంటి ముద్ర మన సమక్షంలో బలంగా విన్పిస్తే చాలు.. మనం అవేం కాకపోయినా అహం సంతృప్తిపడి శాంతిస్తుంది.

Wednesday, November 19, 2008

సమాజంలో మార్పు వస్తుందంటారా?

"సమాజంలో మార్పు తెద్దాం.. వ్యవస్థని సమూలంగా కడిగేద్దాం.." ఇటీవల విన్పిస్తున్న నాయకులందరి ఇలాంటి నినాదాలతో ఉప్పొంగిపోతున్నాం... ఇంకేముంది దేశం బాగుపడేరోజు వచ్చేసిందని మురిసిపోతున్నాం. అస్సలు సమాజమంటే..? మీరూ, నేనూ, మన పక్క ఉన్న వ్యక్తుల సమూహమే కదా. మనం ఇదే మాదిరి బాధ్యతారాహిత్యంగా ఉంటుంటే ఎవరో వచ్చి మనతో కూడి ఉన్న సమాజాన్ని ఉద్ధరించగలుగుతారా? అస్సలు మనలో ఎంత వరకూ సామాజిక బాధ్యత ఉందో ఎప్పుడైనా గమనించామా? మనం మారకుండానే ఎవరో వచ్చి మన సమాజాన్ని మారుస్తారని కలలు గనడం ఎంత మూర్ఖత్వమో కదా! వచ్చేది ఎంత గొప్ప నాయకుడైనా కావచ్చు వ్యక్తిస్థాయిలో సామాజిక స్పృహ లేకపోతే వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? ఫలానా చిరంజీవి, ఫలానా జయప్రకాష్ నారాయణ, ఫలానా బాలకృష్ణ, చంద్రబాబు అధికారంలోకి వస్తే మనం ఇప్పటికన్నా బాధ్యతగా నడుచుకుంటామా? ఆ నమ్మకం మనకుందా? నాయకుడిపై అంత అభిమానం ఉండి మారగలిగిన వారైతే అదే అభిమానాన్ని దేశంపై ఇన్నాళ్లూ ఎందుకు చూపించలేకపోయాం? ప్రతీ పౌరుడూ వ్యవస్థ అంటే తన ఆవల ఉన్న మిగతా ప్రపంచం అనుకుంటారు. మనలోనూ ప్రభుత్వోద్యోగులు ఉన్నారు, అధికార్లు ఉన్నారు, ఎవరి స్థాయిల్లో వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వారు ఎంతోమంది ఉండనే ఉన్నారు. అలాగే మంత్రులు, అధికార్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. వీళ్లు మాత్రమే కాదు వ్యవస్థ అంటే! ప్రతీ పౌరుడూ వ్యవస్థలో భాగమే. కానీ మనం మనల్ని మినహాయించి మిగతా ప్రపంచంలో అవినీతి పోవాలని, అందరూ బాధ్యతగా ఉండాలని, మార్పులు రావాలని, తద్వారా మన జీవితాలు బాగుపడతాయని పగటి కలలు కంటున్నాం. చూడడానికి చిన్న చిన్న విషయాలే అయినా కొన్ని ఎంతో బాధ కలిగిస్తాయి. ఒక నాయకుడికి మద్దతుగా విద్యావంతులు రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించి ఎంతోమంది సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేయడం, వేలాది రూపాయల బాణాసంచా క్షణాల్లో బుగ్గిపాలు చేయడం.. నాయకుడిని ఎవరైనా తెలిసీ తెలియక విమర్శిస్తే భౌతిక దాడులకు దిగడం.. చెప్పుకుంటూ పోతే రాజకీయ పార్టీలకు దన్నుగా నిలవడానికి మనం వృధా పరుస్తున్న మానవ, ఆర్థిక వనరుల్ని పరిగణనలోకి తీసుకుంటే అవన్నీ వృధా పరచడమేనా మనం కోరుకునే మార్పు? సమాజం పట్ల విభిన్న కోణాల్లో సగటు పౌరుడు బాధ్యతాయుతంగా ఉండనంత వరకూ ఎంత గొప్ప నాయకుడూ కూడా ఆశించినంత మార్పుని తీసుకురాలేడు అన్నది స్పష్టం. గొప్ప నాయకుడు పగ్గాలు చేపడితే ఏతావాతా మంత్రులు, అధికార్లలో కొంతవరకూ జవాబుదారీ తనం వచ్చే అవకాశం ఉండొచ్చేమో కానీ మనలాంటి మనుషుల్లో మనకి మనం మార్పు ఆహ్వానించనంత వరకూ ఇలాగే ఉంటాం.

Sunday, November 16, 2008

క్షణ క్షణానికీ...

"ఫలానా పని సరిగా చెయ్యలేకపోయానే.. ఇలాగైతే బాగుణ్ణు..", "అవునూ అప్పుడలా మాట్లాడి ఉండవలసింది కదూ... ప్చ్ వెధవ బుర్ర టైమ్ కి వెలగదు...", "ఇంతకీ వచ్చేవారం ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి...?", "ఆ శ్రీకాంత్ గాడికి ఎంత చెప్పినా విన్పించుకోడు.. వాడి ఖర్మ, ఇక్కడ నాకేదో పట్టినట్లు..!", "షేర్లు పడిపోయాయి కదా మంచి స్క్రిప్ చూసి కొనిపారేస్తే అలా పడుంటాయేమో... ఆలోచించాలి! ", "ఇప్పుడే తాళాలెక్కడో పెట్టాను ఓ పట్టాన అవసరానికి కన్పించి చావవు"..

ఇవి చదువుతుంటే ఒకదానికొకటి ఏమాత్రమైనా పొంతన ఉందా? ఉండదు. బుర్రలో క్షణక్షణానికీ పరిగెడుతుంటే ఆలోచనల ప్రవాహం ఇది. ఆ క్షణానికి ఆ ఆలోచనే అత్యవసరమైనది. "క్షణం" మారితే చిత్తమూ చిత్రంగా మారిపోతుంది. ఏ అన్యాయమో మెదడుని తొలుస్తున్నప్పుడు మనసులో నిరసనగళం పురివిప్పుతుంది... ఏ ఆనందంలోనో పులకించిపోతున్నప్పుడూ అంతే.. కొన్ని క్షణాలు మైమరపు కమ్ముకుంటుంది.. అన్నీ ఆలోచనలూ క్షణికమాత్రాలే. ఓ ఆలోచన యొక్క ఉనికి అంతకన్నా బలీయమైన మరో ఆలోచనచే అది ఆక్రమించబడేవరకే!

మనసు పొరల్లో క్షణకాలం పాటు తళుక్కున మెరిసి మాయమయ్యే ఆలోచనల్ని ఒడిచిపట్టలేక యాంత్రికంగా సాగిపోతుంటాం. కొండొకచో ప్రయత్నపూర్వకంగా కొన్ని ఆలోచనల్ని జ్ఞాపకపు అలమారాల్లోకి సర్థేసి తర్వాతెప్పుడైనా వాటిని తీరిగ్గా విశ్లేషిద్దామని నిర్ణయానికి వచ్చి మళ్లీ మరిన్ని ఆలోచనల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఆ క్షణం తళుక్కుమన్న ఆలోచన దృష్టి చెదిరేసరికి మరుక్షణం వెలవెలబోతుంది. మెదడు అలమారాల్లో భద్రపరిచిన ఆలోచనలూ తీరా ఏ తీరిక క్షణానో తవ్వి తీస్తే జీవం కోల్పోయి వెక్కిరిస్తుంటాయి. ఈ "మనసులో" బ్లాగులో స్పష్టంగా, అస్పష్టంగా, రేఖామాత్రంగా, ఊహల ప్రతిరూపంగా నా మనసులో కదలాడే ప్రతీ ఆలోచననీ ఒడిచిపట్టి అక్షరరూపం ఇవ్వాలన్నది నా మనోభీష్టం. క్షణకాలంలో తళుక్కున మెరిసి అందుకునేలోపు కనుమరుగైపోయే ఆలోచనలను మరింత నేర్పుతో మనో:ఫలకంపై ముద్రించుకుని అక్షరబద్ధం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. వేగంగా పారిపోయే ఆలోచనలకు గాలం వేసి దగ్గరకు లాగి నిగ్గుదేల్సాలన్న ఈ ఆలోచనా ఆ ప్రయత్నంలో భాగమే.

మనసు నిండా ఎన్నో ఆనందాలు, అసంతృప్తులు, ఆవేశాలు. నా చుట్టూ కదలాడే ప్రపంచం క్షణానికో అనుభూతిని మిగుల్చుతున్నప్పుడు వాటన్నింటికీ ప్రతిస్పందించకపోతే నా మనసు ద్వారాలు స్వయంగా మూసుకున్నట్లు కాదూ...! అందుకే ఏదైనా, ఎవరేమనుకున్నా, ఎవరి మానసిక స్థాయిలో నా రాతలను ఎలా స్వీకరించుకున్నా.. నా రాతలను బట్టి నాకంటూ ఓ అసమగ్రమైన "ముద్ర" వేయబడుతుందని తెలిసినా.. నా రాతలకు నా మనసుని సాక్షిని చేసుకుని నాదైన శైలిలో విభిన్న అంశాలపై ఇప్పటిలానే రాస్తాను.

ఇదీ ఒక టపానేనా.. ఏముంది ఇందులో అని ఓ సందేహమూ కొందరికి వస్తుంది. నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి నా ఆలోచనలను మధించుకుంటూ నా ఆలోచనా సరళిని బ్లాగు మిత్రులతో పంచుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది. "సాంకేతికాలు" బ్లాగు నుండి "సామాజికం" వైపు దృష్టి సారించినప్పుడు "అస్సలు నేనేం రాయగలను?" అన్న ప్రశ్నతో ప్రారంభమై కుప్పలు తెప్పలుగా కమ్ముకుంటున్న ఆలోచనల్లో దేనిపై రాయాలో నిర్థిష్టంగా నిర్థారణకు రాలేకపోయిన క్షణం ఏర్పడిన ఆలోచనే "రాయగలగాలే గానీ ఈ అస్పష్టతా ఓ టపాగా ఎందుకూ రాయకూడదు?" అన్నది! ఇదే మాదిరి ఊగిసలాటను తోటి మిత్రులు నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటారు కదా అని వెంటనే కీబోర్డ్ కి పనిచెప్పాను. అందుకే ఇదీ ఓ టపాగా అక్షరాల్లోకి అమరింది. అదన్నమాట సంగతి. J

Friday, November 14, 2008

భావాలను భ్రష్టుపట్టించకండి

“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమికులే కానవసరం లేదు.. స్నేహితులూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మనసారా మాటల్లో చెప్పాలన్నా “ఇష్టం” అనే పదం అపార్థాలకు తావిస్తుందేమోనని గుంజాటంలో చిక్కుకునే దుస్థితి మనది. నేస్తం తన స్నేహహస్తంతో హృదయాన్ని తడిమినప్పుడు “నువ్వంటే ప్రాణం మిత్రమా” అని మనసు ఒద్దికగా ఒదిగిపోతూ మూలగకపోతే మనలో స్పందనలు ఏమున్నట్లు? నిష్కల్మషమైన ఆ ప్రేమకు కూడా ఆద్యంతాలు, తర్కాలు అన్వేషించనారంభిస్తే మనలో మానవత ఎంత అడుగంటిపోయినట్లు..?

“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే... హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఉండాలి అనే రీతిలో సినిమాలు, ప్రసారమాధ్యమాలు ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.

నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా... ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం.

ఇరు హృదయాల మధ్య సాన్నిహిత్యం చోటుచేసుకోవడానికి మన సమాజంకొన్ని అర్హతలు అనధికారికంగా నిర్దేశిస్తోంది. అయితే ప్రేమికులు కావాలి. లేదా రక్త సంబంధం కావాలి. ప్రేమికులు నాలికపై నుండి చిలకపలుకులు పలికినా దేవదాస్ పార్వతిలతో పోలుస్తూ ఎక్కడలేని ముగ్ధత్వం ఆపాదించబడుతుంది. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉండే అనుబంధం, అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలు... కూడా మన ప్రపంచానికి రిస్క్ లేదు. ఎటొచ్చీ అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అనుబంధమే.. దాని అంతేదో తేల్చాలి అన్నంత నిద్రలేకుండా చేస్తుంది సమాజాన్ని! ఇక ఆ ఇద్దరి మధ్య ప్రేమ, ఇష్టం వంటి పదాలు సమాజపు పాము చెవులకు విన్పిస్తే ఇంకేమైనా ఉందా? పుకార్లని షికారు చేయించి ఇద్దరి మనసులు విరిచేసి పైశాచికత్వం నిరూపించుకోదూ...?

నేను ICWAI చదివేటప్పుడు నీలిమా కిరణ్ అని ఓ ఆత్మీయనేస్తం ఉండేది. సబ్జెక్టుల్లో ఒకరికొకరు సహాయపడడం దగ్గర్నుండి, ఒకరి అనుభూతులు మరొకరు షేర్ చేసుకోవడం వరకూ ఇద్దరం వేరైనా ఇద్దరం ఒక్కరమే అన్నంత సాన్నిహిత్యం ఉండేది. నూటికి నూరుశాతం అది స్నేహం! దురదృష్టవశాత్తు మా స్నేహానికి కల్మషం ఆపాదించబడింది. ఒకరోజు కాలేజీ డైరెక్టర్ ఈ విషయమై తన మనసుని గాయపరిచేలా మాట్లాడడం తెలిసి నేనూ కలత చెంది తెలిసీ తెలియని ఆ వయస్సులో ముప్పైకి పైగా స్లీపింగ్ పిల్స్ మింగి చావుకు కొన్ని నిముషాల దూరం వరకూ వెళ్లి వచ్చాను. సమాజపోకడలపై అప్పటి నుండి ఆ అసంతృప్తి మేటవేసుకుపోయి ఉంది. ఇదిగోండి.. ఈరోజు రమణి గారు “మాటే మంత్రం” అనే పోస్టులో..

అన్ని అద్భుతమైన వ్యక్తీకరణలను ప్రేమకి ముడిపెట్టి మిగతా మానవ సంబంధాలకు(అవి ఏమైనా కావొచ్చు,స్నేహం, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముడు) ఎంత అన్యాయం చేశారో అస్సలు ఈ సినిమా రచయితలకు తెలియదు...

అని రాస్తే మనసు ఓ క్షణం చలించింది. హృదయం, ప్రేమ, ఇష్టం వంటి పదాలను, మనుషుల మధ్య అనుభూతులను భ్రష్టుపట్టిస్తూ నిజమైన అనుబంధాలను సమాజం ఎంత నిర్థాక్షిణ్యంగా కాలరాస్తుందో నా స్వీయ అనుభవంతో రాద్దామని చేసిన ప్రయత్నమే ఇది. తన పోస్ట్ ద్వారా ఈ ఆలోచనను రేకెత్తించిన రమణి గారికి ధన్యవాదాలు.

Tuesday, November 04, 2008

అలజడులకు అక్షరరూపం

తెలుగు బ్లాగ్లోకంలో మిత్రులు చేసే ఎన్నో అద్భుతమైన టపాలను చదివేటప్పుడు కొన్ని క్షణాలపాటు మనసులో ఏ మూలనో వెలితి మెలిపెడుతుంది. "సాంకేతికాలు"ని సక్రమంగా నిర్వహిస్తే చాల్లే అని అప్పటికప్పుడు సర్ధిచెప్పుకుని సాగిపోతూ ఉన్నాను. విభిన్న ఆలోచనలు మనసుని ముప్పిరిగొని అస్పష్టంగా కదలాడేటప్పుడు "వాటి ఘోషకి అక్షరరూపం ఇస్తే ఆ అలజడి శాంతిస్తుంది కదా" అని మళ్లీ మనసు మూలిగినా గొంతునొక్కిపెడుతూ వచ్చాను. ఈ నింయతృత్వపోకడలు చూసి మనసెక్కడ తిరగబడుతుందోనన్న భయంతో కంప్యూటర్ ఎరా మేగజైన్ లో సంపాదకీయాల్లో ఓ చిన్న వెసులుబాటు కల్పించుకుని నెలకోసారైనా గళాన్ని విప్పుతున్నాను. అయినా అసంతృప్తి తొలగడం లేదు. తెల్లారిలేచించి మొదలు ఆదమరిచి నిద్రపోయేవరకూ మనసులో ఎంతో భావసంఘర్షణ జరుగుతూ ఉంటోంది. ఎలాగైనా అప్పుడప్పుడు కొంత తీరుబడి చేసుకుని దానికి ఓ రూపం సంతరించి ఇవ్వకపోతే ఆ సంఘర్షణ మనసులో చిక్కుముడులుగా ముడిపడిపోతుందేమోనని.. ఎంతోకాలం ఊగిసలాటకు తెరదించి ఇన్నాళ్లకు "మనసులో.." పేరిట ఈ బ్లాగుకి శ్రీకారం చుట్టాను. అందరి ఆదరాభిమానాలు లభిస్తాయని ఆకాంక్షిస్తూ..

- నల్లమోతు శ్రీధర్